iDreamPost

జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు

జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు

పోలీసులతో బూట్లు నాకిస్తానంటూ రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై జేసీ దివాకర్ రెడ్డిపై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్.. టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జేసీ దివాకర్ రెడ్డిపై 153, 506 సెక్షన్ల కింద అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

బుధవారం అనంతపురంలో జరిగిన జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జేసీ.. పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారారని, వారికి వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గి తమపై ఏకపక్షంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. తాడిపత్రిలో విశ్రాంత ఇంజనీర్‌పై అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులపైనా ఇవే కేసులు పెడతామన్నారు.

ఇప్పుడున్న పోలీసు అధికారులు ఎమ్మెల్యేకు మాత్రమే సెల్యూట్‌ కొడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే బూట్లు నాకే అధికారులను తెచ్చుకుంటామంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘రేయ్‌.. నువ్వు ఉద్యోగంలో ఉండేది ఐదేళ్లు కాదు. ముప్పై ఏళ్లు. మేం అధికారంలోకి వచ్చాక ఈ పోలీసులు ఎక్కడున్నా వదిలిపెట్టబోం’ అని బెదిరింపులకు దిగారు. కాగా జేసీపై ఇతర పోలీసులు ఫిర్యాదు చేసారు. వీటన్నిటపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి