iDreamPost
android-app
ios-app

రచిన్ రవీంద్రకు అనంతపురంతో ఉన్న సంబంధం ఏంటి?

  • Author Soma Sekhar Published - 09:45 AM, Fri - 6 October 23
  • Author Soma Sekhar Published - 09:45 AM, Fri - 6 October 23
రచిన్ రవీంద్రకు అనంతపురంతో ఉన్న సంబంధం ఏంటి?

రచిన్ రవీంద్ర.. ఒకే ఒక మ్యాచ్ తో వరల్డ్ క్రికెట్ చూపును తనవైపునకు తిప్పుకున్నాడు. తన తొలి వన్డే ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లోనే సెంచరీతో దుమ్మురేపాడు ఈ యువ స్పిన్నర్. బ్యాటింగ్ ఆర్డర్ లో అనూహ్యంగా ముందుకు వచ్చిన రచిన్.. అసాధారణ బ్యాటింగ్ తో చెలరేగాడు. పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్న ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ.. డేన్ కాన్వేతో కలిసి జట్టుకు రికార్డ్ విజయాన్ని అందించాడు. రచిన్ 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే అతడికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. ఈ విజయంలో డ్వేన్ కాన్వే-రచిన్ రవీంద్ర జోడీ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు ఇంగ్లాండ్ బౌర్లకు చుక్కలు చూపిస్తూ.. రెండో వికెట్ కు 273 పరుగు జోడించారు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర బ్యాటింగ్ ఈ మ్యాచ్ కు హైలెట్ అని చెప్పాలి. స్పిన్ ఆల్ రౌండర్ అయిన రచిన్ కు కేవలం 13 వన్డేలు ఆడిన అనుభవం మాత్రమే ఉంది. అలాంటి ఆటగాడు బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ అందుకోవడమే కాకుండా.. అసాధారణ రీతిలో చెలరేగాడు.

ఈ బ్యాటింగ్ ప్రదర్శనతో రచిన్ రవీంద్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారాడు. సోషల్ మీడియాలో రచిన్ రవీంద్ర ఎవరు? అని సెర్చ్ చేయడం మెుదలు పెట్టారు నెటిజన్స్. దీంతో అతడికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు భారత సంతతికి చెందిన వ్యక్తి అని, బెంగళూరు అతడి స్వస్థలం అని చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక రచిన్ తల్లిదండ్రులు 1990లోనే న్యూజిలాండ్ కు వలసవెళ్లగా.. అతడు అక్కడే పుట్టిపెరిగాడు. అయితే అతడు క్రికెట్ లో ఓనమాలు నేర్చుకుంది మాత్రం ఇండియాలోనే.

ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? అతడికి ఏపీలోని అనంతపురంతో సంబంధం ఉంది. రచిన్ ప్రతీ సంవత్సరం అనంతపురంలో ఉన్న రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్(RDT)కు వచ్చి క్రికెట్ ఆడుతుండేవాడు. అదీకాక తన తండ్రి కృష్ణమూర్తి స్థాపించిన హాట్ హాక్స్ క్లబ్ తరపున క్రికెట్ ఆడేవాడు. ఈ విధంగా రచిన్ కు అనంతపురంతో బంధం ఏర్పడింది. కాగా.. ఇప్పటి వరకు న్యూజిలాండ్ తరపున 18 టీ20లు, 13 వన్డేలు ఆడి.. 26 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో ఇప్పటి వరకు ఒకే ఒక్క అర్దశతకం నమోదు చేసిన రచిన్.. తాజాగా జరిగిన మ్యాచ్ లో సెంచరీ బాది అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.