iDreamPost

lal singh chaddha review లాల్ సింగ్ చడ్డా రివ్యూ

lal singh chaddha review లాల్ సింగ్ చడ్డా రివ్యూ

ఎంత స్టార్ డం ఉన్నా విలక్షణ సినిమాలు మాత్రమే చేసే అమీర్ ఖాన్ కొత్త మూవీ లాల్ సింగ్ చడ్డా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో అతను చేసిన వ్యాఖ్యలు, పికెలో హిందూ దేవుళ్ళ మీద చేసిన కామెడీ కారణంగా దీని మీద బాయ్ కాట్ ప్రభావం గట్టిగానే పడినట్టు సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. నాగ చైతన్య ఓ కీలక పాత్ర చేయడం. ఎన్నడూ లేనిది మెగాస్టార్ చిరంజీవి ఒక డబ్బింగ్ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో ఇక్కడ కూడా ప్రమోషన్లు జోరుగా చేశారు. అంచనాల కంటే వ్యతిరేకతనే ఎక్కువగా మోస్తున్న ఈ లాల్ సింగ్ చడ్డా జీవితం మెప్పించేలా సాగిందో లేదో రివ్యూలో చూసేద్దాం పదండి

కథ

తల్లిచ్చే స్ఫూర్తితో తన అంగవైకల్యాన్ని అధిగమించి ఎదుగుతాడు లాల్ సింగ్ చడ్డా(అమీర్ ఖాన్). తన స్కూల్ క్లాస్ మేట్ రూప(కరీనా కపూర్)వల్ల అది కూడా పోగొట్టుకుని పరుగు పందెంలో తిరుగులేని స్థాయికి చేరుతాడు. ఆ తర్వాత సైన్యంలో చేరాక బాలరాజు(నాగ చైతన్య)తో పరిచయం అతనికో గొప్ప ఫ్రెండ్ ని ఇస్తుంది. అయితే యుద్ధం కారణంగా ఇద్దరి జీవితాల్లో విషాదం చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత బయటికి వచ్చేసిన లాల్ స్వంతంగా వ్యాపారం మొదలుపెడతాడు. ఈలోగా దూరమైన రూప మళ్ళీ కనిపిస్తుంది. అక్కడి నుంచి లాల్ సింగ్ లైఫ్ చాలా మలుపులు తీసుకుంటుంది. అవేంటో తెలియాలంటే తెరమీదే చూసి భరించాలి.

నటీనటులు

ఒక యాక్టర్ గా అమీర్ ఖాన్ నటనా వైదుష్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోనూ అదే కొనసాగించాడు. మనిషి పరిణామక్రమానికి సంబంధించి వివిధ వయసుల్లో చూపించిన బయోపిక్ కావడంతో దానికి తగ్గట్టు వేరియేషన్స్ ని చక్కగా చూపించాడు. శరీరంలో మార్పులు విఎఫెక్స్ లో మేనేజ్ చేశారని అతనే చెప్పాడు కాబట్టి దంగల్ తరహాలో దీనికి ప్రత్యేక ప్రశంసలు ఇవ్వలేం. బాధను గుప్పిట భరిస్తూ అదసలు లేదన్నట్టు ప్రవర్తించే లాల్ సింగ్ గా అమీర్ పర్ఫెక్ట్ ఛాయసే కానీ క్రమంగా తనలోనూ ఒక రకమైన మొనాటనీ యాక్టింగ్ వస్తోందన్న విషయాన్ని వీలైనంత త్వరగా గుర్తిస్తే మంచిది. కళ్ళు నిటారుగా తేలేయడం, పరుగులు పెట్టడమే కాదు నటనంటే

నాగచైతన్యకు బాలరాజుగా గుర్తుండిపోయే పాత్రే దక్కింది. కాకపోతే తను నార్త్ ఆడియన్స్ కి రిజిస్టర్ కావడం అనుమానమే. క్యారెక్టర్ పరంగా బలహీనతలు ఉండటం ప్లస్ స్క్రీన్ స్పేస్ మొత్తం అమీర్ ఆక్రమించుకున్నాడు కాబట్టి ఈ ఇంపాక్ట్ ఏ మేరకు ఆఫర్లు తేవడం కష్టమే. కరీనా కపూర్ ఈ వయసులోనూ మంచి లుక్స్ తో ఆశ్చర్యపరిచింది. కాకపోతే తన రోల్ ని డిజైన్ చేసిన తీరు వల్ల అధిక శాతం నీరసంగా కనిపించడంలో ఆవిడ తప్పేమి లేదు.ఈ ముగ్గురు తప్ప గుర్తుండిపోయే స్థాయిలో ఎవరికీ స్కోప్ దక్కలేదు. అంత పెద్ద ఆర్మీలోనూ లాల్ బాలరాజుల మీద అతిగా ఫోకస్ పెట్టడంతో ఇతర క్యాస్టింగ్ ని వాడుకునే అవకాశం లేకపోయింది

డైరెక్టర్ అండ్ టీమ్

ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ కి అఫీషియల్ రీమేక్ గా చెప్పుకున్న లాల్ సింగ్ చడ్డాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ ఆ ఒరిజినల్ వెర్షన్ ని చూసిన సామాన్య ప్రేక్షకులు తక్కువగా ఉండటం. అందులోనూ ఇప్పటి జనరేషన్ కి దాని మీద అవగాహన తక్కువే. ఆ ధైర్యంతోనే అమీర్ అండ్ టీమ్ దూకేశారు. అతుల్ కులకర్ణి సంవత్సరాల తరబడి ఈ స్క్రిప్ట్ రాశారని, ఎలాంటి సబ్జెక్టు చేయాలో తెలియని అయోమయంలో ఉన్నప్పుడు ఇది అద్భుతంగా అనిపించిందని అమీర్ పదే పదే చెప్పిన మాటలు ఫస్ట్ హాఫ్ కే అబద్దమని తేలిపోతాయి. తనవరకు ఛాలెంజింగ్ ఉంటే చాలు జనం ఎగబడి చూస్తారని భ్రమ కాబోలు తప్పులో కాలేశారు.

నిజానికిది బయోపిక్ మోడల్ లో తీశారు. లాల సింగ్ అనే గుడ్ మ్యాన్ బాల్యం నుంచి ఇప్పటిదాకా అతను ఎదురుకున్న మనుషులు, జరిగిన సంఘటనలను కూలంకుషంగా చూపించాలనుకున్నారు. అయితే ఎంత ఉన్నతమైన మనిషి గురించి చెబుతున్నా స్క్రీన్ మీద పండాలంటే డ్రామా అవసరం. ఎన్టీఆర్ అంతటి మహనీయుడి గాథను మన ఆడియన్స్ తిరస్కరించడానికి కారణం అదే కదా. అలాంటప్పుడు అసలు లేని ఒక కల్పిత వ్యక్తి గురించి చెబుతున్నప్పుడు అదింకే స్థాయిలో పండాలి. కానీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి దాకా లాల్ సింగ్ స్క్రీన్ ప్లే నత్తనడకన సాగుతుంది. మెట్రో ట్రైన్ ఎక్కామని ఫీలైతే ప్యాసింజర్ రైలు కన్నా దారుణంగా వెళ్తుంది.

దర్శకుడు అద్వైత్ చందన్ ఏ దశలోనూ సినిమాను ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేయలేదు. ముందుకెళ్లేకొద్దీ వీలైనంత బోర్ కొట్టించేలా ఏమేం ఉండాలో ఏదీ మిస్ చేయకుండా చూసుకున్నాడు. లాల్ సింగ్ తన ఎదురుగా కూర్చున్న అజ్ఞాత ప్రయాణికురాలికి తన హిస్టరీ చెప్పడంతో సినిమా మొదలవుతుంది. అతని చుట్టూ ఉన్న వాళ్ళు సంభ్రమాశ్చర్యంతో వింటూ ఉంటారు. మనం కూడా అదే ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ లాల్ సింగ్ జర్నీలో ఎలాంటి ఎగ్జైట్ మెంట్ ఉండదు. పైపెచ్చు అమీర్ యాక్టింగ్ షేడ్స్ ని, రన్నింగ్ స్కిల్స్ ని చూపించడానికి రాసుకున్న ఎన్నో అనవసరమైన సీన్లు సహనానికి పరీక్ష పెడుతూ ఇంటర్వెల్ కోసం ఎదురు చూసేలా చేస్తాయి.

చైతుతో చేయించిన బనియన్ చెడ్డీ ట్రాక్ సిల్లీగా ఉంది. దానికో ఇంటర్ లింక్ సెకండ్ హాఫ్ లో పెట్టినప్పటికీ అదీ సరిగా పండక చిరాకు పుట్టిస్తుంది. పోనీ రెండో సగంలో అయినా కథనం పరుగులు పెడుతుందా అంటే అదీ లేదు. అమీర్ నాలుగు సంవత్సరాలు పరిగెత్తుతూ దేశమంతా తిరుగుతాడు. కానీ ఆయాసం మనకొస్తుంది. త్వరగా పంపవయ్యా అని బ్రతిమాలాలనినిస్తుంది. రూప పాత్రకిచ్చిన ట్విస్టుని అటుఇటు తిప్పి ఏదో ఎమోషన్ కోసమన్నట్టు రెండు మూడు పాథోస్ సాంగ్స్ ని బలవంతంగా ఇరికిస్తే అవి కాస్తా మొబైల్ లో సోషల్ మీడియా అప్డేట్స్ ని చూసుకోవడానికి పనికొచ్చాయి. ఇంతకీ లాల్ సింగ్ టీమ్ స్క్రిప్ట్ ని చెక్ చేసుకోలేదానే అనుమానం కలుగుతుంది.

ఒక వర్సటైల్ యాక్టర్ నటించినంత మాత్రాన దారుణమైన సినిమాను ఆదరించే మహోన్నత ప్రేక్షకులుండే కాలం కాదిది. అందుకే కమల్ హాసన్ ఉత్తమ విలన్ బాక్సాఫీస్ వద్ద అంత దారుణంగా దెబ్బ తింది. కెజిఎఫ్ లు, ఆర్ఆర్ఆర్ లాంటివి కడుపు నిండా విందు భోజనం పెడుతుంటే అదే డబ్బులు తీసుకున్న లాల్ సింగ్ మాత్రం ఉప్పు లేని దద్దోజనం పెట్టి మా కళాఖండాన్ని ఆదరించి మీ ఉత్తమాభిరుచిని చాటుకోండని పిలుపునిస్తాడు. పీకేలో ఎన్ని వివాదాస్పద అంశాలు ఉన్నప్పటికీ అందులో ఆసక్తి రేపే టెంపో, ఆలోచింపజేసే లాజిక్స్ ఉన్నాయి. కాబట్టే హిట్ అయ్యింది. కానీ ఈ లాల్ సింగ్ అవి మచ్చుకు కాదు కదా కనీసం మిల్లిమీటర్ అంత లేవు

క్యారెక్టరైజేషన్స్ లో ఉన్న ఎన్నో లోపాలు లాల్ సింగ్ డొల్లతనాన్ని మరింత బయట పెట్టాయి. ముఖ్యంగా శత్రుదేశం నుంచి వచ్చిన మహమ్మద్ భాయ్ కి అవసరానికి మించిన ఎక్స్ పోజర్ ఇచ్చి లాల్ సింగ్ గొప్పదనాన్ని హైలైట్ చేయాలనుకున్నారు కానీ అది సరిగా కన్విన్స్ కాక ఇదంతా టూ మచ్ వ్యవహారంలా తోస్తుంది. పైపెచ్చు ఇన్ని నీతులు చెప్పిన మహమ్మద్ చివరికి పాకిస్థాన్ కే వెళ్ళిపోతాడు. అది కూడా ఏదో గొప్ప ఎమోషన్ లా చూపించడం అతితెలివికి పరాకాష్ట. కరీనా వేసిన రూప పాత్ర బ్యాలన్స్ తప్పింది. ఎంతసేపూ రెండు మూడు పాత్రల చుట్టే ఇంత పెద్ద కాన్వాస్ ని నడిపించడం అద్వైత్ చందన్ వల్ల కాక ఫైనల్ గా చేతులెత్తేశాడు

మరీ ఇంత నిర్దయగా విమర్శించడానికి కారణం లేకపోలేదు. అమీర్ ముంబై కంటే ఎక్కువగా హైదరాబాద్ లోనే తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. చిరంజీవితో పదే పదే పొగడ్తలు గుప్పించుకున్నారు. ఇంతగా చెబుతున్నారు కాబట్టి లాల్ సింగ్ లో బలమైన కంటెంట్ ఉందనే కదా టికెట్లు కొంటాం. అంతే కానీ సాగదీసిన భావోద్వేగాలను చూడాలంటే టీవీ ఛానల్స్ నిండా ఏక్తా కపూర్ నిర్మించిన బోలెడు జీడిపాకం సీరియల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా టికెట్ కొని వీటిని ఎందుకు చూడాలనే ప్రశ్న తలెత్తడం సహజం. రాజమౌళిలాగా దేశమంతా టూర్లు కొడుతూ దండోరాలు వేయడం కన్నా ముందు జనాలు ఎలాంటివి చూస్తున్నారో గుర్తించడం చాలా అవసరం

ప్రీతం పాటలు సోసోగా ఉన్నాయి. టైటిల్స్ లో వచ్చే పప్పరపం తప్ప మిగిలినవన్నీ బబుల్ గమ్ సాంగ్సే. తనుజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు. సత్యజిత్ పాండే ఛాయాగ్రహణం బాగుంది. హేమంతి సర్కార్ ఎడిటింగ్ మాత్రం కనీసం ఓ పావు గంట ట్రిమ్ చేసుంటే తిట్ల దండకాలు తగ్గేవి. సాంకేతిక విభాగాల మీద మరీ ఎక్కువ ఫిర్యాదులు లేవు కానీ ఇంత బడ్జెట్ పెట్టుకుని 80 దశకం నాటి వాతావరణాన్ని పూర్తిగా రీ క్రియేట్ చేయలేకపోయారు. ఈ విషయంలో సౌత్ మేకర్స్ తీసుకునే శ్రద్ధ అపారం. రచయిత అతుల్ ఫారెస్ట్ గంప్ ని భారతీయకరించే ప్రయత్నంలో పూర్తిగా జారీ పడ్డారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. గట్టిగానే ఖర్చు పెట్టారు

ప్లస్ గా అనిపించేవి

అమీర్ ఖాన్ పాత్ర
విజువల్స్
కథా నేపధ్యం

మైనస్ గా తోచేవి

నీరసమైన కథనం
పాటలు
ఫ్లాట్ నెరేషన్
ఎక్కువైన నిడివి

కంక్లూజన్

ప్రపంచంలో ఉండే ఏ భాషనుంచైనా ఏ సినిమానైనా స్ఫూర్తి తీసుకుని మనం కథలు రాసుకోవచ్చు. అందులో తప్పేమి లేదు. గాడ్ ఫాదర్ ఇన్స్ పిరేషన్ మణిరత్నం నాయకుడు వచ్చేలా చేసింది, రామ్ గోపాల్ వర్మను మాఫియా మాస్టర్ గా మార్చింది. కాకపోతే వాళ్ళు పబ్లిక్ పల్స్ అందుకుని వాటికి తగ్గట్టు తీసి అద్భుత విజయాలు అందుకున్నారు. కానీ లాల్ సింగ్ చడ్డా అదే చేయాలనుకుని ఇంకేదో చేసి ఫైనల్ గా నిరాశపరచడంలో మాత్రం నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యింది. అమీర్ మీద ఎంత అభిమానం ఉన్నా సరే చివరిదాకా రెండుముప్పావు గంటల సేపు దీన్ని కనక భరించగలిగితే ఉత్తమ ప్రేక్షకుల అవార్డు అందుకోవచ్చు

ఒక్క మాటలో – బోరింగ్ చడ్డా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి