iDreamPost

చూపులేని శ్రామికురాలి గొప్ప కథ – Nostalgia

చూపులేని శ్రామికురాలి గొప్ప కథ – Nostalgia

మాములుగా మన సినిమాల్లో హీరో హీరోయిన్లు ఎవరికీ ఎలాంటి వైకల్యాలు ఉండకూడదని కోరుకుంటాము. చక్కని అందంతో పాటు ఎలాంటి అవలక్షణాలు లేకుండా కనిపించాలని ఆశిస్తాం. అలా కాకుండా ఏదైనా లోపం ఉంటే ఆ క్యారెక్టర్ ని ప్రేక్షకులు అంగీకరిస్తారా. ఎవరో ఒకరు సాహసం చేయనిదే ఇది ఎలా తెలుస్తుంది. 2001లో రామానాయుడు గారికి ఈ ఆలోచన వచ్చింది. అప్పటికి కమల్ హాసన్ అమావాస్య చంద్రుడు లాంటి అరుదైన ప్రయత్నాలు తప్ప కళ్ళు లేకుండా ప్రధాన పాత్రను నడిపించిన సినిమాలు చాలా అరుదు. వైజాగ్ లో ఉండే లక్ష్మి నారాయణమ్మ అనే ఆవిడ చూపు లేకపోయినా బ్రెయిలీ లిపిలో భగవద్గీతను రాయడం అప్పట్లో ఎందరికో స్ఫూర్తినిచ్చింది.

ఈ పాయింట్ ని ఆధారంగా చేసుకునే రచయిత శ్రీరాజ్ ప్రేమించు కథను సిద్ధం చేశారు. ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా అని నాయుడుగారు చాలా కాలం ఆలోచించారు. ఒకదశలో వద్దనుకున్నారు కూడా. అయితే మనసులో మాత్రం ఎక్కడో ఓ మూల ఇలాంటి మంచి చిత్రం మిస్ అవుతున్నానేమోనన్న భావన మనసు తొలిచేస్తూ ఉండేది. ఇక ఆలస్యం చేయకుండా స్క్రిప్ట్ రూపకల్పనలో బాగా కష్టపడ్డ దర్శకుడు బోయిన సుబ్బారావు, వేటూరి గారి అబ్బాయి రవిప్రకాష్ లను పిలిపించి ఇది చేసేద్దాం అన్నారు. సత్యానంద్ సంభాషణలు. ఎంఎం శ్రీలేఖ సంగీతం, హరి అనుమోలు ఛాయాగ్రహణం, చంటి అడ్డాల ఆర్ట్ వర్క్ తో పక్కా టెక్నికల్ టీమ్ సిద్ధమయ్యింది. లక్ష్మి, మురళీమోహన్ లతో పాటు అధికశాతం సీనియర్లను క్యాస్టింగ్ లో తీసుకున్నారు.

అంధురాలి పాత్రకు ముందు ఎవరెవరినో అనుకున్నారు కానీ ఫైనల్ గా లయ సెట్ అయ్యింది. దానికి తగ్గట్టే అద్భుతమైన నటనతో ఉత్తమ నటిగా బంగారు నంది గెలుచుకుంది. ఇదొక్కటే కాదు ఉత్తమ చిత్రం, సహాయనటుడు, హాస్యనటి, గేయ రచయిత ఇలా పలు విభాగాల్లో ప్రేమించు సత్తా చాటింది. కమర్షియల్ సక్సెస్ మీద కొంత అనుమానం వ్యక్తం చేసిన రామానాయుడు గారి లెక్కను తప్పిస్తూ ఈ సినిమా ఏకంగా శతదినోత్సవం జరుపుకుంది. లాయరైన మీనా( లయ) జీవితంలో ఎదురైన ఆటుపోట్లు, చిన్నప్పుడే దూరమైన తల్లి సెంటిమెంట్ తదితర అంశాలతో బోయిన సుబ్బారావు తీర్చిదిద్దిన తీరు ప్రేమించుకు ప్రేక్షకుల చప్పట్లను అందించింది. 2001 ఏప్రిల్ 11న విడుదలైన ప్రేమించు సినిమా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఓ గొప్ప ఆణిముత్యంగా మిగిలిపోయింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి