Idream media
Idream media
ఒకటే బాదుడు
ప్రేమ కథలు అందంగా ఉంటాయి. అయితే అందంగా కథ చెప్పడం కూడా తెలియాలి. ఇద్దరిలోకం ఒకటే సినిమా అందంగా ఉంది కానీ, అందులో కథ లేదు. కథ ఎందుకు లేదంటే ఒరిజనల్ టర్కీ సినిమాలో కథ లేదు కాబట్టి.
Love Is Just A Coincidence అనే టర్కీ సినిమాకి ఇది జిరాక్స్ కాపీ. అయితే నిజాయితీగా ఈ విషయాన్ని స్క్రీన్ మీద మొదటే వేస్తారు. ఎవరు కనిపెడతారులే, అనే ధీమాకి పోలేదు.
దర్శకుడు జిఆర్ కృష్ణ ఎక్కడా కూడా సొంత బుర్ర వాడకుండా టర్కీ సినిమాని కట్ పేస్ట్ చేశాడు. షాట్స్, డైలాగ్‌లు సహా యధాతథం. ఎంత పక్కాగా తీశాడంటే దాని నిడివి రెండు గంటలే, ఇదీ అంతే. కాసేపైనా థియేటర్‌లో కూర్చుంటామంటే దానికి సమీర్‌రెడ్డి ఫొటోగ్రఫీ, షాలినీ నటన కారణం.
సినిమా పుట్టినప్పటి నుంచి ఇలాంటి కథలు ఎన్ని వచ్చాయో లెక్కలేదు. హీరోహీరోయిన్లలో ఎవరో ఒకరికి జబ్బు ఉండడం అనేది అరిగిపోయిన కథ. 1978లో వచ్చిన అమరప్రేమ (కమల్‌హాసన్) నుంచి వంద పేర్లు చెప్పొచ్చు. 2002లో వచ్చిన చార్మీ మొదటి సినిమా “నీతోడు కావాలి” కూడా ఇలాంటి కథే. అయితే బలమైన సంఘటనలు, సంఘర్షణ ఉంటే కొంత మెరుగ్గా ఉండేదేమో, టర్కీ సినిమానే పరమ బోర్, దాంట్లో ఏం నచ్చిందో దిల్‌రాజుకే తెలియాలి.
టీవీ సీరియల్‌ని రెండు గంటలు బ్రేక్ లేకుండా చూపించినా , షార్ట్ ఫిల్మ్‌ని సాగదీసినా ఈ సినిమాలాగే ఉంటుంది. కథ ఏమిటంటే ఊటీలో ఒకే ఆస్పత్రిలో ఒకే సమయంలో హీరోహీరోయిన్లు పుడుతారు. హీరో తండ్రి ఫొటోగ్రాఫర్. స్టూడియో నడుపుతూ ఉంటాడు.
హీరోయిన్ తాత ఊటీలో ఉంటాడు. హీరోహీరోయిన్లకి చిన్నప్పటి స్నేహం ఉంటుంది. (ఇదంతా ప్లాష్ బ్యాక్‌లో వస్తూ ఉంటుంది) హీరోయిన్ షాలినీకి సినిమాల్లో నటించాలని ఇష్టం. ఆడిషన్స్‌కి వెళుతూ ఉంటుంది. రాహుల్ అనే కుర్రాడు షాలినీని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే అతని తల్లికి షాలినీ యాక్ట్ చేయడం ఇష్టం ఉండదు.
తన చిన్నప్పటి ఫొటోను ఎగ్జిబిషన్‌లో చూసి రాజ్‌తరుణ్‌ని కలుస్తుంది. తన చిన్నప్పటి స్నేహితురాలిగా హీరో గుర్తు పడతాడు. ఇద్దరి మధ్య పరిచయం, బాల్య జ్ఞాపకాలు ప్రేక్షకుడితో ఏ సంబంధం లేకుండా వారు మాట్లాడుతూ ఉంటారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో హీరోకి గుండె జబ్బు అని తెలుస్తుంది.
సెకండాఫ్‌లో ఏమవుతుందో ఓపిక ఉంటే థియేటర్‌కి వెళ్లి చూడండి. రాజ్‌తరుణ్ నీరసంగా చూడడం, దగ్గడం, ఆయాస పడడం తప్ప ఈ సినిమాలో చేసిందేమీ లేదు. పాత సినిమాల్లో ఈ ANR పాత్రలు రాజ్‌తరుణ్‌కి సెట్ కావు. ఉత్సాహం ఉన్న కుర్రాడిగా కనిపిస్తే ఇంకొంత కాలం తెరమీద కనిపిస్తాడు. ఇలాంటి సినిమాలు ఇంకో రెండు తీస్తే , అతను వైజాగ్ వెళ్లిపోవడం ఖాయం. ఇప్పటికే తలాతోకా లేని సినిమాల్లో యాక్ట్ చేసి కెరీర్ చాలా నష్టపోయాడు.
షాలినీ అందంగా కనిపించినా , బాగా నటించినా, ఇదేమీ ఫ్లస్ అయ్యే సినిమా కాదు. కథలో అనేక మలుపులు ఉండాలి కానీ, ఊటీ రోడ్లలోని మలుపులు చూపిస్తే ఏంటి ప్రయోజనం? నాజర్ ఉన్నా అతిథి పాత్రే. రోహిణి, భరత్ వీళ్లెవరికీ నటించే స్కోప్ లేదు.
సినిమా అంటే ఏదో ఒక పాయింట్ ఉండాలి. ఏం చెబుతున్నామో డైరెక్టర్‌కు తెలియాలి. ఈయనకి టర్కీ భాష రాదు కాబట్టి, ఆ టర్కీ డైరెక్టర్ ఏం చెప్పదలచుకున్నాడో తెలియదు. ఈ కథని కృష్ణా నగర్‌లో ఎవరిని అడిగినా ఇస్తారు. కోఠీలో దొరికే కథకి టర్కీ వరకు వెళ్లడమే మన ఇండస్ట్రీ ప్రత్యేకత.
దిల్‌రాజు బ్యానర్ నుంచి ఇంకో రెండు , ఈ టైప్ వస్తే ఆయన టేస్ట్ మీద కూడా నమ్మకం పోతుంది.
చదువు, చదువు, చదువుతూనే ఉండు….లేదంటే నువ్వెప్పటికీ ఫిల్మ్ మేకర్ కాలేవు.
ఇది WERNER-HERZOG అనే జర్మన్ డైరెక్టర్ మాట. మనవాళ్లకి పేపర్ చదివే ఓపిక లేదు. ఇక పుస్తకాలని, ప్రపంచాన్ని ఏం చదువుతారు?