iDreamPost

Raja Vikramarka Review : రాజా విక్రమార్క రివ్యూ

Raja Vikramarka Review : రాజా విక్రమార్క రివ్యూ

స్టార్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా చేసిన రెండో సినిమానే ఆరెక్స్ 100 రూపంలో సెన్సేషనల్ హిట్ అందుకున్న హీరో కార్తికేయకు తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం దక్కలేదు. ఆ చిత్రం తెచ్చుకున్న కల్ట్ స్టేటస్ తో ఇప్పటికీ అవకాశాలు రాబట్టుకుంటూనే ఉన్న ఇతనికి సబ్జెక్టులు డిఫరెంట్ గా పడుతున్నాయి కానీ వాటికి తగ్గ ప్రెజెంటేషన్ లేక బాక్సాఫీస్ దగ్గర వరస ఫెయిల్యూర్స్ అందుకుంటున్నాడు. ఆ మధ్య వచ్చిన చావు కబురు చల్లగా అయితే మరీ దారుణం. అజిత్ మూవీలో విలన్ గా ఛాన్స్ కొట్టేసిన కార్తికేయ పూర్తిగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోకి మారిపోయి చేసిన మొదటి సినిమా రాజా విక్రమార్క ఇవాళ రిలీజయ్యింది. ఎలా ఉందో రివ్యూలో లుక్కేద్దాం

కథ

ఎన్ఐఏలో ఆఫీసర్ గా పని చేసే విక్రమ్(కార్తికేయ)కు దూకుడెక్కువ. హోమ్ మినిస్టర్ చక్రవర్తి(సాయికుమార్)కి గతంలో పగ పెంచుకున్న నక్సలైట్ గురు నారాయణ(పశుపతి)తో ప్రాణాపాయం ఉందని తెలుసుకుని రహస్యంగా రక్షణ కల్పించే పనిలో ఉంటాడు. మంత్రి కూతురు కాంతి(తాన్యా రవిచంద్రన్)ని పనిలో పనిగా ప్రేమిస్తాడు. ఈలోగా అనుకోకుండా ఆ అమ్మాయి కిడ్నాప్ కు గురవుతుంది. గురు పట్టుబడతాడు. ప్రియురాలిని కాపాడటంతో పాటు ఆ నక్సలైట్ల బృందం ఎలాంటి ప్రమాదం తలపెట్టకుండా చూసే బాధ్యత విక్రమ్ మీద పడుతుంది. మరి ఈ మిషన్ లో అతను ఎలా గెలిచాడు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి

నటీనటులు

కార్తికేయకు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. తొలి రోజులతో పోలిస్తే యాక్టింగ్ సెన్స్ కూడా బాగా పెరిగింది. అలా అని బెస్ట్ అనే అవార్డు ఇప్పటికిప్పుడు ఇవ్వలేం కానీ చేయాల్సిన హోమ్ వర్క్ అయితే ఇంకా ఉందన్న మాట వాస్తవం. ఎన్ఐఏ ఆఫీసర్ గా ఇందులో చక్కగా ఒదిగిపోయాడు. వలిమై కోసం చేసిన వర్కౌట్లో ఏమో కానీ ఈ పాత్ర కోసం కావాల్సిన ఫిజిక్ చక్కగా కుదిరింది. ఒకరకంగా చెప్పాలంటే ఇందులో ఉన్న పాజిటివ్ అంశాల్లో తనే ఫస్ట్. హీరోయిన్ తాన్యా రవిచంద్రన్ కు స్కోప్ ఉన్నట్టే అనిపిస్తుంది కానీ ఫైనల్ గా జస్ట్ ఓకే ఓకే పెర్ఫార్మన్స్ తో అలా నెట్టుకొచ్చేసింది. లుక్స్ బాగున్నాయి అంతే.

తనికెళ్ళ భరణి సీనియారిటీ యథావిధిగా ఉపయోగపడింది. క్రాక్ లో గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ కొమాకులకు మరో మంచి క్యారెక్టర్ పడింది. లెన్త్ ఎక్కువే దొరికింది కానీ ఇది తనకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చెప్పలేం. సాయి కుమార్ కు హోమ్ మినిస్టర్ లాంటి పాత్రలు కొట్టిన పిండి. అలవోకగా చేసుకుంటూ పోయారు. హర్షవర్ధన్ పర్వాలేదు. పశుపతిని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయారు. హడావిడిగా ముగించేశారు. అయినా కూడా తన ఉనికిని గట్టిగానే చాటుకున్నారు. మిగిలిన పాత్రలు సోసోనే. ఆర్టిస్టులు చాలానే ఉన్నారు కానీ మరీ ప్రత్యేకంగా గుర్తు పెట్టుకునేంత ఎవరూ ప్రభావం చూపించలేకపోయారు

డైరెక్టర్ అండ్ టీమ్

ఇన్వెస్టిగేటివ్ థ్రిలర్స్ కి బేసిక్ గా కావాల్సింది సరైన టెంపో, లాజిక్స్ తో కూడిన స్క్రీన్ ప్లే. ఈ రెండు సరిగ్గా కుదిరితే ప్రేక్షకులను థ్రిల్ చేసి హిట్ అందుకోవచ్చు. బాలీవుడ్లో ఈ సూత్రాన్ని సరిగ్గా పాటిస్తారు కాబట్టే ఈ జానర్ లో ఎక్కువ సినిమాలు వస్తుంటాయి. స్పెషల్ ఓపిఎస్ లాంటి వెబ్ సిరీస్ లోనూ దర్శకులు ప్రతి డీటెయిల్ మీద చాలా హోమ్ వర్క్ చేయడం కనిపిస్తుంది. అందుకే అవి ఆ స్థాయిలో విజయాన్ని దక్కించుకున్నాయి. కానీ మన వాళ్లకు అంత ఓపిక ఉండదనిపిస్తుంది. ఒక పాయింట్ ఎగ్జైటింగ్ అనిపించగానే దానికి పైపై కోటింగ్ ఇచ్చేసి తీసేస్తారు. నాగార్జున వైల్డ్ డాగ్ కూడా ఈ కారణంగానే అంచనాలను అందుకోలేకపోయింది.

ఈ రాజా విక్రమార్క దర్శకుడు శ్రీ సరిపల్లి కూడా అంతకు మించిన పొరపాటే చేశాడు. గూఢచారి, గరుడవేగలు ఎందుకు సక్సెస్ అయ్యాయో నిశితంగా విశ్లేషించుకుని ఉంటే బాగుండేది. పైకి పేపర్ మీద ప్రాపర్ గా అనిపించే రాజా విక్రమార్క స్టోరీ ట్రీట్మెంట్ కు వచ్చేటప్పటికి చేతులు ఎత్తేసింది. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అవసరానికి మించిన నిడివిని పెట్టిన శ్రీ ఇంటర్వల్ బ్యాంగ్ దాకా అసలు కథలోకి ఎంటర్ కాకపోవడం పెద్ద మైనస్. పోనీ అప్పటిదాకా సాగదీసిన హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ అయినా ఎంగేజింగ్ గా ఉందా అదీ లేదు. పైగా పాటలు వచ్చి లేనిపోని ఇబ్బందిని మరింత పెంచుతాయి.

నిజానికి ఎన్ఐఎ ఆఫీసర్లలంటే మన రచయితలకు మరీ సిల్లీగా కనిపిస్తారేమో. పాత్ర స్వభావాలు, వాళ్ళ హైడ్ అవుట్స్, వృత్తిపరమైన ప్రవర్త ఇవేవి కనీస స్థాయిలో ఉండవు. సగటు కమర్షియల్ సినిమాల్లో పాత్రల మాదిరే ఉంటారు. అందుకే వాళ్ళ తాలూకు ఎమోషన్లు సీరియస్ నెస్ మనకు కనెక్ట్ కావు. కొన్నిసార్లు హీరో సాగించే ప్రేమాయణం మరీ పాత చింతకాయ పచ్చడిలా అనిపించడానికి కారణం ఇదే. పోనీ సెకండ్ హాఫ్ లో అయినా ట్రాక్ మీదకు వస్తుందని ఆశించిన ప్రేక్షకులకు చివరి గంట కథనం అసలు ఎటు పరిగెడుతుందో ఎవరెవరు ఏం చేస్తున్నారో అర్థం చేసుకునేలోపే శుభం కార్డు పడిపోతుంది, నిట్టూరుస్తూ బయటికి రావడం తప్ప ఏం చేయలేం

ఒకరకంగా చెప్పాలంటే ఇది విలన్ వైపు రాసుకున్న రివెంజ్ డ్రామా. తనను గాయపరిచిన వాడిని పదిహేనేళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకునేందుకు స్కెచ్చులు వేస్తాడు. మధ్యలో హీరో వస్తాడు. ఇది డైరెక్ట్ గా చూపిస్తే రెండున్నర గంటలు ఓవర్ లెన్త్ కాబట్టి అవసరం లేని హంగులన్నీ ఎక్కువయ్యాయి. టైటిల్ ని బట్టి మనమేదో టెర్రరిస్ట్ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ డ్రామాని ఎక్స్ పెక్ట్ చేస్తే ఎప్పుడో జనం మర్చిపోయిన నక్సలైట్ల కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఖంగాళీ చేశారు. స్టార్ హీరో ఉంటే ఇవన్నీ కొంతమేర చెల్లుతాయి కానీ కార్తికేయ లాంటి అప్ కమింగ్ హీరోతో ప్రయోగాలు చేస్తే కుదరదు. ప్రేక్షకులు ప్రతిదీ నిశితంగా గమనిస్తారు. దర్శకులు దొరికిపోతారు

శ్రీ సరిపల్లి మంచి అవకాశాన్ని వాడుకోలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ డీల్ చేయడంలో తన పనితనాన్ని చూపించినా దానికి తగ్గ ముందు వెనుకా డ్రామాను సెట్ చేసుకోవడంలో మాత్రం తడబడ్డారు. సాయికుమార్, భరణి, పశుపతి లాంటి సీనియర్లలో ఒక్కరు కూడా ప్రభావం చూపించలేకపోయారంటే అది అతని తప్పిదమే. సెకెండ్ హాఫ్ లో ఇష్టం వచ్చినట్టు ట్విస్టులు పెట్టడం ఓ వర్గానికి ఏమైనా నచ్చుతుందేమో కానీ అప్పటికే డిస్ కనెక్ట్ అయిన కామన్ ఆడియన్స్ మాత్రం అయోమయానికి గురవుతారు. లాజిక్స్ ని మన సౌకర్యం కోసం కొంత మేరకు వదిలేస్తే బాగానే ఉంటుంది కానీ అసలవి లేనట్టు ప్రవర్తిస్తే మాత్రం ఫలితం ఇలాగే ఉంటుంది

ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో అక్కడక్కడా మెరిపించింది. ఒక పాట పర్వాలేదు అనిపిస్తే హీరోయిన్ డాన్స్ సాంగ్ కంపోజింగ్ కూడా తీసికట్టుగా ఉంది. పిసి మౌళి ఛాయాగ్రహణం బెస్ట్ క్వాలిటీని తెరమీద చూపించేందుకు కష్టపడింది. చాలా లోపాలను కవర్ చేసింది కూడా. జెస్విన్ ప్రభు ఎడిటింగ్ బాగా మొహమాటపడి కత్తెరను పక్కన పెట్టేయడం ల్యాగ్ కు మరో కారణం. సుబ్బు నభ – పృథ్వి శేఖర్ పోరాటాలు పర్వాలేదు. నిర్మాత రామారెడ్డికి బడ్జెట్ పరంగా మరీ భారం పడలేదు. చాలా తెలివిగా ఎక్కువ శాతం హైదరాబాద్ లొకేషన్లు, ఒక అడవితో చుట్టేశారు కాబట్టి ఖర్చు కంట్రోల్ తప్పలేదు

ప్లస్ గా అనిపించేవి

కార్తికేయ
కెమెరా వర్క్
ఓ రెండు ట్విస్టులు

మైనస్ గా తోచేవి

ఫస్ట్ హాఫ్
హీరో హీరోయిన్ లవ్ ట్రాక్
లాజిక్స్ కి సెలవు
కథనం

కంక్లూజన్

ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన చిరంజీవి రాజా విక్రమార్క సినిమా ఇప్పుడు ఎలా అనిపించినా అప్పట్లో మాత్రం ఫ్లాపే. ఇప్పుడీ రాజా విక్రమార్క కూడా పేరునే కాదు ఫలితాన్ని కూడా అదే విధంగా అందుకునేలా ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. ట్రైలర్ కనిపించినంత ప్రామిసింగ్ గా ఈ మధ్య కాలంలో సినిమాలు ఉండటం లేదు. దురదృష్ట వశాత్తు ఇది కూడా అదే కోవలోకి చేరింది. థీమ్ బాగానే ఉన్నా దాన్ని మెప్పించేలా తీయడానికి కావాల్సిన మెటీరియల్ సరిగా లేకపోవడంతో ఫైనల్ గా అసంతృప్తినే మిగిలిస్తాడు. మాములుగా చందమామ కథల్లో భేతాళుడు చెట్టెక్కుతాడు. కానీ వెరైటీగా ఈ సినిమాలో విక్రమార్కుడు చేతులెత్తేశాడు అదే చెట్టెక్కేశాడు

ఒక్కమాటలో – విషయం తగ్గిన విక్రమార్క

Also Read : Peddhanna Review : పెద్దన్న రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి