iDreamPost

రాజధాని పై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం..

రాజధాని పై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం..

కార్యనిర్వాహక విభాగాలను విశాఖకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి వేసిన ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. పది రోజుల లోపు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణకు పది రోజులకు వాయిదా వేసింది.

పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సీఎం జగన్ మూడు రోజులు మూడు రాజధానుల ఆలోచనను అసెంబ్లీలో వెల్లడించారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఒక సంఘాన్ని స్థాపించారు.

జీఎన్ రావు కమిటీ, బిసిజి సంస్థ అందజేసిన నివేదికలో లతో పాటు వాటి పై మంత్రులు, ఉన్నతాధికారులతో వేసిన హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయించింది. రాయలసీమ లో కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని, అమరావతి లో శాసన రాజధాని, ఉత్తరాంధ్రలో విశాఖ కేంద్రం గా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. తద్వారా మూడు ప్రాంతాలకు సమ న్యాయం జరుగుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కాగా తాజాగా మరో పిటిషన్ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి వేయడం గమనార్హం.

కాగా జగన్ సర్కార్ విశాఖలో కార్యనిర్వహక రాజధానిని ఏర్పాటు చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు భవనాలు, స్థలాలను పరిశీలించింది. సచివాలయం, హెచ్ఓడి విభాగాలను ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సమాలోచనలు జరుగుతున్నాయి. కరోనా వ్యవహారం లేకపోతే ఈపాటికే కార్య నిర్వాహక రాజధాని ఏర్పాటు పూర్తయ్యేది. అయితే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కార్యనిర్వాహక రాజధానిని విశాఖలో ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లుగా అధికార పార్టీ నేతల ప్రకటనల ద్వారా తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి