iDreamPost
android-app
ios-app

Samajavaragamana Movie Review: సామజవరగమన సినిమా రివ్యూ

  • Published Jun 29, 2023 | 6:34 PM Updated Updated Jun 29, 2023 | 6:34 PM
Samajavaragamana Movie Review: సామజవరగమన సినిమా రివ్యూ

టాలీవుడ్ లో వైవిద్యమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు హీరో శ్రీ విష్ణు. ఇక గతంలో వరుస హిట్లతో.. టాలీవుడ్ సక్సెప్ ఫుల్ హీరోగా వెలుగొందిన శ్రీవిష్ణు, ఈ మధ్య కాలంలో కాస్త వెనుకపడ్డాడు. అయితే ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ‘సామజవరగమన’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ తోనే మూవీపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేశాడు. అలాగే ప్రమోషన్స్ కూడా ప్రణాళిక పరంగా చేయడంతో.. ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఈ భారీ అంచనాల నడుమ తాజాగా విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉంది? శ్రీవిష్ణు హిట్ కొట్టాడా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

బాలసుబ్రహ్మణ్యం అలియాస్ బాలు(శ్రీవిష్ణు) థియేటర్ బాక్సాఫీస్ లో జాబ్ చేస్తుంటాడు. ఇక అతడి తండ్రి ఉమామహేశ్వరరావు(నరేశ్)కు వేల కోట్ల ఆస్తి ఉంటుంది. కానీ ఆ ఆస్తి అతడి సొంతం కావాలంటే.. డిగ్రీ పాసైతేనే అది అతడికి దక్కుతుందని బాలు తాత వీలునామ రాస్తాడు. దాంతో తండ్రిని ఎలాగైనా డిగ్రీ పాస్ చేయించాలని నానా తంటాలు పడుతుంటాడు బాలు. ఈ క్రమంలోనే అతడికి సరయు(రెబా మౌనిక జాన్) పరిచయం అవుతుంది. బాలు ప్రవర్తన నచ్చడంతో సరయు అతడితో లవ్ లో పడుతుంది. కానీ బాలుకు ఓ వీక్ నెస్ ఉంది. ప్రేమిస్తున్నాను అన్న అమ్మాయితో వెంటనే రాఖీ కట్టించుకుంటాడు బాలు. అలాంటి బాలు సరయు ప్రేమలో ఎలా పడ్డాడు? బాలు రాఖీ కట్టించుకోవడానికి రీజన్ ఏంటి? అసలు సరయు తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్)కి లవ్ మ్యారేజ్ అంటే ఎందుకు నచ్చదు? ఇంతకీ బాలు తండ్రి డిగ్రి పాసైయ్యాడా? లాస్ట్ కు బాలు, సరయులు ఎలా కలిశారు అనేదే మిగతా కథ.

విశ్లేషణ

సినిమా కథలో కొత్తదనం లేకున్నాగానీ అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు డైరెక్టర్ రామ్. ఫుల్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సామజవరగమనను తెరకెక్కించాడు దర్శకుడు. హిలేరియస్ కామెడీతో, ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ కథను సిద్దం చేసుకున్నాడు డైరెక్టర్. దానిని అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు రామ్ విజయం సాధించాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రతి పాత్రకు కామెడీ టచ్ ఇచ్చాడు. ఇక కథ విషయానికి వస్తే.. తండ్రిని ఎలాగైనా డిగ్రీ పాస్ చేయించడం కోసం కొడుకు పడే ఇబ్బందులతో ఈ సినిమాని ప్రారంభించాడు. ప్రతీ సీన్ ను కామెడీ టచ్ ను ఇచ్చి.. కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలను రాసుకున్నాడు రామ్. హీరోయిన్ పరిచయం అయ్యాక ట్యూషన్ లో నరేష్, హీరోయిన్ చేసే కామెడీ, రఘు బాబు వేసే ప్రశ్నలు పొట్ట చెక్కలయ్యేలా ఉన్నాయి.

ఇక ప్రేమ పేరుతో అమ్మాయిలు చేసే మోసాలపై శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఇలా యూత్ ను ఆకట్టుకునే సీన్లతో ఫస్టాప్ మెుత్తం సరదాగా సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కూడా సెకాండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్ మెుత్తాన్ని పూర్తి వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ముఖ్యంగా వెన్నెల కిశోర్ కుల శేఖర్ పాత్రలో చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. అయితే అక్కడక్కడ కొన్ని సీన్లు లాగ్ అయినట్లు అనిపిస్తుంది. మరి బాలు తన లక్ష్యాన్ని చేరుకున్నాడ? లేదా? అన్నది తెలుసుకోవాలంటే థియేటర్లలో నవ్వులు పూయిస్తున్న సామజవరగమన చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే?

శ్రీవిష్ణు తన మార్క్ కామెడీ టైమింగ్ ను మరోసారి రుజువు చేసుకున్నాడు. బాలు పాత్రలో జీవించేశాడు. కామెడీ ఒక్కటే కాదు కావాల్సిన సన్నివేశాల్లో ఎమోషన్స్ ను కూడా పండించాడు. ఇక నరేశ్ తండ్రి పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేశాడనే చెప్పాలి. అంత అద్భుతమైన నటనను ఈ చిత్రంలో చూపించాడు నరేశ్. ఈ పాత్రను నరేష్ తప్ప ఎవరూ చేయలేరు అనే విధంగా యాక్ట్ చేశాడు. ఇక హీరోయిన్ రెబా మౌనిక తన పరిధి మేరకు నటించింది. వెన్నెల కిశోర్, సుదర్శన్, రఘుబాబు ప్రేక్షకులను బాగానే నవ్వించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే.. గోపీ సుందర్ సంగీతం వినసొంపైన విధంగా ఉన్నా.. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చూడముచ్చటగా ఉంది. ఇక సినిమాలో డైలాగ్స్ చాలా ప్లస్ పాయింట్ కాగా.. నిర్మాణ విలువలు మూవీకి తగ్గట్లుగా ఉన్నాయి. ఇక సామజవరగమన ఫ్యామిలీ మెుత్తం కడుపుబ్బా నవ్వే కామెడీ మూవీ.