iDreamPost

నారా లోకేష్ కాన్వాయ్ ని అడ్డుకున్న రైతులు

నారా లోకేష్ కాన్వాయ్ ని అడ్డుకున్న రైతులు

తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన నారా లోకేష్ కాన్వాయ్ ని సీతానగరం వద్ద కొందరు పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హాయంలో పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ పరిధిలోని నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని ఆ ప్రాంత రైతులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. అప్పట్లో ఈ సమస్య మీద తమకు న్యాయం చెయ్యాలని కోరుతూ నిర్వాసిత రైతులు కొన్ని రోజులపాటు ఆందోళనలు కూడా నిర్వహించారు.

పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ కోసం తమకు మంచి పరిహారం ఇస్తామని ఆశ చూపి, మభ్యపెట్టి తమదగ్గర తీసుకున్న భూములకు పరిహారం ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ సీతానగరం మండలం మరికూడలి వద్ద లోకేష్ కాన్వాయ్ ని అడ్డుకుని తమకు న్యాయం చెయ్యాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులకు, తెలుగుదేశం కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. లోకేష్ కాన్వాయిలో ఉన్న కొందరు తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డు పక్కన నిర్వాసిత రైతులు వేసుకున్న టెంట్ ని పీకేసి తమపై రాడ్లతో కర్రలతో దాడి చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే వెంటనే పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగట్టోడంతో లోకేష్ కాన్వాయ్ అక్కడనుండి వెళ్ళిపోయింది.

అయితే తాము కేవలం నిర్వాసితుల సమస్యను లోకేష్ ధృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ లోకేష్ తమని కనీసం పలకరించకుండా వెళ్లిపోయాడని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ఒక లేడి కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి