iDreamPost

ది వారియర్ – తెలిసిన వ్యవహారమేగా

ది వారియర్ – తెలిసిన వ్యవహారమేగా

నిన్న అనంతపూర్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా ది వారియర్ ట్రైలర్ లాంచ్ ని గ్రాండ్ గా చేశారు. ప్రత్యేక అతిధులు ఎవరూ లేకపోయినా టీమ్ తో పాటు బోయపాటి శీను ఇందులో పాల్గొన్నారు. రెడ్ తర్వాత రామ్ కు చెప్పుకోదగ్గ గ్యాప్ వచ్చేసింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో తనకొచ్చిన స్పెషల్ ఇమేజ్ ని నిలబెట్టుకునేందుకు ఎక్కువగా మాస్ సబ్జెక్టుల వైపు మొగ్గు చూపుతున్న రామ్ దానికి తగ్గట్టే వారియర్ ని ఎంచుకున్నాడు. లింగుస్వామి దీనికి దర్శకుడు. విశాల్ కు తెలుగులోనూ మార్కెట్ వచ్చేలా చేసిన పందెం కోడి డైరెక్టర్ గా ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. కాకపోతే ఆవారా మినహాయించి తర్వాత పెద్దగా సక్సెస్ లేకుండా పోయింది.

ఇక వారియర్ విషయానికి వస్తే మొత్తం కర్నూలు బ్యాక్ డ్రాప్ లో స్టోరీ నడిపించారు. ఎప్పటి నుంచో అక్కడ పాతుకుపోయిన ఒక విలన్. వాడిని ఎదిరించేందుకు వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్. ఇద్దరి మధ్య నువ్వా నేనా అంటూ సాగే యాక్షన్ డ్రామా. ఇందులో ఇంతకు మించి కొత్తగా అనిపించిందేమి లేదు. బాలకృష్ణ రౌడీ ఇన్స్ పెక్టర్ నుంచి రవితేజ క్రాక్ దాకా ఎన్నోసార్లు చూసిన వాడిన టెంప్లేట్ ని ఫార్ములానే వారియర్ లో కూడా రిపీట్ చేశారు. కొన్ని ఫ్రేమ్స్ లో రామ్ డాక్టర్ గా కనిపించాడు. ఆ యాంగిల్ లో చూస్తే ఏమైనా డ్యూయల్ రోల్ చేయించారా లేక దీనికి తాలూకు ట్విస్ట్ ఏదైనా క్రియేటివ్ గా ఉంటుందేమో చూడాలి. దీని సక్సెస్ లో అదే కీలకం కావొచ్చు.

సరైనోడు తర్వాత ఆది పినిశెట్టి మరోసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ క్యారెక్టర్ దక్కించుకున్నాడు. గెటప్ బాగుంది. రామ్ డిఫరెంట్ మీసకట్టుతో మాస్ కి కనెక్ట్ అయ్యేలా కనిపిస్తున్నాడు. కృతి శెట్టి గ్లామర్ బోనస్ కానుంది. ఎంత రొటీన్ అనిపించినా మాస్ తో విజిల్స్ వేయించే యాక్షన్ ఎపిసోడ్లు, కాస్త కిక్ ఇచ్చే ట్విస్టులు సరిగా సెట్ చేసుకుంటే వారియర్ కు వచ్చిన ఢోకా ఏమి లేదు. పైగా మాస్ ఎంటర్ టైనర్ కు టాలీవుడ్ లో గ్యాప్ వచ్చేసింది. బాక్సాఫీస్ డల్ గా ఉన్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని రామ్ ఎంతవరకు వాడుకుంటాడో ఈ సినిమా విడుదల కాబోతున్న జూలై 14న తేలిపోనుంది. బిజినెస్ మాత్రం క్రేజీగా జరుగుతోందని ట్రేడ్ నుంచి వస్తున్న టాక్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి