iDreamPost
android-app
ios-app

Spy Movie Review: నిఖిల్ నటించిన ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే?

  • Published Jun 29, 2023 | 2:39 PM Updated Updated Jun 29, 2023 | 2:39 PM
Spy Movie Review: నిఖిల్ నటించిన ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే?

టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. పెద్ద హీరోలతో పాటుగా చిన్న హీరోలు సైతం పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ఇక కార్తికేయ 2 చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం’స్పై’. దేశభక్తి కాన్సెప్ట్ తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో? రివ్యూలో చూద్దాం.

కథ

జై(నిఖిల్) ఓ ‘రా’ ఇంటెలిజెన్స్ లో ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. ఇక శ్రీలంకలో తనకు అప్పగించిన మిషన్ ను పూర్తి చేసుకుని రాగానే.. రా చీఫ్ శాస్త్రి(మకరంద్ దేశ్ పాండే) ఓ మిషన్ ను జైకి అప్పగిస్తాడు. ఆ మిషన్ ఏంటి? ఈ మిషన్ కు సుభాష్ వర్దన్ (ఆర్యన్ రాజేశ్)కి సంబంధం ఏంటి? ఇక ఈ కథలో ఖాదిర్ ఖాన్, అబ్దుల్ రెహ్మాన్ (జిషుసేన్ గుప్తా) ఎవరు? అసలు జై మిషన్ సక్సెస్ అయ్యిందా? లేదా? అన్నదే స్పై సినిమా స్టోరి.

విశ్లేషణ..

సాధారణంగా స్పై సినిమాలు అనగానే మనకు జేమ్స్ బాండ్ సినిమాలే గుర్తుకు వస్తాయి. తెలుగులో అయితే సూపర్ స్టార్ కృష్ణ నటించిన’గుఢాచారి 116′ తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఇక స్పై లాంటి అనేక సినిమాలను తెలుగు తెరపై చూశాం. ఆ సినిమాలనే స్పై డైరెక్టర్ అక్కడక్కడ ఫాలో అయినట్లు కనిపిస్తుంది ఈ చిత్రంలో. ఇక తొలిసారి మెగా ఫోన్ పట్టిన ఎడిటర్ గ్యారీ బి హెచ్ కథను డీల్ చేయడంలో తడబడ్డట్లుగా కనిపిస్తుంది. ఇక కథ విషయానికి వస్తే.. జోర్డాన్ లో అక్రమంగా ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న ఖాదిర్ ఖాన్ ను రా ఏజెంట్ సుభాష్ చంపడంతో మెుదలౌవుతుంది. ఆ తర్వాత ఏజెంట్ సుభాష్ ను ఎవరో చంపేస్తారు. దాంతో రా ఏజెంట్ సుభాష్ ను చంపింది ఎవరో తెలుసుకునే మిషన్ ను జై(నిఖిల్)కు అప్పగిస్తాడు రా చీఫ్. ఇక ఈ మిషన్ కోసం స్టార్ట్ అవుతాడు జై.

ఈ క్రమంలోనే జై కి ఏజెంట్ వైష్ణవి(ఐశ్వర్య మేనన్) పరిచయం అవుతుంది. వీరికి గతంలో ఓ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఇక మిషన్ లో సన్నివేశాలు అన్ని ఉత్కంఠగా సాగుతున్న ఫీల్ ఏమాత్రం కనిపించదు. ట్రైలర్ లో చూసినంత ఇంటెన్సన్ సీన్లు లేవనే చెప్పాలి. మిషన్ ఇలా సాగుతున్న క్రమంలోనే ఓ మంచి సన్నివేశంతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఫస్టాఫ్ ఓ మోస్తారుగా సాగినా కానీ.. సెకండాఫ్ కు వచ్చేసరికి కథలో స్పీడ్ పెరుగుతుంది. ఖాదిర్ కోసం వెళ్లిన జైకి కొన్ని కొత్త విషయాలతో పాటుగా మన దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్ మిస్ అయ్యిందన్న విషయం తెలుస్తుంది. ఆ ఫైల్ కోసం నిఖిల్ చేసే పోరాటాలు కొంతవరకు ఆకట్టుకుంటాయి.

ఇక ఆ ఫైల్ ఎవరి చేతికి చిక్కింది? ఫైనల్ గా జై ఎవరిని చంపాడు? తెలుసుకోవాలంటే మీరు థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే! ట్రైలర్ తోనే నిఖిల్ ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్నాడని చెప్పాలి. పైగా కార్తికేయ 2 లాంటి చిత్రం తర్వాత అతడి నుంచి వస్తున్న చిత్రం కావడంతో.. సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే హాలీవుడ్ రేంజ్ లో మేకింగ్ దృశ్యాలను ట్రైలర్ లో చూపించారు. ఇక ఈ సినిమాలో ఎన్నో సందేహాలను ప్రేక్షకులకే వదిలేశాడు డైరెక్టర్.

ఎవరెలా చేశారంటే?

నిఖిల్ ఈ సినిమాకు వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇక ఏజెంట్ గా ఫర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. కెరీర్ లో ఇప్పటి వరకు ఇలాంటి పాత్రలు చెయ్యలేదు నిఖిల్. అయినప్పటికీ అద్బుతమైన నటన కనబరిచాడు. ఇక ఏజెంట్ కమల్ పాత్రలో కమెడియన్ అభినవ్ గోమఠం ఆకట్టుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో యాక్షన్ కంటే కామెడీనే ఎక్కువ చేశాడు. ఇక హీరోయిన్ ఐశ్వర్య తన పరిధి మేరకు నటించింది. మిగతా పాత్రలు కథకు అనుగుణంగా తమ పని తాము చేసుకుంటూ పోయారు. అయితే పోసాని, ఆర్యన్ రాజేష్, సచిన్ ఖేడ్కర్, సురేష్, మకరంద్ దేశ్ పాండే లాంటి మంచి నటులు ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వాడుకోవడంలో.. డైరెక్టర్ సఫలం కాలేదనే చెప్పాలి.

ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ తమ కెమెరా పనితనంతో మంచి మార్కులే కొట్టేశారు. శ్రీచరణ్ పాకాల బ్యాగ్ గ్రౌండ్ స్కోరుతో సినిమా పరుగులు పెట్టిందనే చెప్పాలి. విశాల్ చంద్రశేఖర్ పాటలు గుర్తుపెట్టుకునే విధంగా లేవు. సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాను రిచ్ నెస్ లో చూపించడానికి నిర్మాత ఎక్కడా వెనకాడలేదనే చెప్పాలి. ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ దగ్గరికి వస్తే.. తొలి సినిమా కావడంతో దర్శకుడు గ్యారీ బీహెచ్ కొద్దిగా తడబడ్డాడు. స్వతాహగా ఎడిటర్ అయినా.. అక్కడక్కడ సీన్లను ల్యాగ్ చేశాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ స్పై రోటీన్ గా మిషన్ కంప్లీట్ చేశాడు.