iDreamPost

Thank you movie review థాంక్ యు రివ్యూ

Thank you movie review  థాంక్ యు రివ్యూ

ఈ ఏడాది ప్రారంభంలో బంగార్రాజు రూపంలో నాన్నతో కలిసి హిట్టు అందుకున్న నాగ చైతన్య కొత్త సినిమా థాంక్ యు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు నిర్మాణం, విక్రమ్ కె కుమార్ దర్శకత్వం, కలర్ఫుల్ క్యాస్టింగ్ లాంటి ఆకర్షణలు మెండుగా ఉండటంతో నిన్న రాత్రి కొన్ని కేంద్రాల్లో వేసిన స్పెషల్ ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చింది. బజ్ అంతగా కనిపించకపోయినా టాక్ నే నమ్ముకుని బరిలో దిగింది థాంక్ యు. ఈ మధ్య ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్స్ పెద్దగా రాలేదు. మాస్ హీరోలు చేసిన కమర్షియల్ బొమ్మలూ ఫెయిల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఈ థాంక్ యు అంచనాలను అందుకుందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

ఉద్యోగం కోసం అమెరికా వస్తాడు అభిరామ్(నాగ చైతన్య). ఎయిర్ పోర్ట్ లో పరిచయమైన ప్రియ(రాశిఖన్నా)తో పరిచయం ప్రేమగా మారి లివిన్ రిలేషన్ దాకా వెళ్తుంది. ఆమె సహాయంతోనే అభి స్వంతంగా ఒక యాప్ ని రూపొందించి దాని ద్వారా పెద్ద స్థాయికి చేరుకుంటాడు. అంతా నేనే చేశాననే అహం మొదలై ప్రియా అతన్ని వదిలి వెళ్లే పరిస్థితి వస్తుంది. అభి ఇంత పేరు సంపాదించుకోవడానికి కారణమైన రావు(ప్రకాష్ రాజ్)మరణం తనలో మార్పుకు శ్రీకారం చుడుతుంది. జీవితంలో తనకు సహాయం చేసిన వాళ్లకు థాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఇండియా వస్తాడు అభిరాం. ఆ తర్వాత జరిగేదే అసలు స్టోరీ

నటీనటులు

ఏ హీరోకైనా వాళ్ళకే ఫిట్టయ్యే కొన్ని పాత్రలుంటాయి. వాటికే సూటవుతారు. కాదని రిస్క్ చేయడానికి వెళ్తే ఫలితం రివర్స్ అవ్వొచ్చు. చైతుకి అభిరాం లాంటి క్యారెక్టర్లు పర్ఫెక్ట్. చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. తన పరిమితికి మించిన కొన్ని బరువైన ఎమోషన్స్ పలికించాల్సి వచ్చినా ఫైనల్ గా మెప్పిస్తాడు. మూడు షేడ్స్ లో ఒదిగిపోయిన తీరు బాగుంది. ఫ్లాష్ బ్యాక్ లో మీసకట్టు లేకుండా ఇంటర్ కుర్రాడిగా కొంచెం ఇబ్బందిగా కనిపించినా మిడిల్ ఏజ్ లో మాత్రం అందరికీ నచ్చేస్తాడు. అంతరాత్మతో మాట్లాడే సీన్స్ లో హావభావాలు బాగా పలికాయి. మనం తరహాలో చైతుని విక్రమ్ బాగా వాడుకున్నాడు

రాశి ఖన్నా మెయిన్ హీరోయినే కానీ దొరికిన స్క్రీన్ స్పేస్ తక్కువే. సెకండ్ హాఫ్ లో దాదాపు కనిపించదు. కానీ ఉన్నంతలో అందంగా ఆకట్టుకుంది. పెర్ఫార్మన్స్ పరంగా పెద్దగా చేసేందుకు స్కోప్ దక్కలేదు. మాళవిక నాయర్ హోమ్లీగా బాగుంది. ప్రకాష్ రాజ్, ఈశ్వరిరావులు ఉన్నది కాసేపే అయినా ఉనికిని చాటుకున్నారు. అవికా గోర్ లో మునుపటి కళ లేదు.మరీ బక్కచిక్కింది. తన హడావిడితో డబ్బింగ్ తో మేనేజ్ చేశారు. అలా కాసేపు కనిపించి మాయమయ్యేవాళ్ళలో సంపత్ రాజ్ లాంటి సీనియర్లను తీసుకున్నారు. చైతుకి కాలేజీ శత్రువుగా నటించిన సుశాంత్ రెడ్డి బాగున్నాడు కానీ ఇంకొంచెం బెటర్ ఛాయస్ అయితే బెటరనిపించింది

డైరెక్టర్ అండ్ టీమ్

చాలా కాంప్లికేటెడ్ కథలను తన స్క్రీన్ ప్లేతో మేజిక్ చేయడం విక్రమ్ కె కుమార్ ప్రత్యేకత. ముఖ్యంగా మనంలో చేసిన మాయాజాలం అంత సులభంగా మర్చిపోలేం. 24లో సూర్యని హీరో కం విలన్ గా ప్రెజెంట్ చేసిన తీరు, 13Bలో టీవీ సీరియల్ హారర్ ని డీల్ చేసిన విధానం అద్భుతంగా పేలాయి. ఇష్క్ లాంటి సింపుల్ లవ్ స్టోరీని కూడా తనదైన రీతిలో హ్యాండిల్ చేయడం వల్లే అది అది అంత పెద్ద హిట్ అయ్యింది. ఫ్లాప్ అయినా సరే నాని గ్యాంగ్ లీడర్ లో విక్రమ్ తీసుకున్న పాయింట్ చాలా యూనీక్. ఫలితం తేడా వచ్చినప్పటికీ తన ఆలోచనలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో మరోసారి రుజువు చేసింది. ఈ ఉదాహరణలు ఇప్పుడెందుకు అంటారా.

అక్కడికే వద్దాం. థాంక్ యు చాలా సింపుల్ స్టోరీ. ఇందులో ఎలాంటి ప్రత్యేకత లేదు. ఒక వ్యక్తి మధ్యవయసుకు వచ్చాక తాను జీవితంలో సాధించిన విజయాలకు కారణమైన వాళ్లకు థాంక్స్ చెప్పడానికి పుట్టి పెరిగిన ఊళ్ళకు వెళ్లడమే మెయిన్ పాయింట్. రచయిత బివిఎస్ రవి కథ చెప్పినప్పుడు దిల్ రాజు ఎందుకు ఎగ్జైట్ అయ్యారో అర్థం కాదు కానీ ఎలాంటి స్పెషాలిటీ లేని ఇలాంటి లైన్ ని టేకప్ చేసేందుకు విక్రమ్ ఒప్పుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ఏ డెబ్యూ డైరెక్టరైనా తీయగలడు. మూడు ఎపిసోడ్లను ఇంటర్ లింక్ చేస్తూ అభిరాం లైఫ్ జర్నీని విక్రమ్ అంత క్వాలిటీగా చూపించలేకపోవచ్చు కానీ దగ్గరగా అయితే వెళ్లగలడు. అదే ఇందులో సమస్య.

ఇలాంటివి గతంలో చూశాం. ఒరిజినల్ తమిళ వెర్షన్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిపోయిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ తెలుగులో రవితేజ చేసినా ఫలితం దక్కలేదు. కారణం ఫాలోయింగ్ ఉన్న హీరోని మరీ అంత సాఫ్ట్ రోల్ లో జనం రిసీవ్ చేసుకోలేకపోయారు. నాగచైతన్యకూ అదే ఇబ్బంది వచ్చింది. ఫ్యాన్స్ ని సంతృప్తిపరిచేందుకు వైజాగ్ ఎపిసోడ్ లో కొన్ని సీన్లు పెట్టారు అవి వాళ్ళను పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాయి. కథనం ఎలా ఉన్నా విక్రమ్ టేకింగ్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. థాంక్ యులోనూ అంతే. యుఎస్ నుంచి నారాయణపురం అక్కడి నుంచి వైజాగ్ ఇలా స్టోరీని షిఫ్ట్ చేసుకుంటూ పోయినప్పటికీ తన పొయెటిక్ ప్రెజెంటేషన్ గమనించవచ్చు

థాంక్ యులో అసలు సమస్య డ్రామా లేకపోవడం ప్లస్ తగినన్ని మలుపులు సెట్ చేసుకోకపోవడం. ఇదేమి క్రైమ్ థ్రిల్లర్ కాదుగా వాటిని పెట్టడానికి అనొచ్చు. నిజమే. కానీ ఎంత ఎమోషనల్ జర్నీ అయినా సరే ప్రేక్షకుల ఊహలకు అతీతంగా కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండాలి. అవి లేకుండా అంతా ఊహించినట్టే జరుగుతూ వెళ్తే ఇంకెందుకు థియేటర్ కు రావడమనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది. కొన్ని క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్స్ బాగా కుదిరితే కొన్ని సరిగా సెట్ అవ్వలేదు. ఉదాహరణగా అభిరాం – చిన్నూల అన్నా చెల్లి ఎపిసోడ్ ప్రాపర్ గా కుదరలేదు. అందుకే ఎన్నో ఏళ్ళ తర్వాత వాళ్ళు కలుసుకున్నా ఈ ఎమోషన్ ని ఫీల్ కాము.

సెకండ్ హాఫ్ లో పోకిరి కటవుట్ ట్రాక్ ని మాస్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా రాసుకున్న విక్రమ్ అలాంటివి మరికొన్ని పెట్టేసుంటే అసంతృప్తి శాతం తగ్గేది. ప్రేమమ్-మజిలీ చాయలు, పాత్ర చిత్రణలో పోలికలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. కొత్తగా అనిపించే పాత్రలు ఏవీ ఉండవు. అభిరామ్ థాంక్స్ చెప్పడానికి ఊళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ మెస్మరైజ్ చేసే మూమెంట్స్ ఏదైనా ఉండేలా కొత్తగా ఆలోచించి ఉంటే బాగుండేది. ఆఖరికి రాజకీయనాయకుడిగా మారిన శత్రువు శర్వాతో సింపుల్ గా ఓ వేదాంతం డైలాగు చెప్పించి మమ అనిపించారే తప్ప ఎక్కడిక్కడ ఫ్లాట్ గా వెళ్లిపోవడమే థాంక్ యు గ్రాఫ్ ని ఎక్కువ సేపు పైకి వెళ్లనివ్వకుండా చేసింది. అదే ఫలితాన్ని శాశిస్తుంది

ఫస్ట్ హాఫ్ లో పెట్టిన చైతు రాశి ఖన్నా లిప్ లాక్ కిస్సులు అవసరం లేకపోయినా జొప్పించడం కేవలం యూత్ ని టార్గెట్ చేసే. నిజానికి అంత గొప్ప ప్రేమ వాళ్ళ మధ్య పుట్టిందా అనే స్థాయిలో ఆ ట్రాక్ కన్విన్స్ చేయలేకపోయింది. తర్వాత మాళవిక నాయర్ తో సైతం ప్రేమకథ అనుకున్నంత అందంగా లేదు. ప్రేమ తాలూకు భావోద్వేగాలు చూసేవాళ్లు మనసును తాకినప్పుడే జనం చప్పట్లు కొడతారు. అంతే తప్ప హత్తుకునేలా అనిపించే రెండు మూడు సంభాషణలతో కాదు. ఇక సెకండ్ హాఫ్ లో అభిరాంకి లవ్ ప్రసక్తే రాకుండా శర్వాతో శత్రుత్వంతో చిన్నూతో రాఖీ ప్రహసనంతో మేనేజ్ చేయడంతో ఏదో మిస్సవుతున్నట్టు అనిపించినా ఓకే పర్లేదు కదానే రీతిలో గడిచిపోతుంది

థాంక్ యు ముమ్మాటికీ బ్యాడ్ ఫిలిం అయితే కాదు. కాకపోతే థియేటర్ ఎక్స్ పీరియన్స్ కు సంబంధించి కరోనా తర్వాత జనాల ఎక్స్ పెక్టేషన్స్ లో చాలా మార్పులు వచ్చాయి కాబట్టి వాటిని అందుకోవడం ఇలాంటి వాటికి చాలా కష్టం. యూత్ కొంత మేరకు కనెక్ట్ అయినా ఫ్యామిలీ జనాలకు బాగా నచ్చే అంశాలు అంతగా లేకపోవడం వసూళ్లను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. థాంక్ యు చెప్పడం నిజ జీవితంలో తేలికైన వ్యవహారమే అవ్వొచ్చు. కానీ అది తెరపై చెబుతున్నప్పుడు మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించాలి. అలాంటి స్పెషల్ తక్కువ మోతాదులో ఉన్నప్పుడు రేపొచ్చే రిజల్ట్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. చూద్దాం

తమన్ పాటల కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. ఇలాంటి వాటికి సాంగ్స్ కొండంత అండగా నిలవాలి. కానీ ఫీల్ ఉన్నప్పటికీ ఏ పాటా ఏదైనా యాప్ కెళ్ళి మళ్ళీ మళ్ళీ విందాం అనిపించే స్థాయిలో లేవు. బీజీఎమ్ మాత్రం ఎక్కువ సౌండ్ లేకుండా ప్యూర్ గా ఉంది. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అనుభవంలోని గొప్పదనాన్ని మరోసారి చాటింది. ఆయన కన్నుతో దర్శకుడి ఆలోచనలను ఆవిష్కరించిన తీరు థాంక్ యు మరీ ఎక్కువ కిందపడకుండా కాపాడింది. ఎడిటింగ్ బాధ్యతలు సంపూర్ణంగా నెరవేరాయి. దిల్ రాజు నిర్మాణం యాభై సినిమాల నుంచి చూస్తుంటే ఉన్నాం. ప్రత్యేకంగా పొగిడేది చెప్పేది ఏమి లేదు

ప్లస్ గా అనిపించేవి

చైతు నటన
పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం
కొంత వైజాగ్ ఎపిసోడ్
నిడివి

మైనస్ గా తోచేవి

ఫ్లాట్ నెరేషన్
లో ఎమోషన్స్
పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్స్
రొటీన్ స్టోరీ

కంక్లూజన్

ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి. కమర్షియల్ అంశాలు ఎక్కువగా జొప్పించకుండా నేర్పుగా మెప్పించాలి. రెగ్యులర్ డైరెక్టర్లకు సాధ్యం కాని టిపికల్ సబ్జెక్టులతో మెప్పించిన విక్రమ్ కె కుమార్ ఈ థాంక్ యుని వాటి సరసన నిలబెట్టలేకపోయినా ఉన్నంతలో బలం తక్కువగా ఉన్న ఈ కథను ఎవరూ బెటర్ గా డీల్ చేయలేరనే అభిప్రాయం కలిగించారు. ఎప్పుడూ చూడనిది చాలా కొత్తగా అనిపించేది కావాలంటే మాత్రం థాంక్ యుని ఓటిటిలో వచ్చేదాకా ఆగొచ్చు. లేదూ కొన్ని సున్నితమైన ఎమోషన్లు ఉంటే చాలు నేను చైతు ఫాన్ అనుకుంటే హ్యాపీగా టికెట్ బుక్ చేసుకుని వెళ్లిపోవచ్చు. కాకపోతే ఇది ఫ్లైట్ జర్నీ కాదు ట్రైన్ ప్రయాణం అంతే

ఒక్క మాట – సింపుల్ థాంక్స్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి