iDreamPost
iDreamPost
గత వారం విడుదలైన RRR తాకిడి ఇంకా జోరుగా ఉండగానే థియేటర్లలో వచ్చే సాహసం చేసిన చిన్న సినిమా మిషన్ ఇంపాజిబుల్. మొన్నటిదాకా దీని మీద జనం దృష్టి పెద్దగా లేదు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రావడంతో హైప్ పెరిగిన మాట వాస్తవం. రెగ్యులర్ మూవీ లవర్స్ కి మాత్రం దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ రెండో మూవీ కావడంతో పాటు ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటం అంతో ఇంతో బజ్ తీసుకొచ్చింది. తాప్సీ ప్రధాన పాత్రలో ముగ్గురు చిన్నపిల్లలు హీరోలుగా నటించిన ఈ ఎంటర్ టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
కథ
తిరుపతి దగ్గర వడమాలపేటలో ఉండే ముగ్గురు పిల్లలు రఘుపతి, రాఘవ, రాజారామ్. విడివిడిగా వాళ్లకు లక్ష్యాలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడం కోసం ముంబై వెళ్లి దావూద్ ఇబ్రహీంని పట్టుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ పొరపాటున బెంగళూరు వెళ్తారు. అక్కడ కిడ్స్ కిడ్నాప్ ముఠా మీద స్టింగ్ ఆపరేషన్ చేస్తున్న జర్నలిస్ట్ శైలజా(తాప్సీ)పరిచయమవుతుంది. చిన్నపిల్లలను దుబాయ్ కు అమ్మేసే ముఠా నాయకుడి(హరీష్ పేరడి)జాడ తెలుస్తుంది. అక్కడి నుంచి అతన్ని ఎలా పట్టుకోవాలనే దాని మీద ఒక ప్లాన్ వేస్తుంది. చివరికి వాళ్ళది ఎలా సాధించారు,అమ్మానాన్నలకు ఎలాంటి పేరు తీసుకొచ్చారనేది స్క్రీన్ మీద చూడాలి
నటీనటులు
ఇందులో లీడ్ యాక్టర్స్ గా ప్రొజెక్ట్ చేయబడ్డ ముగ్గురు పిల్లలు చాలా సహజంగా నటించారు. క్యారెక్టర్లను అర్థం చేసుకున్న తీరు, వాటికి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్, బాష రెండింటిని బ్యాలన్స్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఉద్దేశాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని కావాల్సిన నటనను పూర్తిగా ఇచ్చేశారు. హర్ష్ రోషన్, భాను ప్రకాష్, జయతీర్థ ములుగులకు ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనేలా కాకుండా సమానంగా స్పేస్ దక్కింది. హర్ష్ పేరుకు లీడర్ గా కనిపించినప్పటికీ మిగిలిన ఇద్దరూ తామేమి తక్కువ తినలేదన్నట్టు పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సరైన అవకాశాలు వస్తే కనక మంచి ఆర్టిస్టులుగా నిలదొక్కుకోవచ్చు
తాప్సీని ప్రమోషన్ లో హై లైట్ చేసుకుంటూ వచ్చారు నిజానికి తనకిచ్చిన లెన్త్ పిల్లలతో పోలిస్తే తక్కువే. ఉన్నంతలో డీసెంట్ గానే చేసింది. ఇంతకన్నా బెటర్ ఛాయస్ గా ఎవరిని గుర్తుచేసుకోలేం కాబట్టి తను పాస్ అయినట్టే. ఎక్కువగా తమిళ సినిమాల్లో చూసే హరీష్ పేరడి మెయిన్ విలన్ గా సరిపోయాడు. మరీ ఛాలెంజింగ్ కాదు కానీ ఉన్నంతలో నీట్ గా వెళ్ళిపోయాడు. తాప్సికి సహాయకుడి పాత్రలో రవీంద్ర విజయ్ డీసెంట్ అనిపింఛాడు. హర్షవర్ధన్, వైవా హర్ష, సందీప్ రాజ్, సుహాస్ ఒకటి రెండు సీన్లకు పరిమితమయ్యారు. శరణ్య ప్రదీప్, కంచరపాలెం కిషోర్ పరిధి కూడా తక్కువే. కంప్లయింట్ చేయడానికి పెద్దగా ఏమి లేదు
డైరెక్టర్ అండ్ టీమ్
క్రైమ్ ని ఆధారంగా చేసుకుని నడిచే కిడ్నాప్ కం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కు ప్రధానంగా కావాల్సింది టెంపో. దర్శకుడు స్వరూప్ దీన్ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగారు కాబట్టే ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ అంత మంచి విజయాన్ని అందుకుంది. కానీ అందులో నవీన్ పోలిశెట్టి అనే పవర్ హౌస్ అండగా ఉండటం వల్ల కొన్ని మైనస్సులు ఉన్నా తేలిగ్గా కవరైపోయాయి. కానీ ఈ మిషన్ ఇంపాజిబుల్ లో ఆ భారం మొత్తం స్వరూపే మోయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ నవీన్ లాగా ఇందులో ఆ బరువును పంచుకునే బలమైన ఆర్టిస్టు కానీ క్యాస్టింగ్ కానీ ఎవరూ లేకపోవడమే కారణం. తాప్సీ ఎంత మంచి నటి అయినా పాత్రను అలా డిజైన్ చేయలేదు.
దీంతో సహజంగానే స్వరూప్ లోని రైటర్ కం డైరెక్టర్ మీద ఒత్తిడి పెరిగింది. ప్లాట్ ఎస్టాబ్లిష్ మెంట్ చక్కగానే చేసినప్పటికీ అసలు కథలోకి ప్రవేశించే సమయానికి పట్టు తప్పిపోవడంతో ఆపై కథనం ఎటు వైపు వెళ్తుందో అర్థం కాక అవసరం లేని ల్యాగ్ వచ్చేసింది. కేవలం పిల్లల పెర్ఫార్మన్స్ ని బలంగా వాడుకుని థియేటర్ ప్రేక్షకుడిని సులభంగా కన్విన్స్ చేయలేం. ఆన్ లైన్లో, టీవీలో బోలెడు ఎంటర్ టైన్మెంట్ దొరుకుతుండగా కిడ్స్ కోసమే హాలు దాకా రప్పించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద సవాల్. అది జరగాలంటే టేకింగ్ తో సహా ప్రతి విభాగం ఎక్స్ ట్రాడినరీ అనే స్థాయిలో పని చేయాలి. కానీ ఈ మిషన్ లో అలా జరగలేదు.
అసలు బేసిక్ పాయింటే సిల్లీగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో చాలా చురుకుగా ఆలోచించే పిల్లలు బెంగళూరులో అంతసేపు తిరుగుతున్నా అది ముంబై కాదని గుర్తించలేకపోవడం లాజిక్ కి దూరమే. చిన్న ఊరా నగరమా అనే బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా న్యూ జనరేషన్ కిడ్స్ ఎలా ఉన్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాంటిది వర్మ నా ఇష్టం పుస్తకం చదివి, వచ్చిన ప్రతి సినిమా చూస్తూ అతన్ని ఆరాధించే పిల్లాడికి ముంబై బొంబాయి ఒకటేనని, ప్రభుత్వాలే పట్టుకోలేని దావూద్ ని తనేం చేయగలడనే కామన్ సెన్స్ లేకపోవడం విచిత్రం. ఒకవేళ అమాయకుడు అనుకుంటే సెకండ్ హాఫ్ లో చూపించే వాడి తెలివి హఠాత్తుగా ఎలా వచ్చింది.
చాలా కన్వీనియంట్ గా కొన్ని బేసిక్స్ ని స్వరూప్ వదిలేయడం ఎక్కడిక్కడ హై లైట్ అవుతుంది. చిన్న పిల్లలను టార్గెట్ చేసి సినిమా తీసినప్పుడు కనీసం వాళ్ళనైనా మెస్మరైజ్ చేయగలగాలి. అలాంటిదేమి ఉండదు. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత జరిగేదంతా ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోతుంది. ఇంటెలిజెన్స్ లెవెల్స్ తక్కువగా అనిపిస్తాయి. క్లైమాక్స్ హడావిడిగా జరిగిపోతుంది. తాప్సీ తాలూకు ట్రాక్ కూడా వీక్ గానే ఉంది. ఆ మధ్య వచ్చిన తమిళ డబ్బింగ్ డాక్టర్ లోనూ ఇలాంటి ప్లాటే ఉంటుంది. అందులోనూ కామెడీ ప్లస్ థ్రిల్ రెండూ మిక్స్ చేశారు. కానీ అక్కడున్న మెచ్యూరిటీ ఇక్కడి స్క్రిప్ట్ లో కనిపించదు. అదే ప్రధాన లోపం.
పిల్లల ట్రాఫికింగ్ అనేది నిజానికి మంచి పాయింట్. ఈమధ్య కాలంలో ఎవరూ టచ్ చేయనిది. కానీ దాన్ని సరిగా వాడుకోలేకపోవడంలో వచ్చింది ఇబ్బందంతా. బలమైన బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసుకుని ఉంటే ఈ మిషన్ ఇంపాజిబుల్ బెస్ట్ మూవీ అయ్యేది. కానీ అలా చేసుకోలేదు. ఇదంతా స్వరూప్ లోని టెక్నీషియన్ ని తక్కువ చేయడం కాదు. కథాకథనాల్లో ఎన్ని లోపాలు ఉన్నా మరీ విసుగు రాకుండా చివరి దాకా చూసేలా చేయడంలో తను సక్సెస్ అయ్యాడు. కాకపోతే థియేటర్ నుంచి బయటికి వచ్చాక ఎలాంటి ఫీలింగ్ కలగకుండా అలా న్యూట్రల్ గా బయటికి వచ్చామంటే ఆ దర్శకుడి కష్టానికి తగిన ఫలితం దక్కన్నట్టే
మార్క్ కె రాబిన్ పనితనం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా బాగుంది. సీన్ లో డెప్త్ తగ్గిన చోట తన నేపధ్య సంగీతం కవర్ చేసింది. పాటలు సోసోగానే ఉన్నాయి. చూస్తుంటే ఓకే కానీ ఆడియో వేల్యూ పెద్దగా లేదనిపిస్తుంది. దీపక్ యరగర ఛాయాగ్రహణం మీద ఫిర్యాదు లేదు. డీసెంట్ గా సాగింది. రవితేజ గిరజాల ఎడిటింగ్ రెండుంపావు లోపే సినిమాను ముగించింది కాబట్టి ఇక్కడా లోపాలను ఎంచి చూపించలేం. సంభాషణలు అక్కడక్కడా పేలాయి. మ్యాట్నీ నిర్మాణ విలువలు సబ్జెక్టుకు తగ్గట్టు ఖర్చు పెట్టాయి. మరీ రాజీ పడినట్టు అనిపించలేదు. ఈ మాత్రం రిచ్ నెస్ ఉందంటే అది కాంప్రోమైజ్ కాకపోవడం వల్లే కావొచ్చు
ప్లస్ గా అనిపించేవి
పిల్లల నటన
ఫస్ట్ హాఫ్
బిజిఎం
నిడివి
మైనస్ గా తోచేవి
సిల్లీగా అనిపించే ప్లాట్
కన్వీనియంట్ గా వదిలేసిన లాజిక్స్
క్యారెక్టరైజేషన్స్ వీక్ గా ఉండటం
పాటలు
కంక్లూజన్
ముగ్గరు పిల్లలు ఒక లేడీ క్రైమ్ జర్నలిస్ట్ చుట్టూ అల్లుకున్న కిడ్నాప్ థ్రిల్లర్ మిషన్ ఇంపాజిబుల్. స్టార్ వేల్యూ లేకపోయినా కేవలం కంటెంట్ ని నమ్ముకుని వచ్చిన ఈ సినిమా ప్రధానంగా ఆ విషయంలోనే బ్యాలన్స్ కాకపోవడంతో ఎగ్జైట్ అవుదామని వచ్చిన ప్రేక్షకులు ఎగ్జిట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఏదో సాగిందిలే అనే ఫీలింగ్ తో బయటికి వస్తారు. ఇప్పుడున్న హైపర్ యాక్టివ్ పిల్లలను సైతం ఇంత సింపుల్ ప్లాట్ ఏ మేర మెప్పిస్తుందనేది అనుమానమే. ఏజెంట్ ఆత్రేయతో పోలిక పెట్టుకున్నా పెట్టుకోకపోయినా స్వరూప్ పూర్తి స్థాయి పనితనాన్ని చూపించిన మిషన్ మాత్రం ఇది కాదు.
ఒక్క మాటలో – పని జరగని మిషన్
రేటింగ్ : 2.25 / 5