Krishna Kowshik
Krishna Kowshik
సడెన్‌గా ఒంట్లో నలతగా ఉన్నా, ఫీవరీష్‌గా అనిపించినా టక్కున పారాసెటమాల్ ట్యాబెట్ తీసుకుని లటుక్కున మింగేస్తున్నారు. ఇక పిల్లలకు సైతం జ్వరం వస్తే డోస్ గురించి తెలుసుకోకుండా.. ఆ ట్యాబెట్లను వినియోగించేస్తున్నారు. జ్వరం ఒక్కటే కాదూ.. జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు వెంటాడుతున్న మరో ఆప్షన్ లేకుండా బఠాణీలు మింగినట్లు పారాసెటమాల్ ట్యాబెట్లను వినియోగిస్తున్నారు. కరోనా తర్వాత ఈ ట్యాబెట్ల వాడకం ఎక్కువయ్యిందని చెప్పొచ్చు. జ్వరం తగ్గకపోయినా.. తిరిగి అదే వాడుతున్నారు తప్ప.. వైద్యుడి వద్దకు వెళ్లడం లేదు. ప్రతి ఇంట్లో ఏమున్నా లేకపోయినా.. పారాసెటమాల్ ట్యాబెట్ షీటు మాత్రం కచ్చితంగా ఒకటి ఉంటుంది. గతం కంటే.. ఇప్పుడు దీని వాడకం విపరీతంగా పెరిగిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
పారాసెటమాల్ ట్యాబెట్లను ఎక్కువ వినియోగించరాదని చెబుతున్నారు వైద్యులు. ఒకసారి జ్వరం వచ్చాక ఈ ట్యాబెట్లు వినియోగించాక.. అప్పటికీ ఫీవర్ తగ్గకపోతే.. వైద్యుల్ని సంప్రదించాలి తప్ప.. అదే మెడిసన్ రిపీట్‌గా వేసుకోకూడదని చెబుతున్నారు. పెద్దలైతే 650 మిల్లీ గ్రాములు, పన్నెండు సంవత్సరాల లోపు వయస్సు పిల్లలైతే 15 మిల్లీ గ్రాముల మోతాదులో మాత్రమే పారాసెటమాల్ ట్యాబెట్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. జ్వరం వచ్చాక.. ట్యాబెట్లు తీసుకున్నాక.. మరో ట్యాబెట్ తీసుకునేందుకు నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య వ్యవధిలో మెడిసన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. మెడిసన్ వాడకంలో జాగ్రత్తలు తీసుకోకుంటే మరిన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని వెల్లడించారు.
ఒంట్లో కొంచెం నలతగా ఉన్నా, శరీరం వెచ్చదనంగా అనిపించినా డోలో, క్రోసిన్, పారాసెటమాల్ ట్యాబెట్లను వినియోగించడం వల్ల అనర్థాలు వస్తాయి. కళ్లు తిరగడం, విరోచనాలు, వాంతులు, చర్మ సంబంధిత సమస్యలు, అలర్జీ, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, చెమటలు పట్టడం జరుగుతుంటాయని చెబుతున్నారు. వీటిని అత్యధిక మోతాదులో తీసుకోరాదని, వీటిల్లో స్టెరాయిడ్స్ ఉంటాయని పేర్కొన్నారు. వీటిని ఎక్కువ తీసుకుంటే మూత్ర పిండాలు, కాలేయం వంటి అవయవాలు దెబ్బతినే అవకాశాలున్నాయని వెల్లడిస్తున్నారు. అందుకే వైద్యుల సలహా మేరకు వీటిని వినియోగించాలని చెబుతున్నారు నిపుణులు.