iDreamPost
android-app
ios-app

శ్రీకారం రివ్యూ

  • Published Mar 11, 2021 | 12:10 PM Updated Updated Mar 11, 2021 | 12:10 PM
శ్రీకారం రివ్యూ

శర్వానంద్ నుంచి చెప్పుకోదగ్గ మంచి సక్సెస్ ఫుల్ సినిమా వచ్చి చాలా కాలమవుతున్న తరుణంలో విడుదలైన శ్రీకారం మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. రైతులు, వ్యవసాయం మీద అరుదుగా చిత్రాలు వస్తున్న ట్రెండ్ లో దీని మీద ఇంత బడ్జెట్ పెట్టి 14 రీల్స్ అధినేతలు నిర్మించడం ఒక రకంగా సాహసమే. అందులోనూ ఒక షార్ట్ ఫిలింని బాగా తీశాడన్న నమ్మకంతో కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చినప్పుడు ఇలా అనిపించడం సహజం. ట్రైలర్ వచ్చాక కాన్సెప్ట్ దేని గురించో క్లియర్ గా అర్థం కావడం, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు చిరంజీవి, కెటిఆర్ లాంటి సెలెబ్రిటీలు రావడం హైప్ ని పెంచింది. మరి దానికి తగ్గట్టు ఉందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

కన్నఊరికి దూరంగా హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా జీవితం గడుపుతున్న కార్తిక్(శర్వానంద్)కు సెలవులకు అక్కడికి వెళ్లి వచ్చాక జాబ్ మానేసి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ కారణంగానే ప్రియురాలు చైత్ర(ప్రియాంకా మోహన్) దూరమవుతుంది. కానీ ఇంటికి వచ్చాక గ్రామంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఊరిపెద్ద ఏకాంబరం(సాయి కుమార్)గతంలో తన మావయ్య పేదలకు ఉచితంగా పంచిపెట్టిన పొలాలను అప్పులిచ్చి తిరిగి ఆక్రమించుకునే పనిలో ఉంటాడు. మరోవైపు కార్తిక్ తన లాంటి యువకులను సిటీ నుంచి పల్లెటూళ్ళకు తీసుకొచ్చి సేద్యం చేయించే లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెరమీద చూడాలి

నటీనటులు

పాత్ర లక్షణాలు చూస్తే శర్వానంద్ ఇలాంటిది చేయలేదు కానీ యాక్టింగ్ పరంగా చూసుకుంటే చాలా ఈజ్ తో కార్తీక్ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. రైతు కొడుకు రైతు కావాలన్న సంకల్పంతో పోరాడే యువకుడిగా బాగా నటించాడు. ఎప్పటిలాగే ఎమోషన్ సీన్స్ లో తన మార్కుని చూపించాడు. సెటిల్డ్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంలో ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు. ఫైట్లు డాన్సులతో పెద్దగా పనేమీ లేకపోవడంతో ఫోకస్ అంతా నటన మీదే పెట్టాడు.

హీరోయిన్ ప్రియాంకా మోహన్ అందంతో పాటు అభినయాన్ని చక్కగా పండించింది. మరీ గొప్పగా అని చెప్పలేం కానీ ఆకర్షణ విషయంలో యూత్ ని మెప్పించేలా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.రావు రమేష్ తనకు దొరికిన ఎమోషనల్ పాత్రలో జీవించేశారు. సాయి కుమార్ విలనీ రొటీనే కానీ ఇంతకన్నా మంచి ఛాయస్ కష్టమే. నరేష్, ఆమని, మురళి శర్మ, దేవి ప్రసాద్, ప్రభాస్ శీను, సప్తగిరి తదితరులు ఆయా రోల్స్ కు తగ్గట్టు చేసుకుంటూ పోయారు. సత్యతో చేయించిన బాబు ,మోహన్ టైపు కామెడీ అంతగా పేలలేదు. ఫ్రెండ్స్ గా నటించిన టీమ్ కూడా ఓకే.

డైరెక్టర్ అండ్ టీమ్

సినిమాల ద్వారా ఏదైనా సందేశాన్ని చెప్పడం మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. అందులోనూ చదువుకున్న జనానికి దూరంగా నడిచే వ్యవసాయం లాంటి కాన్సెప్ట్ ని తీసుకున్నప్పుడు అందులో చాలా రిస్క్ ఉంటుంది. గతంలో మహర్షి, భీష్మ, శ్రీమంతుడు లోనూ ఇదే ప్రయత్నం చేశారు కానీ వాటికి కావాల్సినంత కమర్షియల్ కోటింగ్ ఫుల్లుగా దట్టించడంతో జనం మెచ్చుకుని డబ్బులు ఇచ్చారు. కానీ డెబ్యూ డైరెక్టర్ కిషోర్ రెడ్డికి అలాంటి ఉద్దేశాలు లేవు. తన ఆలోచనలు నిజాయితీగా చెప్పాలనుకున్నాడు. శర్వానంద్ ఇమేజ్ కోసం ఫ్యాన్స్ కోసం కొంత భాగం రాజీ పడినప్పటికీ అసలు కథ మొదలుపెట్టగానే ఎక్కువ డీవియేషన్స్ తీసుకోలేదు.

శ్రీకారంకు అదొక్కటే ప్లస్ పాయింట్ గా నిలిచి పూర్తిగా కాపాడలేకపోయింది. కారణం ఎమోషన్లను చాలా బరువుగా తెరకెక్కించిన కిషోర్ అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించడానికి కావలసిన మెటీరియల్ ని పూర్తిగా విస్మరించాడు. కాన్సెప్ట్ ఎంత మంచిదైనప్పటికీ నూటా యాభై రూపాయల టికెట్ కొన్న ప్రేక్షకుడిని మెప్పించాలంటే సినిమాటిక్ గానే ఉండాలి. తప్పదు. కొంత ఫార్ములా ధోరణిని కలుపుకు పోవాలి. కిషోర్ అలా చేయకూడదు అనుకోవడమే మైనస్ అయ్యింది. సన్నివేశాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ ఏదీ హై అనిపించే లెవెల్ లో మైండ్ లో రిజిస్టర్ కాదు. సెంటిమెంట్ కూడా తాత్కాలికంగానే కనెక్ట్ అవుతుంది.

వ్యవసాయంలో ఎన్ని లోటుపాట్లు కష్టనష్టాలు ఉంటాయో రోజూ పేపర్లలో చూస్తూనే ఉంటాం. దళారీ వ్యవస్థ, రాజకీయ నాయకుల ప్రమేయం, ప్రభుత్వ విధానాలు, మార్కెట్ లో హెచ్చుతగ్గులు, ఎరువుల ధరలు, వ్యవసాయ శాఖ అవినీతి ఇలా బొచ్చెడు సమస్యలు రైతులను జలగల్లా పీడించబట్టే ఆత్మహత్యలు, ఊరు వదిలి వెళ్లిపోవడాలు జరుగుతున్నాయి. కానీ కిషోర్ ఇందులో ఏ అంశాన్ని తీసుకోలేదు. హీరో అలా పిలవగానే అంతా చాలా స్మూత్ గా అయిపోతుంది. ఓ పిలుపు ఇవ్వగానే అన్ని చకచకా జరిగిపోతాయి. కరోనా వచ్చినా సరే కాయగూరల హోమ్ డెలివరీ కాన్సెప్ట్ సూపర్ హిట్ అయిపోతుంది. ఇదంతా కొంత లాజిక్ కి దూరంగానే సాగుతుంది.

శ్రీకారం లాంటి ప్రయత్నాన్ని విమర్శించడానికి ఇదంతా చెప్పడం లేదు. షార్ట్ ఫిలిం కోసం రాసుకున్న లైన్ ని సినిమా కోసం డెవలప్ చేసుకున్నప్పుడు కొన్ని సమీకరణాలు చెక్ చేసుకోవాలి. కేవలం భావోద్వేగాలతో రెండు గంటలకు పైగా ఎంటర్ టైన్ చేయడం చాలా కష్టం. అసలు ఏ మాత్రం సింక్ కానీ లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ లోనే ప్రతిబంధకంగా నిలుస్తుంది. హీరోయిన్ పదే పదే హీరో వెంటపడి ఆరాధించడం తప్ప దాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడాన్ని లైట్ తీసుకున్నారు. దీంతో ఇది తేడా కొట్టేసింది. కాకపోతే నటీనటుల పెర్ఫార్మన్స్ దన్నుగా నిలిచి కిషోర్ ఆలోచనకు తోడ్పాటు అందించి శ్రీకారంని పర్వాలేదు క్యాటగిరీలోకి తీసుకొచ్చారు

సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ పనితనం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో బాగా వినిపించింది. పాటల విషయానికి వస్తే ఇప్పటికే ఛార్ట్ బస్టర్ అయిన వస్తానంటివో పోతానంటివో తప్ప మిగిలినవి సోసోగానే పాస్ అయ్యాయి. శతమానంభవతి, మహానటి రేంజ్ లో మిక్కీ మేజిక్ ఈసారి ట్యూన్స్ లో రిపీట్ కాలేదు. యువరాజ్ ఛాయాగ్రహణం బాగా ప్లస్ అయ్యింది. పల్లె అందాలను, పొలం బ్యాక్ డ్రాప్ లో సన్నివేశాలను చక్కగా బంధించాడు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సినిమా మొత్తం కాకపోయినా కీలకమైన సీన్స్ లో మాత్రం హత్తుకునేలా వచ్చాయి. మార్తాండ్ ఎడిటింగ్ లెన్త్ ని తగ్గించినా స్క్రీన్ ప్లేలో ల్యాగ్ తప్పలేదు. 14 రీల్స్ నిర్మాతలకు అగ్రతాంబూలం ఇవ్వాలి. కమర్షియల్ లెక్కలకు రిస్క్ అనిపించే ఇలాంటి సబ్జెక్టు మీద ఇంత బడ్జెట్ పెట్టినందుకు.

ప్లస్ గా అనిపించేవి

శర్వా పాత్ర ప్లస్ నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ప్రొడక్షన్ వాల్యూస్
ఛాయాగ్రహణం

మైనస్ గా తోచేవి

లవ్ ట్రాక్
సెకండ్ హాఫ్ సాగతీత
ఒకటి మినహా మిగిలిన పాటలు
ఎమోషన్ల బరువు ఎక్కువైపోవడం

కంక్లూజన్

మంచి ప్రయత్నం అయినా కూడా వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని సినిమా తీశారన్న ఒకే కారణంగా శ్రీకారంని గొప్ప సినిమాగా పరిగణించలేం. ఎందుకంటే సందేశాల మాట ఎలా ఉన్నా కమర్షియల్ లెక్కలకు లోబడే బిజినెస్ చేశారు, టికెట్లు అమ్మారు కాబట్టి అన్ని కోణాల్లోనూ శల్యపరీక్ష చేసుకోవలసిందే. ఆ ప్రకారం చూసుకుంటే శ్రీకారం సాధారణ ప్రేక్షకుడిని ఏదో తెలియని అసంతృప్తితోనే బయటికి పంపిస్తుంది. కథనంలో వేగాన్ని జొప్పిస్తూ చెప్పాలనుకున్న పాయింట్ కు కట్టుబడుతూనే ఇంకాస్త రియలిస్ట్ గా సినిమాటిక్ గా తీసుంటే అవుట్ ఫుట్ వేరుగా ఉండేది. అందుకే శ్రీకారం మెసేజ్ ఇవ్వగలిగింది కానీ మేజిక్ చేయలేకపోయింది

ఒక్క మాటలో – సాగతీత వ్యవసాయం