iDreamPost
iDreamPost
ఒకప్పుడు నేను శైలజ లాంటి క్యూట్ లవ్ స్టోరీస్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న రామ్ ఎప్పటి నుంచో మాస్ ఇమేజ్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అన్నేళ్ల నిరీక్షణకు ఫలితం పూరి తీసిన ఇస్మార్ట్ శంకర్ రూపంలో రెండేళ్ల క్రితం దక్కింది. దాని విజయానికి కారణాలు ఏవైనా జనం తనను కమర్షియల్ పాత్రల్లోనే చూడాలనుకుంటున్నారని రామ్ ఫిక్స్ అయ్యాడు కాబోలు. ఆ మధ్య చేసిన రెడ్ ఇప్పుడీ ది వారియర్ కూడా అదే కోవలోకి వచ్చాయి. కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి డైరెక్ట్ చేసిన ఈ కాప్ ఎంటర్ టైనర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ వారియర్ చేసిన యుద్ధంలో రామ్ గెలిచాడా లేదా చూద్దాం
కథ
కర్నూలులో డాక్టర్ పిజి చేసేందుకు హైదరాబాద్ తో నుంచి తల్లి(నదియా)తో కలిసి వస్తాడు సత్య(రామ్). అక్కడ రేడియో స్టేషన్ లో ఆర్జెగా పని చేసే విజిల్ మహాలక్ష్మి(కృతి శెట్టి)తో పరిచయం ప్రేమగా మారుతుంది. స్థానికంగా పరమ దుర్మార్గుడైన గురు(ఆది పినిశెట్టి) చేసే హత్యలు చూసి తట్టుకోలేక అతనికి ఎదురుతిరుగుతాడు సత్య. దీనికి ప్రతీకారంగా గురు సత్యని దారుణంగా చావ చితకబాది ఊరి నుంచి వెళ్లిపోయేలా చేస్తాడు. రెండేళ్ల తర్వాత సత్య అదే ఊరికి పోలీస్ ఆఫీసర్ గా తిరిగి వచ్చి గురుకి చెక్ పెట్టడం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఇద్దరికీ క్యాట్ అండ్ మౌస్ గేమ్ మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి జరిగేది అసలు స్టోరీ
నటీనటులు
రామ్ లో ఉన్న ఎనర్జీ గురించి అందరికీ తెలిసిందే. ఫస్ట్ హాఫ్ లో కూల్ బాయ్ గా, రెండో సగంలో పోలీస్ గా చక్కగా ఒదిగిపోయాడు. మొదటి వేషం చాలా సినిమాల్లో చూసిందే కాబట్టి కొత్తగా ఏమీ అనిపించదు కానీ ఖాకీ దుస్తులు వేసుకున్నాక డిఫరెంట్ గా అనిపిస్తాడు. పెర్ఫార్మన్స్ పరంగానూ వంక బెట్టేందుకు అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి క్యారెక్టర్స్ లో బెస్ట్ అనిపించిన బాలకృష్ణ, రవితేజ లాంటి వాళ్ళతో పోల్చలేం కానీ ఆ మీసకట్టుతో చెప్పే పవర్ ఫుల్ డైలాగులు మాస్ కి ఎక్కేలా ఉన్నాయి. కాకపోతే రామ్ తనో కంప్లీట్ మాస్ స్టార్ అనే భ్రమలోకి వెళ్ళిపోయి సబ్జెక్ట్ సెలక్షన్ లో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ముందు ముందు ఇబ్బందులు తప్పవు
కృతి శెట్టిది రేడియో జాకీగా అంతగా ప్రాధాన్యం లేని పాత్ర. మూడు పాటల్లో డాన్స్ చేసేందుకు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు ఉంది తప్ప తన వల్ల వచ్చిన ప్లస్ ఏమి లేదు. అది గుర్తొచ్చే కాబోలు ప్రీ క్లైమాక్స్ లో తనకో శివమణి టైపు ట్విస్ట్ ఇచ్చారు కానీ అదీ పేలలేదు. ఆది పినిశెట్టిది బాగున్నాడు. తను మాత్రమే గురుగా సూటవుతాడని చెప్పలేం కానీ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లను చూసి చూసి బోర్ కొట్టిన జనానికి సరైనోడు టైపులో కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తాడు. అజయ్, నదియా, శరణ్య ప్రదీప్ వృధా అయ్యారు. బ్రహ్మాజీది అందరి కంటే రొటీనే కానీ రెండు మూడు సీన్లు పడ్డాయి. కాసిన్ని అరవమొహాలు ఉన్నాయి వాళ్ళ గురించి చెప్పుకోవడం అనవసరం
డైరెక్టర్ అండ్ టీమ్
ఓపెన్ గా మాట్లాడుకుంటే లింగుస్వామి ఫామ్ లో లేని దర్శకుడు. అందుకే కోలీవుడ్ లో ఆఫర్లు ఇచ్చే స్టార్ హీరోలు లేక ఇక్కడికొచ్చి రామ్ ని పట్టేసుకున్నాడు. ఈయన పనితనంలో నైపుణ్యం ఎంత తగ్గిందో చెప్పడానికి సూర్య సికందర్, విశాల్ పందెం కోడి 2 చాలు. ఒకప్పటి ఆవారా క్రియేటివిటీ ఇప్పుడు లేదు. అయినా కూడా రామ్ గుడ్డిగా నమ్మడంటే స్టోరీలో నిజంగా అంత దమ్ముందా అనే అనుమానం ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు అందరికీ కలిగింది. ఈ మధ్య ప్రీ రిలీజ్ టైంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో రామ్ కూడా ఇలాంటి సబ్జెక్టు ఈ మధ్య కాలంలో వినలేదని, చాలా ఎగ్జైటింగ్ గా అనిపించిందని ఏవేవో చెప్పాడు. కానీ అవన్నీ కబుర్లేనని చెప్పక తప్పదు.
ఒక డాక్టర్ ఐపిఎస్ ఆఫీసర్ గా మారడం మంచి పాయింటే. నిజ జీవితంలోనూ అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ప్లాట్ తీసుకోవడం వరకు బాగుంది కానీ దాన్ని డెవలప్ చేసే ప్రాసెస్ లో లింగుస్వామి పది పదిహేనేళ్ల వెనక్కు వెళ్లిపోవడం ది వారియర్ ని చప్పగా మార్చేసింది. కేవలం సెకండ్ హాఫ్ కు సరిపడా కథ రాసుకుని ఇంటర్వెల్ ముందు వరకు ఏం చేయాలనేది అర్థం కాక టైం పాస్ కోసం రాసుకున్న డాక్టర్ ఎపిసోడ్ మొత్తం ఎన్నోసార్లు చూసిన వ్యవహారంలా అనిపిస్తుంది. ఎక్కడా భలే ఉందే అనిపించే మలుపులు కానీ ట్విస్టులు కానీ ఉండవు. అన్నీ ఊహించినట్టే సాగుతాయి. కొన్ని సన్నివేశాలు రిపీట్ అవుతూ విసుగు తెప్పిస్తాయి
పోలీస్ కథల్లో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. రాజశేఖర్ అంకుశం నుంచి రవితేజ క్రాక్ దాకా హీరో విలన్ మధ్య ఒకే తరహా క్లాష్ కనిపిస్తుంది. మధ్యలో ఒక క్రైమ్ లేదా మర్డర్ తీసుకుని దాన్ని బ్యాక్ గ్రౌండ్ లో నడిపిస్తూ అవసరమైన చోట ట్విస్టులు పెడుతూ స్క్రీన్ ప్లేని ఎంగేజ్ చేసేలా రాసుకోవడం వల్లే అవి అంత సక్సెస్ అయ్యాయి. క్రాక్ లో కానిస్టేబుల్ హత్య, కటారి కృష్ణ కూతురి ప్రేమ వ్యవహారం ఎంత గొప్పగా మెయిన్ స్టోరీలో సింక్ అయ్యాయో చూశాం. అవే చివరి దాకా మెయిన్ డ్రైవ్ గా కథను నడిపించాయి. కానీ ది వారియర్ లో అలాంటివి ఉండవు. ముందు సీన్లు రాసుకుని ఎలివేషన్లు ఇచ్చుకుని ఆ తర్వాత కథను సెట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది.
బహుశా రామ్ ఏది చేసినా ఎలా చూపించినా జనం ఎగబడి చూస్తారని లింగుస్వామి అనుకున్నాడేమో తెలియదు కానీ డ్రామా లేకుండా హీరో విలన్ ఎంత అరుచుకున్నా అది పండదు సరికదా చిరాకు తెప్పిస్తుందనే సత్యాన్ని ఇంత అనుభవం వచ్చాక కూడా మర్చిపోవడం విచారకరం. కొన్ని సీన్లు ఉన్నట్టుండి కట్ అయిపోతాయి. కొన్ని పాత్రలు పెద్ద బిల్డప్ ఇచ్చి చెప్పా పెట్టకుండా మాయమవుతాయి. ఎక్కడిక్కడ లింకులను ప్రాపర్ గా సెట్ చేయకుండా సగం ఉడికేసిన అన్నంలా వదిలేయడంతో ఒక ఫ్లోలో వెళ్తున్న ఫీలింగ్ కలగదు. రామ్ ఐపిఎస్ గా తిరిగి వచ్చే సీన్ కూడా ఎన్నోసార్లు చూసినట్టు అనిపించడం వల్లే విజిల్ వేసేవాడు కూడా ఆగిపోతాడు.
కమర్షియల్ సినిమాల్లో లాజిక్స్ అక్కర్లేదు. మాస్ ని తన్మయత్వంలో ముంచితే అవేమి పట్టించుకోడు. కెజిఎఫ్, విక్రమ్ లో జరిగింది అదే. కానీ లింగుస్వామి లాంటి అనుభవజ్ఞులు ఈ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అది వదిలేసి తాతల కాలంనాటి నెరేషన్ తో ఇప్పటి జెనెరేషన్ ని మెప్పిస్తామనుకుంటే వేడి సాంబార్ లో ఒళ్ళు ముంచినట్టే. హీరో పాత్రకు సింపుల్ ఇంట్రో ఇచ్చి వదిలేసిన లింగుస్వామి విలన్ గురుకి మాత్రం స్పెషల్ గా ఫ్లాష్ బ్యాక్ పెట్టడం మిస్ ఫైర్ అయ్యింది. అది ఎస్టాబ్లిష్ మెంట్ చేయడానికి బదులు ల్యాగ్ కు పనికొచ్చింది. స్పైడర్ లో మురుగదాస్ చేసిన పొరపాటు ఇదే. అరవ పైత్యం మనవాళ్ళు ఒప్పుకోరనే సత్యాన్ని హీరోలు గుర్తించాలి.
అలా అని ది వారియర్ ని కంప్లీట్ గా బ్యాడ్ ఫిలిం అనడం లేదు. ఏ 2000 సంవత్సరానికి ముందు వచ్చి ఉంటే పెద్ద హిట్ అయ్యేదేమో. కానీ నలభై కోట్లకు అమ్మేసినప్పుడు జనం థియేటర్లకు రావాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాదాసీదా కంటెంట్ తో పనవ్వదు. సినిమా చూస్తున్నంత సేపు రామ్ ని అంతగా ఎగ్జైట్ చేసింది ఇందులో ఏముందబ్బా అనే ప్రశ్న మెదడుని తొలుస్తూనే ఉంటుంది. ఒకటి రామ్ ప్రాక్టికల్ గా బయట ట్రెండ్ ఎలా ఉందో గమనించకపోయి ఉండొచ్చు. లేదా లింగుస్వామి గత కొన్నేళ్లలో వచ్చిన తెలుగు తమిళ సినిమాలను చూసుండకపోవచ్చు. వీటికి ఏది ఒకటి జరిగినా ది వారియర్ డీసెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అయ్యేది.
దేవిశ్రీప్రసాద్ సంగీతం పాటల వరకు పర్వాలేదనిపిస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కథనంలాగే సోసోగా సాగింది. తన మార్కు బీజీఎమ్ ఎక్కడా వినిపించదు. సుజీత్ వాసుదేవ్ ఛాయాగ్రహణం గురించి ఫిర్యాదు లేదు. పదే పదే హీరో విలన్ ల క్లోజ్ అప్ షాట్స్ తోనే లాగించేయమంటే ఆయన మాత్రం ఏం చేయగలడు. నవీన్ నూలి ఎడిటింగ్ లో కొంత కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. ల్యాగ్ కూడా ఎక్కువే. సాయిమాధవ్ బుర్రా కలంతో ఇలాంటి బలం లేని కథల నుంచి ఏం ఆశించగలం. అక్కడక్కడా పేలాయి కొన్ని పాత్రలు తమిళ డైలాగులు పలికితే వాటికి తెలుగు సింక్ ఇచ్చి మేనేజ్ చేశారు.. నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీగానే ఖర్చు పెట్టారు. కథలో కంటెంట్ కన్నా ఎక్కువగా కాంబినేషన్ ని నమ్మే ప్రొడ్యూసర్ కాబోలు.
ప్లస్ గా అనిపించేవి
పోలీస్ గా రామ్
కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు
మాస్ కి ఎక్కే పాటలు
మైనస్ గా తోచేవి
రొటీన్ కథా కథనాలు
చప్పగా సాగే ట్విస్టులు
లింగుస్వామి డైరెక్షన్
అరవ ఫ్లేవర్
కంక్లూజన్
పోలీస్ కథలకు వాళ్ళ జీపుకుండే స్పీడులాగా వేగంగా పరిగెత్తే కథనం అవసరం. అది లేనప్పుడు హీరో ఎంత అరిచినా విలన్ ఎంత కరిచినా లాభం ఉండదు. ది వారియర్ లో జరిగింది ఇదే. మాస్ ని ఎప్పుడూ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. సబ్జెక్టులో బలం లేకపోయినా తమ టేకింగ్ తో, టెక్నిక్ తో మేజిక్ చేస్తున్న లోకేష్ కనగరాజ్ లాంటి వాళ్ళతో పోటీ పడాలంటే లింగుస్వామి లాంటి సీనియర్లు తమ బుర్రలకు పదును పెట్టాలి. లేదంటే ఇలాంటి అవుట్ డేటెడ్ సినిమాలతో ఎవరినీ మెప్పించలేం. రామ్ మీద అభిమానం, రొటీన్ మాస్ బొమ్మల మీద విపరీతమైన ఇష్టం ఉంటే తప్ప ది వారియర్ మీ ఛాయస్ గా ఉండేందుకు ఫిట్ కాడు
ఒక్క మాటలో – వీక్ వారియర్