స్టైలిష్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఫాలోయింగ్ ని ఏర్పరుచుకున్న అల్లు అర్జున్ సుమారు ఏడాదిన్నర గ్యాప్ తో చేసిన చిత్రంగా అల వైకుంఠపురములో మీద అభిమానులకే కాదు సగటు సామాన్యులకు కూడా ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. అందులోనూ విడుదలకు చాలా రోజుల ముందే మ్యూజిక్ పరంగా సెన్సేషన్ సృష్టించడంతో హైప్ అలా ఎగబాకుతూ పోయింది . అందుకే సంక్రాంతి బరిలో దీనికంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. మాటల మాంత్రికుడిగా తన పేరునే బ్రాండ్ గా మార్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు కావడంతో బిజినెస్ పరంగానూ క్రేజ్ రెట్టింపయ్యింది. అసలే హీరోతో ఇది హ్యాట్రిక్ మూవీ. ఈ నేపధ్యంలో అల వైకుంఠపురములో ఎలాంటి కంటెంట్ తో వచ్చింది తన మీద పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకుందా లేదా రివ్యూలో చూసేద్దాం
ఇంతకీ కథేంటి
ఉన్నత కుటుంబానికి చెందిన రామచంద్ర దంపతుల(జయరాం-టబు)కు, వాళ్ళ కంపెనీలో క్లర్క్ గా పని చేసే వాల్మీకి జంట(మురళీశర్మ)కు ఒకే హాస్పిటల్ లో ఒకే రోజు మగపిల్లలు పుడతారు. నర్సు(ఈశ్వరి)చేసిన పొరపాటు వల్ల బిడ్డలు మారిపోతారు. దీన్ని వాల్మీకి అవకాశంగా తీసుకుంటాడు. దీంతో అతని బిడ్డ రాజ్(సుశాంత్) ధనవంతుడిగా, వాళ్ళ అబ్బాయి బంటు(అల్లు అర్జున్) మిడిల్ క్లాస్ వాడిగా పెరిగి పెద్దవుతారు. బంటు తను పనిచేసే ఆఫీస్ బాస్ అమూల్య(పూజా హెడ్గే)ని ప్రేమిస్తాడు. కాని అమూల్యకు రాజ్ తో ఎంగేజ్మెంట్ అవుతుంది. కొన్ని అనూహ్య పరిణామాల తర్వాత విలన్ అప్పలనాయుడు(సముతిర ఖని)వల్ల బంటు తాత(సచిన్ కెడ్కర్) సహాయంతో పనులు సమస్యలు చక్కదిద్దడానికి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. తర్వాత ఏమైంది, రాజ్ బంటుల రహస్యం ఎలా బయటపడింది, తప్పు చేసిన నర్సు ఏమైంది లాంటి ప్రశ్నలకు సమాధానం స్క్రీన్ మీదే చూడాలి.
ఎవరెలా చేశారు
ఇప్పుడున్న యువతరం హీరోల్లో ఆలు అర్జున్ ది డిఫరెంట్ స్టైల్. గంగోత్రికి రెండో సినిమా ఆర్యకి ఏమాత్రం సంబంధం లేని మేకోవర్ తో అందరిని ఆశ్చర్యపరచడం కెరీర్ మొదటి నుంచే తనకు అలవాటు. అప్పుడప్పుడు ఎంచుకున్న కథల్లో జరిగిన పొరపాట్ల వల్ల ఫెయిల్యూర్స్ అందుకున్నాడు కానీ యాక్టర్ గా ఎప్పటికప్పుడు తన ప్రోగ్రెస్ గ్రాఫ్ ని పెంచుకుంటూనే వచ్చాడు బన్నీ. సగటు పక్కింటి కుర్రాడిగా కనిపించే ఫీచర్స్ ఉండటంతో యూత్ కి తొందరగా కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఇందులోనూ రెండు ఉన్న షేడ్స్ ఉన్న బంటు పాత్రలో చెలరేగిపోయాడు. తొలిసగంలో కనిపించే బంటి రోల్ లో కాస్త జులాయి పోలికలు స్పష్టంగా కనిపిస్తాయి. కథ దృష్ట్యా అలా ప్రవర్తించడం సహజమే అయినప్పటికీ రెండూ ఒకటి అయితే ఖచ్చితంగా కాదు.
ఇక్కడ బంటిలో చాలా అల్లరి ఉంటుంది. కొంటె కోణం దోబూచులాడుతుంది. అవసరమైనప్పుడు రఫ్ యాంగిల్ బయటికి వస్తుంది. ఎమోషనల్ గా టచ్ చేయడం తెలిసినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇవన్నీ చాలా ఈజీ తో చేసేశాడు అల్లు అర్జున్. ఎమోషన్స్ ని చాలా సెటిల్డ్ గా చేసి చూపించాడు. ముఖ్యంగా ఆఫీస్ లో మెడ్లే డాన్స్ చేస్తూ సమాధానం ఇచ్చే సీన్ లో, ప్రీ క్లైమాక్స్ లో పాటకు అనుగుణంగా ఫైట్ చేసే ఎపిసోడ్ లో, మొదటిసారి విలన్ తో ముఖాముఖీ తలపడే సన్నివేశంలో అల్లు అర్జున్ బెస్ట్ ని చూడొచ్చు. మాస్ విపరీతంగా కనెక్ట్ అయ్యేది వీటికే. సెకండ్ హాఫ్ లో తన స్వంత ఇంట్లోకి ఎంటరయ్యాక వచ్చే క్యారెక్టర్ వేరియేషన్స్ ని మోసిన తీరు చూస్తే ఇలాంటి సినిమా కోసం 18 నెలలు వెయిట్ చేయడానికి న్యాయం జరిగిందనిపిస్తుంది. రెండు పాటల్లో డాన్సు కూడా తన మార్క్ చూపించాడు .
ఓ పాటలో గీత రచయిత రామజోగయ్య శాస్త్రి రాసినట్టు హీరోయిన్ పూజా హెగ్డే నిజంగానే బుట్టబొమ్మలాగే చాలా అందంగా క్యూట్ గా ఉంది. డీజే టైంకి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చి ఆకర్షణ పరంగా ఇంకో రెండు మెట్లు ఎక్కేసింది. పాత్ర పరంగా కొంత వెయిటేజ్ ఉన్నప్పటికీ పెర్ఫార్మన్స్ చేయడానికి ఎక్కువ స్కోప్ దొరకలేదు. మలయాళ నటుడు జయరాం బిజినెస్ మెన్ గా సగటు తండ్రిగా ఆ పాత్రకు నిండుగా సరిపోయాడు. తనలో సీనియారిటీని ప్రదర్శించి క్యారెక్టర్ ని నిలబెట్టాడు.
చాలా కాలం తర్వాత దీంతోనే కం బ్యాక్ ఇచ్సిన టబు త్రివిక్రమ్ సినిమాల్లో ఖచ్చితంగా ఉండే రిచ్ విమెన్ గా ఒదిగిపోయింది. తెరకు దూరమై ఇన్నేళ్లు దాటినా ఇంకా తనలో ఆ గ్లామర్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కాకపోతే నదియా తరహాలో మరీ గుర్తుండిపోయే పాత్ర కాదు. సుశాంత్ చెప్పుకోవడానికి సెకండ్ హీరో పాత్రలా అనిపిస్తుంది కానీ నిజానికి ఇది డమ్మీ రోల్. ఒకే ఒక్క సీన్లో మాత్రమే డైలాగ్ చెప్పే ఛాన్స్ ఇచ్చాడు దర్శకుడు. మిగిలిన చోట్ల మౌన వ్రతమే. సునీల్ సగటు కమెడియన్ కంటే తక్కువ స్థాయికి వచ్చేశాడు.
ఇక మురళీశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన బిడ్డ రాజాలా పెరగాలి బ్రతకాలనే స్వార్థం నిండిన మధ్యతరగతి తండ్రి పాత్రలో అద్భుతంగా చేశాడు. సినిమా చూసి బయటికి వచ్చాక అల్లు అర్జున్ తర్వాత గుర్తుండేది ఇతనే. అంతలా ప్రభావం చూపించాడు. తాతగా సచిన్ కెడ్కర్ తెలుగులో మొదటిసారి తన నటనను కాస్తో కూస్తో బయటపెట్టే తాత పాత్ర దొరికింది. ప్రూవ్ చేసుకున్నాడు. రాహుల్ రామకృష్ణ, నవదీప్ జస్ట్ రెండు మూడు సీన్లకే పరిమితం. సుశాంత్ మరదలిగా నివేత పేతురేజ్ చేసింది కూడా ఏమి లేదు. విలన్ గా సముతిరఖని బాగున్నాడు. మూతి వంకర పెట్టే గెస్చర్ వర్క్ అవుట్ అయ్యింది. బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ లు చేసింది కూడా తక్కువే.
దర్శకుడు గెలిచాడా ?
త్రివిక్రమ్ కథలు ఎప్పుడూ గొప్పగా ఉండవు. కథనాలు మాత్రమే మెప్పించేలా రాసుకుంటాడు. ఇందులో కూడా అదే జరిగింది. అల వైకుంఠపురములో చూస్తున్నంత సేపు మనం ఇలాంటి పాత్రలు సన్నవేశాలు గతంలో చూసినవే కదాని పదే పదే మెదడులో తడుతూనే ఉంటుంది. కానీ విసుగు రాకుండా తన మార్కు డైలాగులు టేకింగ్ తో త్రివిక్రమ్ ఆ ఫీలింగ్ ని సాధ్యమైనంత కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇందులో జులాయి-అత్తారింటికి దారేది సినిమాల్లో ఉండే మనుషులు, సంఘటనలు రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే ఎమోషన్ ని తెరమీద బలంగా ఆవిష్కరించడంలో దిట్ట అయిన త్రివిక్రమ్ ఈసారి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు. పూజా హెగ్డే – అల్లు అర్జున్ మధ్య ట్రాక్ డెవలప్ చేసే ప్రాసెస్ లో ఓ మాములు దర్శకుడిగా ఆలోచించి తడబడినప్పటికీ ఆ లోపాన్ని తర్వాత కవర్ చేసి తన మార్కు టాలెంట్ ని చూపించి మెప్పిస్తాడు
ఇప్పటికే విపరీతంగా బ్లాక్ బస్టర్ అయిన సామజవరాగమనా పాట కోసమే రాసుకున్నట్టు అనిపించే హీరోయిన్ కాళ్ళు తొడలు చూపించే సీన్లు కొంత ఇబ్బంది పెడతాయి. ఇంత కన్నా మిన్నగా త్రివిక్రమ్ ఎందుకు ఆలోచించలేదా అనే అనుమానం కలుగుతుంది. కేవలం ఆ పాటను మ్యాచ్ చేయడం కోసమే ఏదో బలవంతంగా ఇరికించారు కానీ దాని వల్ల లీడ్ పెయిర్ మధ్య ప్రేమ ఎలా పుట్టిందా అనే అనుమానం వస్తే మాత్రం సమాధానం దొరకదు. ఇది త్రివిక్రమ్ కు తెలుసు కాబట్టి ప్రధాన పాత్రలు వచ్చే సన్నివేశాలకు ఎక్కువ గ్యాప్ రాకుండా టెంపో మెయింటన్ చేస్తూ వెళ్ళాడు. కాస్త అసహనం కలిగినట్టు అనిపిస్తే వెంటనే మనల్ని అరెస్ట్ చేసే సన్నివేశం ముందు ఫీల్ అయిన బోర్ ని పూర్తిగా చెరిపేస్తుంది. కొంత ల్యాగ్ అనిపించిన చోట మరొక పేలిపోయే ట్రాక్ ని తీసుకొచ్చి ఇది త్రివిక్రమ్ స్టైల్ అని మనసులోనే మెచ్చుకుని పాతవి మర్చిపోయేలా చేస్తాడు. ఇదంతా త్రివిక్రమ్ చేసే స్క్రీన్ ప్లే మేజిక్.
బిడ్డలు మారిపోయి వేర్వేరు ఇళ్లలో వాళ్ళు పెరిగి పెద్దవడం అనేది ఎప్పుడో ఎన్టీఆర్ సినిమాలతో మొదలుకుని యండమూరి అగ్నిప్రవేశం నవల దాకా చాలా సార్లు వర్క్ అవుట్ అయిన ఫార్ములా. అయినా కూడా ధైర్యంగా దీన్ని త్రివిక్రమ్ ఎంచుకోవడానికి కారణం అతనే ఇంటర్వ్యూలో చెప్పినట్టు దానం, శౌర్యం కలగలసిన కర్ణుడి పాత్ర. బంటుతో మనల్ని జర్నీ చేయిస్తునే కథ ఎలా ముగుస్తుందనే కంక్లూజన్ కు ప్రేక్షకుడు రాకుండా ఏం జరుగుతుందా అనే ఉత్సుకత రేపడంలో త్రివిక్రమ్ లోని రైటర్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ముగింపు ఫైట్ ని రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా శ్రీకాకుళం స్లాంగ్ లో ఓ పాటను వాడుకుని దానికి అనుగుణంగా ఫైట్ ని కంపోజ్ చేయించడం నిజంగా బ్రిలియంట్. అలాగే ఆఫీస్ కు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చిన విలన్ కి బ్లాక్ బస్టర్ సాంగ్స్ కి డాన్స్ చేయిస్తూ హీరో సమాధానం చెప్పడం లాంటి ఆలోచనలు అందరికి రావు. అజ్ఞాతవాసి రేపిన గాయం త్రివిక్రమ్ లో ఎంతకసి రేపిందో ప్రతి ఫ్రేమ్ లో గమనించవచ్చు.
సినిమాటిక్ గా కాకుండా అందరూ కన్విన్స్ అయ్యేలా క్లైమాక్స్ ని డిజైన్ చేయడంలో తాను ఎంత స్పెషలిస్టో మరోసారి ఇందులో రుజువు చేశాడు త్రివిక్రమ్. కథ ఎప్పటిదైనా ఎలాంటిదైనా వచ్చిన ప్రేక్షకుడి టికెట్ న్యాయం జరిగిందా లేదా అనేదే ముఖ్యం. దానికి సమాధానం ఖచ్చితంగా అవును అని చెప్పొచ్చు. దర్శకుడితో పాటు సంభాషణల రచయిత కూడా ఇందులో ఒళ్ళు విరిచి పని చేశాడు. తన ట్రేడ్ మార్క్ ఫిలాసిఫికల్ పంచులుతో పాటు టైమింగ్ తో కూడిన కరెంట్ టాపిక్స్ ని వాడుకున్న తీరు చప్పట్లు కొట్టిస్తుంది. ఎక్కువ మాటలు వాడకుండా గట్టిగా కొట్టే మాటలు ఎలా రాయాలో వర్తమాన రచయితలకు త్రివిక్రమ్ క్లాసులు తీసుకుంటే బెటర్. అలా అని అల వైకుంఠపురములో ఇంతకు ముందెన్నడూ కనని వినని కథ కాదు. చూసిందే విన్నదే. కాకపోతే ఎప్పటికప్పుడు తనలో నవ్యతను బయటపెట్టుకునే ప్రయత్నం చేసే దర్శకుడి నిజాయితీ స్వచ్ఛమైంది.
టెక్నికల్ టీమ్ మాటేమిటి
ఆ మధ్య రిపీట్ మ్యూజిక్ తో విమర్శలు ఎదురుకున్న తమన్ గత ఏడాది నుంచి ఎంత భీభత్సమైన ఫామ్ లో ఉన్నాడో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే దీని ఆల్బమ్ టాప్ పొజిషన్ లో ఉంటూ రికార్డులు దులిపేసింది. స్క్రీన్ మీద కూడా ఇవి అంతే అందంగా వచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తమన్ కథలోని ఆత్మను ఒడిసిపట్టుకుని దానికి తగ్గ సంగీతాన్ని ఇచ్చాడు. మూడ్ ఎక్కడా డైవర్ట్ కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ కు కూడా ఒక రకమైన రిథమ్ తో కూడిన సంగీతం ఇవ్వడంతో మరోసారి శభాష్ అనిపించుకుంటాడు.
పిఎస్ వినోద్ ఛాయాగ్రహణం త్రివిక్రమ్ ఆలోచనలను తెరపై చక్కగా ఆవిష్కరించింది. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. లెన్త్ పెంచిన సీన్లు ఉన్న మాట నిజమే అయినా ఖచ్చితంగా ఇవి తీసేయల్సింది అనిపించే సన్నివేశాలు ఎక్కువ లేకపోవడం ఇతని పనితనమే. రామ్ లక్ష్మణ్ పోరాటాలు మరో ప్రత్యేక ఆకర్షణ, పోర్ట్ యాక్షన్ ఎపిసోడ్, పార్క్ లో ఫైట్, క్లైమాక్స్ లో ఫైట్ దేనికవే హై లైట్ గా నిలిచాయి. గీతా ఆర్ట్స్ – హారికా హాసిని ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్ లో ఉన్నాయి
ప్లస్ గా నిలిచేవి
అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో
డైలాగ్స్
తమన్ మ్యుజిక్
యాక్షన్ ఎపిసోడ్స్
సెకండ్ హాఫ్
మైనస్ గా అనిపించేవిగతంలో చూసినట్టు అనిపించే పాత్రలు, సీన్లు
అక్కడక్కడా స్లో కావడం
సునీల్, టబు, సుశాంత్, రాజేంద్రప్రసాద్ లను వాడుకోకపోవడం
చివరి మాట
ప్రతి మనిషికి ఇష్టమైన తిండి, ప్రదేశం ఉంటాయి. ఉదాహరణకు బిర్యానీ తినడం గోవా వెళ్లడం అనుకుందాం. అలా అని రోజు బిర్యానీ తినలేం, నెలకోసారి గోవా వెళ్ళిరాలేం. అందుకే అకేషనల్ గా ఎన్నిసార్లు తిన్నా వీలుదొరికినప్పుడు ఎన్ని సార్లు వెళ్లినా ఇవి బోర్ కొట్టవు. మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తాయి. ఇలాంటి త్రివిక్రమ్ సినిమాలు కూడా అంతే. ఇవే పాత్రలు ఎమోషన్లు సీన్లు గతంలో చూసినట్టు అనిపించినా ఫ్రెష్ గా అనిపించేలా స్క్రీన్ ప్లే తో మేజిక్ చేయడంలో త్రివిక్రమ్ మాస్టర్. అల వైకుంఠపురములో ఇదే జరిగింది. మాటలతో కనికట్టు చేసి దర్శకత్వంతో ఫ్యామిలీ ప్రేక్షకుల పర్సుల పనిపట్టే ఈ మాంత్రికుడు సంక్రాంతి పండక్కు సరైన సినిమాతోనే వచ్చాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే
అల వైకుంఠపురములో – త్రివిక్రముడి మాయాజాలంలో