iDreamPost
android-app
ios-app

Varudu Kavalenu Review : వరుడు కావలెను రివ్యూ

  • Published Oct 29, 2021 | 10:47 AM Updated Updated Oct 29, 2021 | 10:47 AM
Varudu Kavalenu Review : వరుడు కావలెను రివ్యూ

సెకండ్ లాక్ డౌన్ తర్వాత ఫ్యామిలీస్ ని అంతో ఇంతో మెప్పించిన సినిమాలే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తెచ్చిన నేపథ్యంలో వరుడు కావలెను మీద అంచనాలు ఏర్పడ్డాయి. సితార్ బ్యానర్, త్రివిక్రమ్ చేయూత, నాగ శౌర్య రీతూ వర్మ ఫ్రెష్ కాంబినేషన్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుగా కనిపించాయి. లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో బడ్జెట్ గట్టిగానే పెట్టిన ఈ ఎంటర్ టైనర్ ఇవాళ రొమాంటిక్ తో పాటుగా థియేటర్లలో అడుగు పెట్టింది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కనిపించిన ఈ మూవీ మరి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకునేలా ఉందో లేదో రివ్యూలో చూద్దాం పదండి.

కథ

ఆకాష్(నాగ శౌర్య) యుఎస్ లో ఉద్యోగం చేస్తూ రిలాక్స్ అవ్వడం కోసం ఇండియా వస్తాడు. భూమి(రీతూ వర్మ) ఇంట్లో తల్లి(నదియా) చూసిన పెళ్లి సంబంధాలు అన్నింటికి నో చెబుతూ స్టార్టప్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకునే భూమి, ఆకాష్ లు ఒక ప్రాజెక్టు కోసం కలిసి పని చేయాల్సి వస్తుంది. అప్పుడే ఇద్దరూ గతంలో ఒకే కాలేజీలో చదువుకున్న జ్ఞాపకాలు బయటికి వస్తాయి. ప్రేమంటే తపించిపోయే ఆకాష్ కు, ప్రేమ వద్దు పెళ్లి వద్దు అని గిరి గీసుకున్న భూమికి మధ్య తిరిగి లవ్ స్టోరీ ఎలా మొదలయ్యింది, తిరిగి వీళ్ళ ప్రయాణం పెళ్లి దాకా వెళ్లిందా లేదా అనేది సినిమాలో చూడాలి.

నటీనటులు

నాగశౌర్య అందంగా ఉన్నాడు. పెర్ఫార్మన్స్ కు స్కోప్ లో ఉన్న సన్నివేశాలన్నింటిలోనూ బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కెరీర్ బెస్ట్ అనలేం తనకు తగ్గ క్యారెక్టర్లు బాగానే ఎంచుకుంటున్నాడు. అయితే ఇమేజ్ కోసమో అభిమానుల కోసమో మరి రెండు ఫైట్లు పెట్టారు కానీ అవేం అంతగా ఉపయోగపడలేదు. కమర్షియల్ సబ్జెక్టులకు పనికొస్తానని నాగశౌర్య చెప్పడం తప్ప. రీతూ వర్మలో సీరియస్ నెస్ మరీ ఎక్కువైపోయింది. పాత్రను అలా డిజైన్ చేశారు మరి. కాకపోతే తనకన్నా బెటర్ గా ఇంకెవరు న్యాయం చేసి ఉండేవాళ్లు అంటే చెప్పడం కష్టమే అనేంతగా భూమి క్యారెక్టర్ లో మెప్పించింది. ఆన్ స్క్రీన్ జోడిగా ఇద్దరూ బాగున్నారు.

తెలుగులో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నదియా మరోసారి గుర్తుండిపోయేలా చేశారు కానీ ఫస్ట్ హాఫ్ లో కొంత భాగం అయ్యాక మళ్ళీ కనిపించరు. మురళీశర్మ రెండు మూడు సీన్లకు పరిమితమయ్యారు అంతే. సప్తగిరి హడావిడి అయిదారు నిమిషాలే అయినప్పటికీ ఉన్నంతసేపు ల్యాగ్ అంటూ నవ్వించాడు. వెన్నెల కిషోర్, హిమజ, ప్రవీణ్ తదితరులు హాస్యానికి పనికొచ్చారు. తెరనిండుగా ఆర్టిస్టులు ఉన్నారు కానీ కొందరిని మాత్రం పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయారు. ఫోకస్ మొత్తం లీడ్ పెయిర్ మీద ఉండేలా చూసుకోవడంతో అందరికీ ఎక్కువ స్కోప్ దొరకలేదు. హర్షవర్ధన్, జయప్రకాష్, రోహిణి వీళ్ళవి మొక్కుబడి పాత్రలే.

డైరెక్టర్ అండ్ టీమ్

లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఎమోషన్స్ ని మిక్స్ చేయడం అంత సులభం కాదు. అందులోనూ ఎలాంటి అశ్లీలత అసభ్యత లేకుండా క్లీన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దడం ఇంకా పెద్ద సవాల్. దీన్ని దర్శకురాలు లక్ష్మి సౌజన్య స్వీకరించడాన్ని మెచ్చుకోవాలి. అయితే పైకి చెప్పుకోవడానికి చాలా మాములుగా అనిపించే పాయింట్ ని సినిమా చివరిదాకా ఎంగేజ్ చేసేలా స్క్రీన్ ప్లేని సెట్ చేసుకోవడం అంత సులభం కాదు. ఏదో సింపుల్ లైన్ తో నాలుగు జోకులు, అయిదు పాటలు, మూడు మంచి సీన్లు పెట్టేస్తే సరిపోదు. భావోద్వేగాలు కలగాలి. స్క్రీన్ మీద ఆర్టిస్టులు పలికించే ఫీలింగ్స్ ఆడియన్స్ ఫీలవ్వాలి. అప్పుడే ఇవి సక్సెస్ కోవలోకి చేరతాయి.

ఇన్నేళ్లు గడిచినా బొమ్మరిల్లు ఇప్పటికీ ఎందుకు ఎవర్ గ్రీన్ గా చెప్పుకుంటున్నాం అంటే పైన చెప్పినవాటిని దర్శకుడు రచయిత కలిసి పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేయడమే. కానీ వరుడు కావలెనులో అది పూర్తిగా పండలేదు. ఉదాహరణకు హీరో హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ నుంచి మనం ఏదేదో ఎక్స్ పెక్ట్ చేస్తాం. తీరా చూస్తే అది చప్పగా సాగుతుంది. ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన లవ్ డ్రామాల తరహాలో మరీ సింపుల్ గా అయిపోతుంది. పోనీ అదైనా హిలేరియస్ గానో ఎంటర్ టైనింగ్ గా తీర్చిదిద్దారా అంటే అదీ లేదు. మజిలిలో సమంతా ట్రాక్ వర్కౌట్ అయ్యింది కదా ఇక్కడెందుకు కాదనుకున్నారో ఏమో మరి. ఇలాంటి మైనస్సులు పంటి కింద రాళ్లలా తగిలాయి.

నిజానికి ఈ సినిమా టేకాఫ్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ స్మూత్ గా సాగిపోతుంది. భూమి క్యారెక్టర్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించినా కూడా తన ఆఫీస్ సీన్లు పేలడం ప్లస్ అయ్యింది. ప్రీ ఇంటర్వెల్ కు ముందు ఎప్పుడైతే భూమి తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయాలని డిసైడ్ చేసుకుని సిల్లీ రీజన్ కు మనసు మార్చుకుంటుందో అక్కడి నుంచి గ్రాఫ్ పెద్దగా ముందుకు కదలదు. త్రివిక్రమ్ స్టైల్ లో రెగ్యులర్ గా అన్ని సినిమాల్లో ఉండే ఓ విలన్ టైపు పాత్రను హర్షవర్ధన్ తో చేయించడం, నాగ శౌర్య మాస్ హీరో కదాని గుర్తొచ్చి ఒక ఫైట్ పెట్టడం ఇవన్నీ కృతకంగా అనిపించినా ఏదోలా పాస్ అయ్యాయి.

ఎప్పుడైతే కథ కాలేజీకి చేరుతుందో అక్కడి నుంచి ప్రయాణం ఎగుడు దిగుడుగా మారిపోయింది. భూమి ఆలోచనల్లాగే కొంత గందరగోళం కలుగుతుంది. గంటకు పైగా కంటెంట్ కు మెటీరియల్ లేక సాగదీసిన సీన్లు ఇబ్బంది పెడతాయి. సప్తగిరి భాషలో చెప్పాలంటే ఆ ల్యాగుని సరిగా పట్టించుకోలేదు. క్లైమాక్స్ లోనూ సుదీర్ఘమైన సంభాషణలు అంతగా కనెక్ట్ కావు. ఆకాష్ భూమిల మధ్య లవ్ ని పూర్తి స్థాయిలో మనమే ఫీల్ కానప్పుడు అక్కడ చెప్పే డైలాగులు బాగున్నా కూడా ఆ కారణంగానే ఎస్టాబ్లిష్ కాలేకపోయాయి. కాకపోతే ఇప్పటి యూత్ సినిమాల ఫార్ములాలో కాకుండా తెరకెక్కించడంలో లక్ష్మి సౌజన్య ప్రయత్నం సిన్సియర్ అని చెప్పొచ్చు.

సంగీతంలో విశాల్ చంద్రశేఖర్ పనితనం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో బాగానే ఉంది. పాటలు కూడా పర్వాలేదు. తమన్ కంపోజ్ చేసిన దిగుదిగు నాగనే ఊహించినట్టు హై లైట్ గా నిలిచింది. వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం కలర్ ఫుల్ గా సాగింది. సితార ప్రొడక్షన్ వేల్యూస్ ని బాగా చూపించింది. నవీన్ నూలి ఎడిటింగ్ లెన్త్ ని కంట్రోల్ లోనే ఉంచింది కానీ అసలు విషయంలోనే కొంత సాగతీత ఉండటంతో ఏమీ చేయలేం. గణేష్ కుమారి రావూరి సంభాషణలు గొప్పగా కాదు కానీ బాగున్నాయి. త్రివిక్రమ్ ప్రభావం కొంత ఉంది. నిర్మాణ విలువల బడ్జెట్ కి తగట్టు సాగాయి. పెద్దగా కంప్లయింట్స్ ఏమి లేవు.

ప్లస్ గా అనిపించేవి

నాగ శౌర్య -రీతూ వర్మ జంట
రెండు పాటలు
క్యాస్టింగ్
ఛాయాగ్రహణం

మైనస్ గా తోచేవి

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
సెకండ్ హాఫ్ ల్యాగ్
ఎమోషన్లు వీక్ కావడం
ఎంటర్ టైనర్ ఫీలింగ్ తక్కువే

కంక్లూజన్

పెళ్లి చూపులు కాన్సెప్ట్ తో ఈ మధ్యే వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాగే వరుడు కావలెను కూడా అదే కోవలో సాగే డీసెంట్ ఎంటర్ టైనర్. కాకపోతే పదే పదే చూడాలనిపించే ఫన్ కానీ, ఫ్రెష్ లవ్ కానీ ఇందులో లేకపోవడం ఫలితం మీద ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. క్లీన్ గా ఉంటే చాలు గడిచిపోతుందనుకుంటే ట్రై చేయొచ్చు. అలా కాకుండా ఎక్కడా విసుగు రాకుండా, చూసినంత సేపు ఎంత బాగుందో అనిపించాలంటే మాత్రం మీ అంచనాలను వరుడు పూర్తిగా అందుకోలేడు. అయినా యావరేజ్ కంటెంట్ తోనూ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ పెళ్ళికొడుకు కూడా పాస్ అవుతాడేమో.

ఒక్క మాటపాస్ మార్కుల వరుడు