iDreamPost

ప్రతిపక్షంలోకొచ్చిన మూడున్నరేళ్లకు ఇదేం కర్మ అంటూ ప్రజల్లోకి వెళ్లనున్న టీడీపీ

ప్రతిపక్షంలోకొచ్చిన మూడున్నరేళ్లకు ఇదేం కర్మ అంటూ ప్రజల్లోకి వెళ్లనున్న టీడీపీ

గడపగడపకు అంటూ సాగుతున్న వైసీపీ కార్యక్రమం నుండి దృష్టి మరల్చడంలో సఫలమవుతుందా?. గత సార్వత్రిక ఎన్నికల్లో, తరువాత జరిగిన స్థానిక సంస్థల, ఉప ఎన్నికలలో తీవ్ర వ్యతిరేకత కనబరచిన ప్రజల నుండి కొంతైనా సానుకూలత సాధించుకొంటుందా?.

చంద్రబాబు, టీడీపీ కార్యక్రమాల చర్చ వచ్చిన ప్రతిసారీ గత అయిదేళ్ల పాలన గురించి, బాబు చేసిన మోసాల గురించి, పాలనా వైఫల్యాల గురించి జ్ఞప్తికి రావడం సహజం. అందుకు ఫలితమే గడచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణమైన పరాజయం . అదలా ఉంచితే వైసీపీ అధికారం చేపట్టిన మూడున్నరేళ్లలో టీడీపీ విపక్ష పాత్రలో ఏమి చేసింది, ఏ ఏ అంశాల్లో ప్రజల పక్షాన నిలిచి పోరాడింది. ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఏమాత్రం ప్రజలకు అండగా నిలబడింది అంటే సమాధానానికి తడుముకోవాల్సి వస్తుంది అన్నది నిష్టుర సత్యం.

అధికార ప్రభుత్వం తలపెట్టిన రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని, అభివృద్ధి మొత్తం అమరావతిలోనే కేంద్రీకృతం చేయాలని టీడీపీ శ్రేణులతో అల్లర్లు చేయటం, పలు సాంకేతిక అంశాల్ని అడ్డం పెట్టుకొని న్యాయ వ్యవస్థలని ఆశ్రయించి ప్రభుత్వాన్ని చికాకు పెట్టటం తప్ప ప్రజలను పట్టించుకొన్న పాపాన పోలేదు.

ఒక్క రాజధాని అంశమే కాదు, ప్రభుత్వం విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణల్ని, స్థానిక ఎన్నికల నిర్వహణ ద్వారా రాష్ట్రనికి వచ్చే నిధుల్ని సైతం అడ్డుకొనే ప్రయత్నం చేయడం టీడీపీ పట్ల ప్రజల్లో అసహనం పెరగడానికి కారణమయ్యాయి. ఇవే కాక నారా లోకేష్ సహా పలువురు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర అవినీతి, దోపిడీ కేసుల్లో భాధ్యులుగా కనపడుతూ విచారణ ఎదుర్కోకుండా స్టేలు తెచ్చుకొని కాలం గడిపే చర్యలు టీడీపీ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయి.

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో టీడీపీ అధినేత నుండి తనయుడి సహా టీడీపీ ప్రధాన నాయకులు ఎవరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం పక్కనుంచి కనీసం తమ పార్టీ కార్యకర్తలకు సైతం అండగా లేకపోవడంతో ప్రజలకు మరింత దూరమైంది టీడీపీ.

మరో వైపు అధికారంతో పాటు ఆర్ధికంగా కష్టాల్లో ఉన్న ఖజానా భాద్యతలు సైతం అందుకొన్న జగన్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించగానే ఎన్నికల హామీలు అమలు పరిచే ప్రయత్నం చేయడంతో పాటు వెంటనే కరోనా రూపంలో వచ్చిన తీవ్ర విపత్తుని సమర్ధంగా ఎదుర్కోవడంతో పాటు, వాలంటీర్, సచివాలయ వ్యవస్థల ద్వారా అందించిన సేవలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి .

రైతు, మహిళ, శిశు, వృద్ధాప్య కేటగిరిలకు క్రమం తప్పకుండా అందించే ప్రోత్సాహకాలు, సంక్షేమ పధకాలు క్రమం తప్పకుండా అందించడమే కాకుండా, క్షేత్ర స్థాయిలో అవి ప్రజలకు పూర్తిగా అందుతున్నాయా లేదా, ప్రభుత్వం తరపు నుండి ప్రజలు ఆశిస్తున్న కార్యక్రమాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న విషయాలు తెలుసుకొని మరింత క్రియాశీలకంగా వ్యవహరించటానికి గడపగడప అనే కార్యక్రమం రూపొందించింది వైసీపీ ప్రభుత్వం.

దీని ద్వారా ప్రతి ఎమ్మెల్యే కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా తన నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పధకాల అమలు పరిశీలించడంతో పాటు, ప్రభుత్వ పని తీరు గురించి వారి అభిప్రాయం తెలుసుకొనే కార్యక్రమం గత ఆర్నెలలుగా ప్రజాదరణతో, సానుకూల వాతావరణంలో కొనసాగుతుంది.

ఈ సమయంలో గడపగడపకు కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వలన మీకు ఖర్మ పట్టింది. ఇదేం ఖర్మ మీకు అంటూ టీడీపీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చూసి కర్మ పట్టింది ఎవరికీ టీడీపీ నేతలకా, చంద్రబాబుకా అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేయడం చూస్తే టీడీపీ చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమం రానున్న రోజుల్లో మరింత నవ్వుల పాలవుతుంది అనిపించక మానదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి