iDreamPost

నరేంద్ర మోదీకి థ్యాంక్స్‌ చెప్పిన రాహుల్‌ గాంధీ

నరేంద్ర మోదీకి థ్యాంక్స్‌ చెప్పిన రాహుల్‌ గాంధీ

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా)కి అదనంగా 40 వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ హాయంలో ప్రారంభించిన నరేగా పథకం విశిష్టతను గుర్తించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌తో పట్టణాలు, నగరాల నుంచి వలస కూలీలు, కార్మికులు తమ స్వగ్రామాల బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారందరికీ ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో 40 వేల కోట్ల రూపాయలు నరేగాకు కేటాయించారు.

ప్రస్తుతం ఏడాదికి నరేగా పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. ఈ నిధులకు అదనంగా తాజాగా కేటాయించిన 40 వేల కోట్ల రూపాయలతో కలుపుకుని ఈ మొత్తం 61 వేల కోట్ల రూపాయలు కానున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో 2004లో యూపీఏ ప్రభుత్వం మొదటి సారి ఏర్పడగా 2006లో నరేగా పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో కనీసం 100 రోజులు పని కల్పించాలనే నిబంధన ఉండేది. అయితే కాల క్రమంలో ఈ రోజులు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 200 రోజులకు చేరాయి. ఈ పథకం కింద ప్రతి రోజూ వారి గ్రామంలోనే పని కల్పిస్తారు. ప్రస్తుతం సరాసరి ఒక్కొక్కరికి రోజుకు కనీసం 200 రూపాయల కూలి గిట్టుతోంది. వారం రోజులకు ఒకసారి నగదును కూలీల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి