iDreamPost

లేట్ వస్తే థియేటర్లో నో ఎంట్రీ – Nostalgia

లేట్ వస్తే థియేటర్లో నో ఎంట్రీ – Nostalgia

మాములుగా అధిక శాతం జనానికి ఉన్న అలవాటు టైం పాటించకపోవడం. ఫంక్షన్ కావొచ్చు ప్రోగ్రాం కావొచ్చు లేదా సినిమా కావొచ్చు. ఆలస్యం అనేది ఎందరికో రోజువారీ దినచర్యలో ఒక భాగం. థియేటర్ కు కూడా రకరకాల అడ్డంకుల వల్ల లేట్ గా వెళ్లే వాళ్ళను ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. అయితే ఈ కారణంగా నో ఎంట్రీ అనే హక్కు ఆ హాల్ ఓనర్ కి కూడా ఉండదు. అలా కాకుండా నిజంగానే అనుమతించకుండా వెనక్కు పంపిన సంఘటన ఊహించగలమా. కానీ ఇది నిజం. 1960లో సుప్రసిద్ధ సస్పెన్స్ కం థ్రిల్లర్ చిత్రాల పితామహుడు ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ రూపొందించిన సైకో చూసినవాళ్లు అధిక శాతం ఉంటారు. ఇదో బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్.

ఈ సినిమా ప్రారంభమైన కాసేపటికే సైకో చేతిలో హీరోయిన్ బాత్ రూమ్ లో హత్యకు గురవుతుంది. కానీ మర్డర్ ఎవరు చేశారనేది అర్థమవుతున్నా ఫ్రేమ్ కో సందేహాన్ని రేపుతూ హిచ్ కాక్ థ్రిల్స్ తో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తారు. కథ మొత్తం ఈ ఎపిసోడ్ చుట్టే తిరుగుతుంది. కీలకమైన డబ్బు దొంగతనం చేసే ఘట్టం కూడా ప్రారంభంలోనే వస్తుంది.  ఒకవేళ ఈ బిగినింగ్ మిస్ అయితే కథ ఒక పట్టాన అర్థం కాదు. అందుకే సైకో విడుదలయ్యాక హిచ్ కాక్ థియేటర్ల దగ్గర బోర్డు పెట్టేశాడు. ఆలస్యంగా వచ్చిన వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం ఉండదని. దెబ్బకు అరగంట ముందే ప్రేక్షకులు క్యూ లైన్ లో నిలబడేవారు

అంతకు ముందు ఆ తర్వాత ఇలా ఎవరూ ఆడియన్స్ ని ఇలా బెదిరించే సాహసం చేయలేకపోయారు. అయినా కూడా పబ్లిక్ నిరసన వ్యక్తం చేయకుండా హిచ్ కాక్ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సైకోని బ్రహ్మాండంగా ఆదరించి ఆల్ టైం క్లాసిక్స్ లో ఘనమైన చోటు కల్పించారు. దశాబ్దాల తరబడి కొన్ని వేల సినిమాలకు సైకో స్ఫూర్తిగా నిలిచింది. కృష్ణ అవే కళ్ళుతో మొదలుపెడితే ఛార్మీ మంత్ర దాకా అందరూ హిచ్ కాక్ ఫార్ములాను వాడి బ్లాక్ బస్టర్లు సాధించినవాళ్ళే. 1960 జూన్ 16న మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైకో లెక్కలేనన్ని సార్లు ప్రపంచంలోని అన్ని దేశాల్లో అద్భుత విజయాన్ని సాధించింది. టెక్నాలజీ లేని కాలంలో హిచ్ కాక్ రూపొందించిన ఈ మాస్టర్ పీస్ ని ఇప్పటి జెనరేషన్ చూసినా అచ్చెరువొందక మానరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి