iDreamPost

గన్నవరం విమానాశ్రయంలో లోపాలున్నాయా..? విమాన ప్రమాదంతో సందేహలు..!

గన్నవరం విమానాశ్రయంలో లోపాలున్నాయా..? విమాన ప్రమాదంతో సందేహలు..!

విజయవాడ సమీపంలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో లోపాలున్నాయా..? అనే సందేహాలు తాజాగా జరిగిన ప్రమాదంతో తలెత్తుతున్నాయి. ఖతార్‌ రాజధాని దోహా నుంచి విజయవాడ మీదుగా తిరుచిరాపల్లికి వెళ్లేందుకు ఎయిరిండియాకు చెందిన బోయింగ్‌ ఎక్స్‌ప్రెస్‌ – 737 గన్నవరంలో ల్యాండ్‌ అయింది. ఇందులో విజయవాడకు చెందిన ప్రయాణికులు 14 మంది, తిరుచిరాపల్లికి చెందిన వారు 45 మంది ఉన్నారు. పైలెట్, సిబ్బంది కాకుండానే మొత్తం 64 మంది ప్రయాణికులు ఈ విమానంలో ప్రయాణించారు.

రన్‌వేపై దిగిన బోయింగ్‌ ఎక్స్‌ప్రెస్‌ – 737 విమానం.. అక్కడ నుంచి ఆఫ్రాన్‌లోని పార్కింగ్‌ బేలోకి వెళుతున్న సమయంలో విమానం కుడి రెక్క హైమాస్ట్‌ లైట్ల స్తంభాన్ని ఢీ కొట్టింది. స్తంభం పడిపోయింది. విమనాం కుడి రెక్క దెబ్బతిన్నది. సాయంత్రం 4:49 గంటలకు విమానం రన్‌వే పై ల్యాండ్‌ అయింది. ఆ సమయంలో ఆకాశం మబ్బులుపట్టి ఉండడం వల్ల రన్‌వేపై, ఆఫ్రాన్లపై విజిబిలిటి అస్పష్టంగా ఉందని పైలెట్‌ చెబుతున్నారు. పైలెట్‌ తప్పిదం కారణమని ఎయిర్‌పోర్టు అధారిటీ అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు.

ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ప్రమాదంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. విమానం రన్‌వేపైనే ఉంది. రన్‌వే నుంచి పక్కకు వెళ్లలేదు. గన్నవరం విమానాశ్రయం రన్‌వే పొడవు 2.408 మీటర్లు, వెడల్పు 46 మీటర్లు. ప్రమాదానికి గురైన బోయింగ్‌ ఎక్స్‌ప్రెస్‌ – 737 విమానం పొడవు 41.01 మీటర్లు కాగా, రెక్కలతో సహా వెడల్పు 35.8 మీటర్లు. రన్‌వే వెడల్పు 46 మీటర్లు అయితే విమానం వెడల్పు 35.8 మీటర్లు.. అంటే ఇంకా 10.2 మీటర్ల రన్‌వే మిగిలి ఉంటుంది. అలాంటిది హైమాస్ట్‌ లైట్ల స్తంభాన్ని విమానం ఎలా ఢీ కొడుతుందనేదే ప్రధాన సందేహం. హైమాస్ట్‌ లైట్ల స్తంభం రన్‌వే పక్కనే అతి సమీపంలో ఏర్పాటు చేశారని ఈ ఘటనతో స్పష్టంగా తెలుస్తోంది.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన అంతా విజయవాడ నుంచే జరుగుతోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి సహా ఇతర రాజకీయ ప్రముఖులు విజయవాడ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయంలో రద్దీ కూడా పెరిగిపోయింది. ఇంత ప్రాధాన్యత ఉన్న గన్నవరం విమానాశ్రయంలో తాజాగా జరిగిన ప్రమాదంపై ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రమాదం జరగడానికి గల కారణాలు, విమానాశ్రయం రన్‌వే, ఆఫ్రాన్లలో ఏమైనా లోపాలు ఉన్నాయా..? ఇతర భద్రతాపరమైన అంశాలపై సునిశితమైన పరిశీలన చేపట్టి, వాటిని సరిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి