iDreamPost
android-app
ios-app

Bhagavanth Kesari Review: బాలయ్య- అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ ఎలా ఉందంటే?

Bhagavanth Kesari Review: బాలయ్య- అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ ఎలా ఉందంటే?

సాధారణంగా బాలయ్య సినిమా అనగానే తెలుగు రాష్ట్రాల్లో హడావుడి మొదలవుతుంది. జై బాలయ్య అంటూ థియేటర్లు దద్దరిల్లుతాయి. మరోవైపు ఫ్లాపులులేని అనిల్ రావిపూడిలాంటి డైరెక్టర్ తో కలిసి బాలయ్య సినిమా అనగానే అందరిలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అనిల్ అనగానే అంతా కామెడీ జానర్ ని ఊహించి ఉంటారు. కానీ, కొత్తగా ట్రై చేస్తున్నాను అని ముందే చెప్పారు. నిజానికి జానర్ దాటి అనిల్ రావిపూడి పెద్ద సాహసం చేశాడు అనే చెప్పాలి. మరి.. ఆ ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అయ్యింది? అనిల్- బాలయ్య ప్రేక్షకులను మెప్పించారా లేదా తెలియాలి అంటే.. ఈ రివ్యూ మొత్తం చదివేయండి.

కథ:

ముంబయి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. వారిని కాపాడేందుకు అతని మిత్రుడు(రవి శంకర్) ముంబయి ధారావి ప్రాంతానికి వెళ్తాడు. అయితే అక్కడి నుంచి బయటపడాలి అంటే వారిలో ధైర్యం నింపాలి. అందుకోసం రవి శంకర్.. భగవంత్ కేసరి కథ చెప్తాడు. అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి(బాలకృష్ణ) సీఐగా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. సీఐగా చేసే భగవంత్ కేసరికి జీవితఖైదు పడుతుంది. భగవంత్ జైలులో తన జీవితం గడుపుతూ ఉంటాడు. జైలులోనే భగవంత్ కు కూతురు కాని కూతురు విజ్జి(శ్రీలీల) కలుస్తుంది. విజ్జీని ఆర్మీలో చేర్పించాలి అనేది భగవంత్ లక్ష్యం. అందుకోసం విజ్జీని ఒప్పించేందుకు భగవంత్ చాలా కష్టపడుతూ ఉంటాడు. అనుకోకుండా తన జీవితంలోకి వచ్చిన విజ్జీకి భగవంత్ తానే జీవితం అవుతాడు. ఆడపిల్ల అంటే లేడిపిల్ల కాదు.. పులి బిడ్డలా పెరగాలి అనేది భగవంతి ఫిలాసఫీ.

విజ్జి ఆర్మీలో చేరడం సంగతి పక్కన పెడితే అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కుంటుంది. పొలిటీషియన్స్, పెద్ద బిజినెస్ మ్యాన్ రాహుల్ సాంఘ్వీ(అర్జున్ రాంపాల్)కి బిగ్గెస్ట్ టార్గెట్ లా మారుతుంది. విజ్జీని అడ్డు తొలగించుకుని తమను తాము కాపాడుకోవాలి అని వీళ్లంతా ప్లాన్ చేస్తారు. అయితే రాహుల్ సాంఘ్వీకి విజ్జీకి మధ్యలో భగవంత్ అడ్డుగా నిలబడతాడు. అయితే రాహుల్ సాంఘ్వీకి భగవంత్ కి పాత పరిచయం ఉంది. ఒకరిని ఒకరు చంపుకునే వరకు వెళ్లారు. అయితే ఆ గతం ఏంటి? అసలు విజ్జీ కుటుంబం ఏమైంది? విలన్ నుంచి విజ్జీని ఎలా కాపాడాడు? అంత పెద్ద బిజినెస్ మ్యాన్ తో ఒంటరిగా భగవంత్ ఎలా తలపడ్డాడు? అసలు చివరకు విజయలక్ష్మిని ఆర్మీలో చేర్పించాడా లేదా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే మీరు థియేటర్ లో భగవంత్ కేసరి సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

అనిల్ రావిపూడి అనగానే అందరూ ఒక కామెడీ జానర్ ని ఎక్స్ పెక్ట్ చేస్తారు. అక్కడ యాక్షన్ సీన్లు, మధ్యలో మంచి పాటలు ఉంటాయి అనుకుంటారు. కానీ, ఈ సినిమా మాత్రం ఫుల్ మీల్స్ లెక్క.. యాక్షన్, కామెడీ, ఎమోషన్, డ్రామా ఇలా అన్నీ ఉంటాయి. కాకపోతే పాటలు మాత్రం కాస్త తక్కువ ఉన్నాయి. అనిల్ రావిపూడి మొదటి నుంచి ఒకటే మాట చెబుతున్నాడు. ఈ సినిమాలో మీరు సరికొత్త బాలయ్యను చూస్తారు. ఇంతవరకు ఎప్పుడూ ఇలా చూసి ఉండరు అని చెప్పాడు. నిజానికి ఆ మాటను అనిల్ నిలబెట్టుకున్నాడు. బాలయ్యను కొత్తగానే చూపించాడు. స్టేజుల మీద, స్పీచుల్లో బాలయ్య ఎక్కువగా హిందీ పదాలు వాడుతూ ఉంటారు. అలాంటి ఒక అలవాటుని ఈ సినిమాలో అనిల్ పూర్తిగా వాడేశాడు. భగవంత్ కేసరి హిందీ పదాలు బాగా వాడుతు ఉంటాడు. “కానోంకే బీచ్ మే బేజా రహేగా.. కాన్ పే తప్పడ్ పడేతో.. బాత్ బేజామే గుసేగా” అనే ఒక డైలాగ్ రీపీటెడ్ గా వినిపిస్తుంది. వాటికి ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.

గతంలో బాలయ్య సినిమాల్లో నాన్నగారు చెప్పారు అనే డైలాగ్ బాగా వినిపిస్తుంది. కాస్త గ్యాప్ తర్వాత ఆ పాట్రన్ ని అనిల్ ఈ సినిమాలో వాడాడు. ఈ సినిమాలో దాదాపుగా భగవంత్ పాత్రే మీకు కనిపిస్తుంది. ఆ పాత్రే మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, భయపెడుతుంది కూడా. కొన్ని కొన్ని సీన్లకు అయితే పడి పడి నవ్వుతారు. ముఖ్యంగా యాక్షన్ సీన్ల మధ్యలో రెట్రో సాంగ్స్ తో అనిల్ రావిపూడి స్టైల్ లో ఒక చిన్న మ్యాజిక్ చేశాడు. ఆ సీన్లు మాత్రం థియేటర్ బయటకు వచ్చినా కూడా మైండ్ లో నుంచి పోవు. అనిల్ రాసిన డైలాగులు మీ నోట్లో నానుతూనే ఉంటాయి. ‘కథలు పడితే.. జతలు రాలతాయి’ అనే డైలాగ్ ఉంటుంది. ఇది చాలామందికి తొందర్లోనే ఊతపదం అయ్యే అవకాశం కూడా ఉంది. చైల్డ్ అబ్యూస్ అనే సెన్సిటివ్ కాన్సెప్ట్ ని ఈ సినిమాలో అనిల్ రావిపూడి ఎంతో బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేశాడు. యాక్షన్ సీక్వెన్సుల విషయంలో మాత్రం కాస్త ఎక్కువ చేసినట్లు అనిపిస్తుంది. కానీ, స్క్రీన్ మీద ఉంది బాలయ్య కాబట్టి.. ఆడియన్స్ వాంట్ దట్ ‘ఎక్కువ’ అనమాట.

నిజానికి చాలావరకు సీన్లను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. కాకపోతే మొదట్లో విజ్జి- బాలయ్య మధ్య బాండింగ్ ఎస్టాబ్లిష్ చేసే సీన్లు, కాజల్ అగర్వాల్ వచ్చిన తర్వాత మాత్రం కాస్త సినిమా కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. ఈ సీన్లను విజ్జితో బాలయ్య బాండింగ్ ని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేయడానికి అనిల్ కాస్త టైమ్ తీసుకున్నాడు అని చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమా ఆకట్టుకుటుంది. అనిల్ అనగానే మీకు సోషల్ మీడియాలో డైలాగులు, ట్రోలింగ్ చేసే విధానం గుర్తొస్తుంది. ఈ సినిమాలో అది ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంది. బాలయ్య బాబుని కొత్తగా చూపిస్తాను అనే మాటను అనిల్ ఇక్కడే ఫుల్ ఫిల్ చేశాడు. విలన్ క్యారెక్టర్లు, రౌడీలను బాలయ్య చేసే ర్యాగింగ్ నెక్ట్స్ లెవల్ ఉంటుంది. అక్కడక్కడ ఇన్ డైరెక్ట్ గా బూతులను కూడా అనిల్ చాలా ఈజీగా వాడేశాడు. “ష్..ష్..ష్… సప్పుడు సేయకు… పిల్ల మొగ్గ” అలాంటి డైలాగులు మధ్య మధ్యలో చెవిలో పడుతూ ఉంటాయి. మొత్తానికి ఈ మూవీ ప్రేక్షకులను ఏడిపించడం, నవ్వించడం మాత్రమే కాదు.. ముఖ్యంగా ఆలోచింపజేస్తుంది. ఈ సినిమా చూశాక ఆడపిల్లల మీద మీ అభిప్రాయం కచ్చితంగా మారే అవకాశం ఉంటుంది.

ఎవరెలా చేశారు?:

ఈ సినిమాలో బాలకృష్ణ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఆయన యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాక్షన్, ఎమోషన్ లో ఆయన మార్క్ చూపించారు.  తెలంగాణ యాసలో బాలయ్య మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించిన కాజల్ అగర్వాల్ నామమాత్రపు పాత్రను చేసింది. తాను కనిపించినంత వరకు పర్వాలేదు అనిపిస్తుంది. ఇంక బాలయ్య తర్వాత శ్రీలీల పాత్ర గురించి చెప్పుకోవాలి. తన పాత్రకు తగినట్లు అన్ని ఎమోషన్స్ ని చాలా బాగా పలికించింది. అమాయకత్వం, తుంటరితనం, అల్లరి, కోపం ఇలా అన్ని సీన్లకు సంబంధించి శ్రీలీల యాక్టింగ్ లో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ప్రతినాయకుడిగా అర్జున్ రాంపాల్ కూడా మెప్పిస్తాడు. బాలయ్యను ఢీకొట్టే సన్నివేశాల్లో ధీటుగా నటించాడు. ఇంక సినిమాలో చాలాపాత్రలు కనిపిస్తాయి. ఫేమస్ డైలాగ్.. ఎవుర్రా నువ్వు ఇంత టాలెంటడా ఉన్నావు యాక్టర్ వీటీవీ గణేశ్, రఘుబాబు వంటి పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఏ పాత్ర కూడా ఎక్కువగా ఉంది అనే భావన కలగదు. అందరూ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.

టెక్నికల్ వర్క్:

డైరెక్టర్ గా అనిల్ రావుపూడి సత్తా ఏంటో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. కామెడీ జానర్ లో ఆయన టాలెంట్ ని చాలాసార్లు చూపించారు. ఈసారి కామెడీ, యాక్షన్, డ్రామా, ఎమోషన్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. బాలయ్య సినిమా అనగానే థమన్ ఎలా కొడతాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా థమన్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మెప్పిస్తుంది. ఇంక యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అక్కడక్కడ కాస్త ఓవర్ గా అనిపిస్తుంది. సినిమా టేకింగ్ నచ్చుతుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉంటాయి.

ప్లస్ లు:

  • బాలకృష్ణ
  • శ్రీలీల
  • కథనం
  • ఎమోషన్

మైనస్:

  • ప్రథమార్థంలో సాగదీత
  • రొటీన్ స్టోరీ

చివరిగా: భగవంత్ కేసరి.. ప్రక్షకులను మెప్పిస్తుంది..

రేటింగ్: 2.75/5

(ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

ఇది కూడా చదవండి : LEO Movie Review: ‘లియో’ మూవీ రివ్యూ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి