iDreamPost
android-app
ios-app

ఓంకార్ తెరకెక్కించిన ‘మాన్షన్ 24’ వెబ్ సిరీస్ రివ్యూ!

ఓంకార్ తెరకెక్కించిన ‘మాన్షన్ 24’ వెబ్ సిరీస్ రివ్యూ!

ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాక ఆడియన్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. కూర్చున్న దగ్గరే ఓటిటిలలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ కాలక్షేపం చేసే అవకాశం లభిస్తుంది. ఓటిటిలు వచ్చాకే వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరిగింది. డిమాండ్ కి తగ్గట్టుగా మేకర్స్ డిఫరెంట్ స్టోరీస్ తో వెబ్ సిరీస్ లు తెరపైకి తీసుకొస్తున్నారు. టాలెంటెడ్ టీవీ హోస్ట్, డైరెక్టర్ ఓంకార్.. తాజాగా ‘మాన్షన్ 24’ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. డిస్నీ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ మొదలైన ఈ హార్రర్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ తో అంచనాలు పెంచేసింది. మరి వరలక్ష్మి శరత్ కుమార్, సత్యరాజ్, రావురమేష్, అవికా గోర్, బిందు మాధవీ, అర్చన జోయిస్ కీలకపాత్రలలో నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం!

కథ:

అమృత(వరలక్ష్మి) ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. ఆమె తండ్రి కాళిదాసు(సత్యరాజ్) పురావస్తు శాఖలో వర్క్ చేస్తుంటారు. సడన్ గా ఒకరోజు కాళిదాసు కనిపించకుండా పోతారు. కట్ చేస్తే.. తండ్రి జాడ కోసం అమృత ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. ఈ క్రమంలో తన తండ్రి చివరిగా పాడుబడ్డ మాన్షన్(బంగ్లా)కి వెళ్లాడని తెలుస్తుంది. మరి ఆ మాన్షన్ కి కాళిదాసు ఎందుకు వెళ్ళాడు? ఆ మాన్షన్ వెనుక అసలు కథేంటి? ఆ మాన్షన్ కి వెళ్ళాక అమృత తండ్రి జాడను కనిపెట్టిందా లేదా? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

గతంలో ఇలాంటి కథలు ఎన్నో వచ్చాయి. ఓ పాడుబడ్డ బంగ్లాకు అనుకోకుండా ఓ ఫ్యామిలీ వెళ్లడం లేదా ఓ వ్యక్తి వెళ్లి మిస్ అవ్వడం.. వాళ్ళని వెతుక్కుంటూ ఫ్యామిలీ, పోలీస్ డిపార్ట్మెంట్.. ఇన్వెస్టిగేషన్.. ఆ బంగ్లా చుట్టూ దయ్యం కథలు.. ఇలాంటి స్టోరీ లైన్స్ తో కుప్పలుగా సినిమాలు వచ్చాయి. కానీ.. కథలు ఒకేలా ఉన్నా.. కథనం కొత్తగా ఉంటే.. థ్రిల్ కి గురిచేసే సన్నివేశాలు పడితే ఇప్పుడు కూడా ఇలాంటి కథలు ఆదరణ పొందే అవకాశం ఉంది. స్టోరీ పాయింట్ ఒకటే అవుతుంది. కాబట్టి.. ఆల్రెడీ చూసిన ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడీ మాన్షన్ 24 సిరీస్ కూడా అలాంటి లైన్ తో తెరకెక్కింది. ట్రైలర్ చూసిన వారందరికీ దాదాపు చూసేసిన ఫీలింగ్ కలిగింది.

కాకపోతే డైరెక్టర్ ఓంకార్ దాదాపు నాలుగేళ్ల తర్వాత చేసిన ప్రాజెక్ట్ కాబట్టి.. కాస్త ఇంటరెస్ట్ అయితే జనాలలో క్రియేట్ అయ్యింది. హార్రర్ సిరీస్ లో బేసిగ్గా ఓ కథ.. ఆ కథలో క్యారెక్టర్స్ చుట్టూ వేరే కథలు.. ఫైనల్ గా అసలు కథకు.. క్యారెక్టర్స్ కథకు ఎలా లింక్ చేశారు? అనేది మెయిన్ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్. ఇలాంటివన్నీ థ్రిల్లర్, హార్రర్ ప్రాజెక్ట్ లలోనే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక మాన్షన్ 24 విషయానికి వస్తే.. బేసిక్ ప్లాట్ అయితే కొత్తగా లేదు. కానీ.. చాలామంది స్టార్ కాస్ట్ ఉండేసరికి.. ఆ రేంజ్ లో ఓంకార్ ఏం ప్లాన్ చేశాడు? అనే ఆసక్తి అందరిలో కలిగింది. ఎందుకంటే.. రాజుగారి గది సిరీస్ తో ఓంకార్ హార్రర్ స్టోరీస్ లో పట్టు ఉందని ప్రూవ్ చేసుకున్నాడు.

ఈ సిరీస్ కాళిదాసు(సత్యరాజ్) క్యారెక్టర్ మిస్ అవ్వడంతో మొదలవుతుంది. అతన్ని కనిపెట్టాలని కూతురు అమృత(వరలక్ష్మి) ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథ తిరుగుతుంది. వీళ్ల క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ మాన్షన్ 24 కథ మొదలైంది. ఆ తర్వాత కథలో.. కాళిదాసు మిస్సింగ్ పాయింట్, మాన్షన్ గురించి తెలిసే విషయాలు.. అక్కడికి అమృత వెళ్లడం.. ఇలా కథలో సీరియస్ నెస్ తో పాటు ఇంటరెస్ట్ పెరుగుతుంది. ఇందులో చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. కానీ.. కొందరి క్యారెక్టర్స్ కి బ్యాక్ డ్రాప్ స్టోరీస్ ఉన్నాయి. అలా కొంచం ఆకట్టుకునే బ్యాక్ డ్రాప్ స్టోరీస్ లో.. కేజీఎఫ్ ఫేమ్ అర్చన జోయిస్ – నందుల కథ ఒకటి.

వీరి స్టోరీతో పాటు.. ఓంకార్ వాళ్ల స్టోరీని ప్రెజెంట్ చేసిన విధంగా కూడా బాగుంది. అయితే.. సిరీస్ లో ఇంటరెస్ట్ క్రియేట్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే.. వాతావరణం. ఈ సిరీస్ మొత్తం ఓ సీరియస్ మోడ్ లో సాగుతుంది. ప్రేక్షకులలో ఆ ఆసక్తి కలిగేలా ఇంటెన్సిటీని మెయింటైన్ చేశాడు దర్శకుడు. ఒక హార్రర్ థ్రిల్లర్ కి కావాల్సిన వాతావరణం ప్రొడక్షన్ డిజైనింగ్ లో పర్ఫెక్ట్ గా క్రియేట్ చేశారు. అన్ని క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేశారని చెప్పవచ్చు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాబట్టి.. మధ్యలో చాలా క్యారెక్టర్స్ వచ్చి పోతుంటాయి. వాటి వెనుక బ్యాక్ డ్రాప్ స్టోరీస్ కూడా ఉంటాయి. క్లైమాక్స్ కి వచ్చేసరికి రెగ్యులర్ మూవీస్ లాగే.. ఇందులో కూడా చిక్కుముడులు విప్పుతూ ఎండింగ్ వైపు సాగుతుంది.

ఇక నటినటుల విషయానికి వస్తే.. వరలక్ష్మి శరత్ కుమార్ ఎప్పటిలాగే ఇంటెన్సిటీతో ఆకట్టుకుంది. సత్యరాజ్, రావు రమేష్, జయప్రకాశ్, అవికా గోర్, అర్చన జోయిస్, నందు, బిందు మాధవీ, రాజీవ్ కనకాల.. ఇలా తదితరులు వారి వారి పాత్రల మేరా మెప్పించారు. ఈ సిరీస్ లో ప్రధానంగా స్క్రీన్ ప్లే అంత ఇంటరెస్టింగ్ గా లేకపోవడం మైనస్. పైగా ఆల్రెడీ వేరే భాషలలో చూసిన సిరీస్ ల పోలికలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా కొరియన్ వెబ్ సిరీస్ ‘ఘోస్ట్ మాన్షన్’ నుండి ఇన్స్పైర్ అయినట్లు కనిపిస్తుంది. చాలా ప్రయోగాలు, డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్స్ లు ట్రై చేశారు. కానీ.. భయపెట్టడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు ఓంకార్.

సిరీస్ నిండా తెలిసిన యాక్టర్స్ చాలామంది ఉన్నప్పటికీ.. క్యారెక్టర్స్ కి సరైన ముగింపు ఇవ్వలేదని అర్ధమవుతుంది. టెక్నికల్ గా సిరీస్ లో ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. కథకు తగినట్లుగా ప్రొడక్షన్ డిజైనింగ్ ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరా వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. గ్రాఫిక్స్ కొన్నిచోట్ల ఇంకాస్త నేచురల్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఫైనల్ గా డైరెక్టర్ ఓంకార్.. చాలా గ్యాప్ తీసుకొని ఈ సిరీస్ తో ముందుకొచ్చాడు. కానీ.. ఈ మాన్షన్ 24 విషయంలో కాస్త తడబడ్డాడు. సిరీస్ ముందుకు వెళ్తున్నకొద్దీ స్లో అనిపిస్తుంది. ట్రైలర్ తో క్రియేట్ చేసిన అంచనాలు మాత్రం మాన్షన్ 24 రీచ్ కాలేదు. మరి ఓటిటి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

ప్లస్ లు:

  • స్టోరీ పాయింట్
  • ప్రొడక్షన్ డిజైనింగ్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • కెమెరా వర్క్
  • కొన్ని సీన్స్

మైనస్ లు:

  • స్క్రీన్ ప్లే
  • సరైన ఎండింగ్ లేని క్యారెక్టర్స్
  • స్లో కథనం

చివరిమాట: మాన్షన్ 24.. రొటీన్ థ్రిల్లర్!

రేటింగ్: 2/5

(ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)