iDreamPost
android-app
ios-app

దంచికొట్టిన రింకూ సింగ్.. బెస్ట్ ఫినిషర్ అని నిరూపించుకున్నాడుగా!

  • Author Soma Sekhar Published - 09:19 AM, Tue - 3 October 23
  • Author Soma Sekhar Published - 09:19 AM, Tue - 3 October 23
దంచికొట్టిన రింకూ సింగ్.. బెస్ట్ ఫినిషర్ అని నిరూపించుకున్నాడుగా!

రింకూ సింగ్.. ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన నయా సంచలనం. ఒకే ఒక్క మ్యాచ్ తో వరల్డ్ క్రికెట్ చూపును తనవైపు తిప్పుకున్నాడు. అయితే ఆ ఇన్నింగ్స్ గాలివాటు ఇన్నింగ్స్ కాదని, టీమిండియాకు తానో బెస్ట్ ఫినిషర్ గా మారబోతున్నట్లు సంకేతమని చాలా తక్కువ టైమ్ లోనే రుజువు చేశాడు రింకూ సింగ్. తాజాగా మరోసారి తనలో ఉన్న బెస్ట్ ఫినిషర్ ను ప్రపంచానికి చూపించాడు రింకూ. ఏషియన్ గేమ్స్ లో భాగంగా జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా. జైస్వాల్ సెంచరీతో కదం తొక్కగా.. రింకూ సునామీ ఇన్నింగ్స్ తో నేపాల్ బౌలర్లను బెంబేలెత్తించాడు.

మహేంద్ర సింగ్ ధోని, దినేశ్ కార్తీక్ తర్వాత టీమిండియాలో బెస్ట్ ఫినిషర్ ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. జట్టులో ఎంతో మంది స్టార్ బ్యాటర్లు ఉన్నప్పటికీ ఫినిషర్ బాధ్యత తీసుకునే ఆటగాడు కనిపించలేదు. ఆ స్థానానికి తానే సరైన వాడినంటూ జట్టులో దూసుకొచ్చాడు యువ సంచలనం రింకూ సింగ్. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ చిచ్చర పిడుగు.. ఫినిషర్ గా తానెంత డేంజరసో ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. తాజాగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో దుమ్మురేపుతున్నారు ఇండియన్ బ్యాటర్లు. నేపాల్ తో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది.

యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ విధ్వంసకర సెంచరీతో చెలరేగితే.. చివర్లో తన ఫినిషింగ్ పవర్ చూపెట్టాడు రింకూ సింగ్. నేపాల్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. 246 స్ట్రైక్ రేట్ తో రెచ్చిపోయాడు. జైస్వాల్ ఔటైన ఆనందాన్ని వారికి ఎంతో సేపు ఉంచలేదు రింకూ. క్రిజ్ లోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా.. రింకూ కొట్టిన నాలుగు సిక్సర్లలో మూడు సిక్స్ లు చివరి ఓవర్లో కొట్టినవే కావడం గమనార్హం. దీంతో మరోసారి చివరి ఓవర్ లో తానెంత ప్రమాదకరమో తెలియజెప్పాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ ను టీమిండియా బౌలర్లు కట్టడి చేస్తున్నారు. ప్రస్తుతం నేపాల్ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. మరి రింకూ సింగ్ రూపంలో టీమిండియాకు బెస్ట్ ఫినిషర్ దొరికాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.