iDreamPost
android-app
ios-app

‘‘మ్యాడ్‌’’ మూవీ రివ్యూ!

‘‘మ్యాడ్‌’’ మూవీ రివ్యూ!

సితార ఎంటర్టైన్మెంట్స్.. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ మూవీస్ కి కేరాఫ్ లాంటి బ్యానర్. పెద్ద హీరోల సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేయడం ఈ సంస్థకి అలవాటు. తాజాగా ఈ బ్యానర్ లో యూత్ ఫుల్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన చిత్రం ‘మ్యాడ్’. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందొ ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

ఓ ఇంజినీరింగ్ కాలేజ్. అందులో మనోజ్, అశోక్, దామోదర్ అనే ముగ్గురు స్టూడెంట్స్ జాయిన్ అవుతారు.ఈ ముగ్గురు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? ఎలా వీరి లైఫ్ సాగింది. ఈ జర్నీలో వీరికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? వాటిని ఈ బ్యాచ్ ఎలా అధిగమించింది? వీరంతా కలిసి ఇంజినీరింగ్ లైఫ్ ని ఎలా లీడ్ చేశారు అన్నదే ఈ చిత్ర కథ.

విశ్లేషణ:

టాలీవుడ్ లో “జాతిరత్నాలు” మూవీ ఓ బెంచ్ మార్క్. కథ లేకుండా.. క్యారెక్టర్స్ బిహేవియర్ మాత్రమే కథగా సాగే చిత్రం అది. తరువాత కాలంలో ఆ మూవీ ఫార్మేట్ లో కొన్ని చిత్రాలు వచ్చినా.. జాతిరత్నాలు మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాయి. ఈ కోవలో ఒక్క “డీజే.టిల్లు” మాత్రమే మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ మ్యాడ్ మూవీ కూడా ఆ సక్సెస్ ఫుల్ లిస్ట్ లోకే వస్తుంది. బీటెక్ లైఫ్ కి సినిమాటిక్ టచ్ ఇచ్చి, ఓ అందమైన ప్రపంచాన్ని కళ్ళ ముందు ఉంచిన చిత్రాలు చాలానే ఉన్నాయి. “హ్యాపీ డేస్” అందులో మాస్టర్ పీస్ అయితే.. “మ్యాడ్” మాత్రం సూపర్ మాస్ అండ్ లాఫ్ మాస్టర్ పీస్. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ మూవీని ఓపెన్ చేసిన విధానమే అద్భుతం. ఫస్ట్ ఇయర్, ఫస్ట్ డే బీటెక్ లో జాయిన్ అయిన ఓ కుర్రాడిలో భయాన్ని లీడ్ గా తీసుకుని.. కళ్యాణ్ శంకర్ నేరేషన్ మోడ్ లో కథలోకి వెళ్లిన విధానం చాలా బాగుంది.

ఈ చిత్రానికి పరికులర్ట్ గా కథ, కాంఫ్లిక్ట్స్, సీక్వెన్స్, లేయర్స్ లాంటి బుక్ టెంప్లేట్స్ ఏమి పెట్టుకోలేదు దర్శకుడు. మనోజ్, అశోక్ దామోదర్ జీవితాల్లోని సందర్భాలు మాత్రమే ఈ చిత్ర కథ. ఓ కొత్త దర్శకుడు ఇలాంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి రావడం నిజంగా పెద్ద రిస్క్. కానీ..,దర్శకుడు కళ్యాణ్ శంకర్ అందులోనే తన సక్సెస్ ని సెట్ చేసుకున్నాడు. ఇందుకోసం డైలాగ్స్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు. ఇక్కడే కళ్యాణ్ శంకర్ రచయితగా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. స్నేహితుల మధ్య వచ్చే పంచ్ లు, సెటైర్స్, మాత్రమే కాకుండా.. మామూలు సంభాషణల్లోనూ ఫన్ జనరేట్ అయ్యేలా డైలాగ్స్ సెట్ చేసుకున్నాడు. అయితే.., అవేవి జబర్దస్త్ రొట్ట జోక్స్ ఏ మాత్రం కావు. అలా అని జాతిరత్నాలు నాన్ సింక్ డైలాగ్స్ కావు. ఆ సమయానికి ఏ మాట పడితే.. ఎలా ఫన్ జనరేట్ అవుతుందో అలా కొలతలేసి రాసిన డైలాగ్స్ అవి.

MAD movie review

బీటెక్ లో పరిచయాలు, సీనియర్స్ ర్యాగింగ్ లు, గ్యాంగ్ వార్స్, లవ్ ట్రాక్స్ తో ఫస్ట్ ఆఫ్ మొత్తం సరదాగా సాగిపోయింది. ఇక సెకండ్ ఆఫ్ లో నవ్వించడానికి ఏముంటుంది అనుకున్న సమయంలో కూడా దర్శకుడు మ్యాజిక్ చేశాడు. సెకండ్ ఆఫ్ ని సీరియస్ అండ్ సెంటిమెంట్ ట్రాక్ ఎక్కించకుండా.. ఫుల్ కామెడీతో నింపేశాడు. ఇందుకోసం సెకండ్ ఆఫ్ లో హీరోల కష్టాలకు లైటర్ వీన్ టచ్ ఇస్తూ.. అందులో నుండి కూడా ఫన్ క్రియేట్ చేశాడు. ఆ ఫన్ నుండి ముగ్గురి లవ్ స్టోరీలను సక్సెస్ ట్రాక్ ఎక్కించి, మంచి పాజిటివ్ టచ్ ఇచ్చాడు. బడ్డీ మూవీస్ లో ఉండే ఓ టిపికల్ కామెడీకి కాలేజ్ బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి, సినిమా ఆద్యంతం ప్రేక్షకుడిని నవ్వించిన దర్శకుడిని, అతని టీమ్ ని ఎంత మెచ్చుకున్నా తక్కవే. కాకపోతే.. రెగ్యులర్ టెంప్లేట్ మూవీస్ ని మాత్రమే ఇష్టపడే వారికి “మ్యాడ్” నిజంగానే ఓ పిచ్చి సినిమాలా అనిపిస్తుంది. సేమ్ “జాతి రత్నాలు” విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక ఈ మొత్తం మూవీలో అక్కడక్కడా బూతులు.. బాటా చెప్పులు వేసుకుని మరీ లైన్ దాటేయడం కాస్త ఆక్షేపించతగ్గ విషయం. ఎంత యూత్ ఫుల్ ఎంటర్ట్రైనర్ అయినా.. ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమేర ఇబ్బంది పడవచ్చు.

నటీనటల పనితీరు:

మ్యాడ్ మూవీ చూశాక.. పిచ్చి పిచ్చిగా నచ్చేసే నటుడు సంగీత్ శోభన్. వాట్ ఏ ఎనర్జీ, వాట్ ఏ యాక్టింగ్, వాట్ ఏ టైమింగ్. డీడీ క్యారెక్టర్ లో సంగీత్ శోభన్ నటన ఈ సినిమా స్థాయిని సగం ఎత్తుకి పెంచేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక మనోజ్ పాత్రలో రామ్ నితిన్ పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు.నటన విషయంలో కూడా రామ్ నితిన్ తన 100 పెర్సెంట్ ఇచ్చేశాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్. మిగతా రెండు పాత్రలతో పోలిస్తే.. నార్నే నితిన్ చేసిన అశోక్ క్యారెక్టర్ కి డైమెన్షన్స్ ఎక్కువ. కాబట్టి.. తొలి సినిమానే నార్నే నితిన్ మంచి మార్కులు కొట్టేశాడు. డ్యాన్స్ లు, ఫైట్స్ లో పూర్తిగా మెప్పించాడు. కాకపోతే.. నటనలో ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వడం అవసరం. బట్ తొలి చిత్రానికి ఈ మాత్రం ఆకట్టుకోవడం మంచి విషయమే. వీరి తరువాత లడ్డూ పాత్రలో నటించిన కుర్రాడికి మంచి భవిష్యత్ ఉంది. ఇందులో హీరోయిన్స్ గా నటించిన శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక పెద్ద స్కోప్ లేదు.

టెక్నీకల్ విభాగం:

శామ్‌దత్ సైనుదీన్, దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ మ్యాడ్ మూవీకి పెద్ద అసెట్. ముఖ్యంగా మూవీలో లైటింగ్ అదిరిపోయింది. చాలా షాట్స్ లో ఈ టీమ్ న్యాచురల్ లైటింగ్ వాడుకున్న విధానం అద్భుతం. ఇక తప్పక మెచ్చుకోవాల్సింది ఎడిటర్ నవీన్ నూలిని. పర్టికులర్ గా ఓ కథతో సాగే చిత్రంలో ఎక్కడ ల్యాగ్ ఉందో, ఎక్కడ సన్నివేశాలు పడవో గెస్ చేయడం ఈజీ. కానీ.., ఇలాంటి చిత్రాల విషయంలో దర్శకుడి విజన్ ని ఎడిటర్ నమ్మాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. ఫైనల్ గా ఆ అవుట్ పుట్ అందించాలి. ఈ విషయంలో నవీన్ నూలి సూపర్ సక్సెస్ అయ్యారు. ఇక భీమ్స్ సిసిరోలియో బీజీఎమ్ అదిరిపోయినా.. పాటలు మాత్రం ఆ స్థాయిలో లేవు. చివరగా నిర్మాణ విలువలు మాత్రం అదిరిపోయాయి.

బలాలు:

  • కథ లేకపోవడం
  • దర్శకత్వం
  • డైలాగ్స్
  • కాస్టింగ్
  • సంగీత్ శోభన్

బలహీనతలు:

  • పాటలు
  • అక్కడక్కడా వచ్చే బూతులు

రేటింగ్: 3.25/5

చివరి మాట: MAD.. ఈ జనరేషన్ కి పిచ్చి పిచ్చిగా నచ్చే సినిమా