iDreamPost

రోల్ మోడల్స్ రాముడు భీముడు – Nostalgia

రోల్ మోడల్స్ రాముడు భీముడు – Nostalgia

మనకు డ్యూయల్ రోల్ సినిమాల్లో బెస్ట్ గుర్తుకు తెచ్చుకోమంటే  వెంటనే రౌడీ అల్లుడు, హలో బ్రదర్, అదుర్స్ లాంటి రెండు మూడు పేర్లు వెంటనే ఫ్లాష్ అవుతాయి. వీటన్నిటిలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. హీరో వేసిన రెండు పాత్రల్లో ఒకటి సాఫ్ట్ గా ఉంటూ క్లాస్ ని టార్గెట్ చేస్తే రెండోది మసాలా టైపు లో మాస్ ని మెప్పించేలా ఉంటుంది. ఇలా ఎన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చాయో లెక్కచెప్పడం కష్టం. కానీ వీటికి గాడ్ ఫాదర్ లాంటి చిత్రం మాత్రం ఖచ్చితంగా రాముడు భీముడే. స్వర్గీయ నందమూరి తారకరామారావు నటించిన ఈ మూవీ ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపించడానికి గల కారణం, దీని వెనుక ఉన్న విశేషాలు ఏంటో చూద్దాం.

1963లో నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేసిన రామానాయుడు గారికి మొదటి సినిమా ‘అనురాగం’ చేదు ఫలితాన్ని ఇచ్చింది. పేరు వచ్చింది కానీ సొమ్ములు మాత్రం సున్నా. అయినా పట్టువదలకుండా ఈసారి ఏకంగా ఎన్టీఆర్ తో తీసి చావో రేవో తేల్చుకుని భవిష్యత్తు నిర్ణయించుకోవాలని తనకున్నదంతా పోగేసి పెట్టుబడికి వనరులు సమకూర్చుకుని రంగంలో దిగారు. సురేష్ సంస్థకు ఓ రూపం, ఇద్దరు పిల్లలతో ఒక లోగో చేయించింది ఈ చిత్రంతోనే. రచయిత డివి నరసరాజు ఇచ్చిన కథకు చాణక్యను దర్శకుడిగా ఎంచుకున్నారు. ఆయనప్పుడు ఫ్లాపుల్లో ఉన్నారు. కానీ నాయుడుగారికి గురి కుదిరితే అవేవి లెక్క చేయకపోవడం అప్పటి నుంచే ఉంది.

అందరూ వెళ్లి ఎన్టీఆర్ ని కలిశారు. సాంఘిక చిత్రంలో ద్విపాత్రాభినయం చేయడం ఇష్టం లేని నందమూరి దిగ్గజం కథ ఆసాంతం విని క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే కాల్ షీట్లు ఇచ్చారు. జమున, ఎల్ విజయలక్ష్మిని హీరోయిన్లుగా ఎంచుకున్నారు. పెండ్యాల సంగీత బాధ్యతలు తీసుకుని 8 పాటలు ఇచ్చారు. 1964 మే 21న రిలీజైన రాముడు భీముడు చూసి ప్రేక్షకులు పులకరించిపోయారు. అక్కడికి రెండేళ్ల క్రితం 1961లో ఏఎన్ఆర్ ద్విపాత్రల్లో ఇద్దరు మిత్రులతో మెప్పించినప్పటికీ దానిలో లేని మేజిక్ ఏదో ఇందులో కనిపించి జనం బ్రహ్మరథం పట్టారు. ఆడియో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. మొదట్లో చెప్పిన ఎన్నో ఉదాహరణలకు రాముడు భీముడు ఒక రోల్ మోడల్ గా నిలిచింది. రామానాయుడు గారికి ప్రొడ్యూసర్ గా ఒక సింహాసనాన్ని సృష్టించి ఇచ్చింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి