iDreamPost

మహమ్మారి తో మానవులు.. నాడు – నేడు

మహమ్మారి తో మానవులు.. నాడు – నేడు

ఆరు నెలల సావాసంతో వారే వీరవుతారు.. వీరే వారవుతారన్నది నానుడి. అలాగే కొత్తవి మొదట్లో వింతగా ఉంటాయి. భయపెడతాయి కూడా. కోవిడ్ విషయంలోనూ అదే జరుగుతోంది. కోవిడ్ ప్రభావం మొదలైన తొలినాళ్లలో దాని గురించి జనం వింతగా చెప్పుకునేవారు. ఎక్కడైనా కోవిడ్ వచ్చిందంటే చాలు భయంతో ఆమడ దూరం పరిగెత్తేవారు. ఇప్పుడూ భయం ఉన్నా దానికి అలవాటుపడ్డారు. అంటే మెల్లగా దానితో సహజీవనానికి సిద్ధమవుతున్నామన్నమాట. కోవిడ్ వైరస్ ఇప్పట్లో పోయేది కాదని శాస్త్రవేత్తల మాటల్లో స్పష్టమవుతుండటమే దీనికి కారణం. ఈ మార్పు అనివార్యమే గానీ ఇంత స్వల్ప వ్యవధిలోనే జరగడం విశేషమే. అందుకేనేమో దేనికైనా కాలం, అనుభవమే పాఠాలు నేర్పుతాయంటారు.

ఏడాది వెనక్కి వెళితే..

కోవిడ్ మన దేశంలోకి గత ఏడాది జనవరిలో అడుగుపెట్టింది. మార్చి నాటికి పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో మార్చి 22న ఒకరోజు దేశంలో జనతా కర్ఫ్యూ పెట్టారు. రెండు రోజుల వ్యవధిలోనే 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించారు. రెడ్ జోన్లు, కంటైన్మెంట్ ప్రాంతాలు ప్రకటించి కఠిన ఆంక్షలు అమలు చేశారు.
ఎక్కడైనా ఒక్క పాజిటివ్ కేసు నమోదైతే చాలు ఆ ప్రాంతం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి.. అన్ని మార్గాలు మూసేసి రాకపోకలు నిలిపివేసేవారు. కొత్తవారిని రానిచ్చేవారు కాదు. ఆ ప్రాంతంలో కేసులు తగ్గేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండేవి. ఇక ప్రజలు కూడా కరోనా పేరెత్తితేనే హడలిపోయేవారు. ఎవరైనా దగ్గినా తుమ్మినా.. భయపడి అధికారులకు సమాచారం ఇచ్చేవారు. ఇంటి పక్కనే కరోనా లక్షణాలు లేదా పాజిటివ్ వచ్చిన రోగి ఉంటే.. ఇంటికి తాళం వేసుకొని బంధువుల ఇళ్లకు వెళ్లిపోయేవారు. చాలా ప్రాంతాల్లో కరోనా రోగులను వెలి వేసే పరిస్థితి ఉండేది. వారిని జనావాసాల్లోకి అనుమతించేవారు కాదు. పాజిటివ్ సోకిన వ్యక్తి మరణిస్తే కుటుంబ సభ్యులే ముట్టుకోవడం కాదుకదా.. కనీసం దగ్గరికి వెళ్లేందుకైనా సాహసించలేకపోయేవారు. వారి అంత్యక్రియలు జరిపేందుకైనా ముందుకు రాని దుస్థితి ఉండేది.

Also Read : హెల్త్ ఎమర్జెన్సీలో కార్పొరేటు ఆస్పత్రులను అదుపు చేయలేరా..?

నేడు ఎలా ఉందంటే..

కోవిడ్ సోకితే ప్రమాదమన్న భయం ఇప్పుడు కూడా అందరిలో కనిపిస్తోంది. తొలిదశ కంటే ఎన్నో రేట్ల తీవ్రతతో వైరస్ విరుచుకుపడుతోంది. కేసులు, మరణాలు అదేస్థాయిలో పెరుగుతున్నాయి. అయితే అనాడున్న అతి జాగ్రత్త ఇప్పుడు లేదు. పాజిటివ్ కేసు వచ్చిన ప్రాంతాన్ని ఏక మొత్తంగా కంటైన్మెంట్ చేయడం లేదు. ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటి పరిసరాలకే.. మహా అయితే ఆ వీధికి ఆంక్షలు పరిమితం చేస్తున్నారు. కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇళ్లలోనే స్వీయ ఐసోలేషన్ లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు పాటిస్తూ మందులు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వమే మార్గదర్శకాల్లో సూచించింది. ప్రజలు కూడా సెల్ఫ్ క్వారెంటైన్ కే మొగ్గు చూపుతున్నారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తీవ్ర సమస్యలు వచ్చినప్పుడే ఆస్పత్రికి వెళ్తున్నారు. గత ఏడాది మాదిరిగా వీధులు, ప్రధాన మార్గాలు బోసిపోలేదు. జనజీవనం సాధారణ స్థితిలోనే ఉంది. నాడు చనిపోయిన వ్యక్తుల అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంటే.. నేడు చాలాచోట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు ముందుకొస్తున్నారు. స్వచ్చంద సంస్థలు కూడా సహకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

నాడు జగన్ చెప్పిందే జరుగుతోంది.. 

కరోనా కేసులు పెరుగుతున్న తొలినాళ్లలో సీఎం జగన్ సరిగ్గా ఇదే విషయం చెప్పారు. ఈ వైరస్ ముట్టడి ఇప్పట్లో ఆగేదికాదని.. ఎవరికివారు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ దానితో సహజీవనానికి అలవాటుపడాలని ఏడాది క్రితమే జగన్ చెప్పారు. ఆనాడు ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు అపహాస్యం చేశాయి. కోవిడ్ నియంత్రణ చర్యల్లో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే కరోనాతో సహజీవనం చేయమంటున్నారని విమర్శలు చేశాయి. కానీ జగన్ చెప్పిందే నిజమని ఇప్పటి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి చాలా కాలం పట్టే పరిస్థితి ఉంది. చికిత్సకు ఔషధాలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకవడం.. మూడోదశ కూడా ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు అప్పుడే హెచ్చరిస్తుండటం చూస్తే కొన్నేళ్లపాటు దానితో సహజీవనం చేయక తప్పదనిపిస్తోంది. అందుకే ప్రజలు కూడా మెల్లగా దానికి అలవాటు పడుతున్నారు.

Also Read : ఉన్నది ఉన్నట్లు.. జగన్ చేయలేదు కనికట్టు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి