ajaykrishna
ajaykrishna
ఓవైపు పాన్ ఇండియా క్రేజ్ ఉన్న అనుష్క శెట్టి.. మరోవైపు రెండు వరుస బ్లాక్ బస్టర్స్ తో ఫామ్ లో ఉన్న నవీన్ పొలిశెట్టి.. వీరిద్దరూ కలిసి చేసిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. రారా కృష్ణయ్య ఫేమ్ మహేష్ బాబు చాలా ఏళ్లు గ్యాప్ తీసుకొని తెరకెక్కించిన సినిమా ఇది. నేటి యువత ఆలోచన విధానాలకు దగ్గరగా ఉన్న కథాంశం ఎంచుకొని.. దానికి తగిన విధంగా కామెడీ, ఎమోషన్స్ లాంటి మసాలాలు జోడించి రూపొందించాడు. సాంగ్స్, ట్రైలర్ తో ప్రామిసింగ్ గా అనిపించిన ఈ సినిమా.. తాజాగా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి యూవి క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ రోమ్ కామ్ డ్రామా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
ఈ కథ లండన్ లో మొదలవుతుంది. లండన్ లో అన్విత(అనుష్క) ఒక టాప్ చెఫ్. గతంలో తన తల్లికి డివోర్స్ కావడంతో.. అన్వితకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోతుంది. అయినా.. కూతురికి ఎలాగైనా పెళ్లి చేయాలని తల్లి కోరిక. ఇంతలోనే అన్విత లైఫ్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. కట్ చేస్తే.. పెళ్లి లేకుండానే సహజీవనం ద్వారా బిడ్డను కనాలని నిర్ణయించుకుంటుంది. దానికోసం ఐయూఐ(స్పెర్మ్ డోనర్) ప్రాసెస్ బెటర్ అనుకుంటుంది. ఈ క్రమంలో ఓ స్టాండప్ కామెడీ షోలో సిద్ధు పొలిశెట్టి(నవీన్)ని చూసి.. ఇతని స్పెర్మ్(వీర్యం) ద్వారా బిడ్డను కనాలని భావిస్తుంది. అక్కడినుండి ఏమైంది అనేది కథ. మరి ప్రేమ పెళ్లిపై నమ్మకం లేని అన్విత.. సిద్ధుని ఎలా అప్రోచ్ అయ్యింది? పెళ్లి, సంప్రదాయాలను బాగా నమ్మే సిద్ధు.. అన్విత కోరికను అంగీకరించాడా? అన్విత లైఫ్ లో జరిగిన ఊహించని పరిణామాలు ఏంటి? అనేవి తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
కొన్నాళ్ళుగా తెలుగు ప్రేక్షకులు కొత్త కథలు.. కొత్త కాన్సెప్ట్ లను యాక్సెప్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో చాలా సినిమాలు వచ్చినప్పటికీ.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కొత్త లైన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంటే.. వీర్యదానం(స్పెర్మ్ డోనర్) అనే కాన్సెప్ట్ తో మనం బాలీవుడ్ లో విక్కీ డోనర్ అనే మూవీ చూశాం. ఆ కథ కూడా వీర్యదానం కాన్సెప్ట్ తోనే రూపొందింది.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అదే సినిమా తెలుగులో కూడా నరుడా డోనరుడా పేరుతో రీమేక్ అయ్యింది. అయితే.. కాన్సెప్ట్ కొత్తదే అయినప్పటికీ.. ప్రేక్షకులను ఎంతవరకు ఎంగేజింగ్ గా ఉంచారనేది పాయింట్.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. ఈ కాన్సెప్ట్ హాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించకపోవచ్చు. బట్ తెలుగు ప్రేక్షకులకు కొత్తదే. ఎందుకంటే.. వీర్యదానం అనే పాయింట్ చుట్టూ కామెడీ జోడించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఓ రకంగా ఇలాంటి స్టోరీ లైన్స్ తెరపై ఆవిష్కరించడం కొంచం కష్టంతో కూడుకున్న పనే. కానీ.. ఆ విషయంలో దర్శకుడు మహేష్ సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. సినిమా మొదలైన అర్ధగంటలోనే స్టోరీ లైన్ సెట్ చేసి.. మిగతా సినిమాని క్యారెక్టర్స్ తో రన్ చేశాడు. వాటికీ తోడు కామెడీ, ఎమోషన్స్ ని అటాచ్ చేస్తూ చూపించాడు. కానీ.. కథ చిన్నదే కాబట్టి.. కామెడీ పై ఎక్కువ కేర్ తీసుకున్నారు.
ఇక యాక్టర్స్ విషయానికి వస్తే.. నవీన్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి సీన్స్ అయినా ఈజీగా పండించే టాలెంట్ ఉందని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. స్టాండప్ కమెడియన్ రోల్ లో నవీన్ చెలరేగిపోయాడు. నవీన్ కామెడీ టైమింగ్, ఎక్స్ ప్రేషన్స్ సినిమాకు పెద్ద ప్లస్. మరోవైపు అనుష్క దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత బిగ్ స్క్రీన్ పై మెరిసింది. బోల్డ్ ఎన్నారై పాత్రలో అనుష్క చక్కగా ఆకట్టుకుంది. ఆమె ఆల్రెడీ అన్ని రకాల పాత్రలకు న్యాయం చేయగలదని తెలిసిందే. ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ కొత్తగా ట్రై చేసింది. కాకపోతే కొంచం ఏజ్ ఎక్కువగా ఉన్నట్లు ఇందులో క్లియర్ గా తెలిసిపోతుంది. కానీ.. అదంతా కథాకథనాలలో భాగంగానే చూడాలి. మిగతా పాత్రలలో మురళీశర్మ, జయసుధ, నాజర్, అభినవ్, హర్షవర్ధన్ తదితరులు తమ పాత్రల పరిధి మేరా మెప్పించారు.
ఇక టెక్నికల్ అంశాలు చూసుకుంటే.. డైరెక్టర్ మహేష్ కొత్త పాయింట్ నే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. స్పెర్మ్ డోనర్ అంటే.. తెలుగు వాళ్లకు కొత్త. ఇలాంటి కథను హ్యాండిల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కాకపోతే అక్కడక్కడా తడబడినా.. అతని ప్రయత్నానికి మెచ్చుకోవాలి. బట్ ఇప్పటికి అనుష్క లాంటి స్టార్ ఉన్న సినిమాలో స్పెర్మ్ డోనర్ కాన్సెప్ట్ అనేది ఎంతవరకు జనాలు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అయితే.. ఓ విధంగా కాన్సెప్ట్ ని వివరంగా చెప్పి.. కన్విన్స్ చేయడంలో దర్శకుడు కాస్త తగ్గాడని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా కామెడీనే నమ్ముకున్నట్లు అనిపిస్తుంది. రధన్ పాటలు పర్వాలేదు.. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నీరవ్ షా కెమెరా వర్క్, నిర్మాణ విలువలు ప్లస్ అయ్యాయి.
(గమనిక: ఈ సినిమా రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)