iDreamPost

చంద్ర‌బాబూ దండం పెట్టాల్సింది మీరు కాదు, మేము

చంద్ర‌బాబూ దండం పెట్టాల్సింది మీరు కాదు, మేము

నిజాయితీగా ఉండ‌కు, నేరుగా పెరిగిన‌ వృక్షాల‌నే మొద‌ట న‌రుకుతారు.

చాణ‌క్యుడు చెప్పిన ఈ మాట‌, చాణ‌క్యుడికే స‌రిగా అర్థ‌మైందో లేదో కానీ, చంద్ర‌బాబుకు మాత్రం చిన్న‌ప్పుడే అర్థ‌మైంది. పువ్వు పుట్టగానే ప‌రిమ‌ళించిన‌ట్టు విద్యార్థి ద‌శ‌లోనే “నేను” అనే ప‌దాన్ని అర్థం చేసుకున్నాడు. మ‌హామ‌హా వేదాంతుల‌కే అంతుప‌ట్ట‌ని ఈ “నేను”ని అర్థం చేసుకుని ఆచ‌రించాడు. అందుకే బాబు ఎప్పుడూ “త‌న” అంటాడు త‌ప్ప‌, “మ‌న” అన‌డు. అందుకే ఆయ‌న 3 సార్లు ముఖ్య‌మంత్రిగా చేసినా ప్ర‌జానాయ‌కుడు కాలేక‌పోయాడు.

సోమ‌వారం రాత్రి అసెంబ్లీలో జ‌గ‌న్‌కి రెండు చేతులు జోడించినా మ‌న‌లో జాలి క‌ల‌గ‌క‌పోగా, న‌వ్వు వ‌చ్చిందంటే , చంద్ర‌బాబు హాస్యాస్ప‌దంగా మారిపోయాడ‌ని అర్థం. ఈ దుస్థితికి ఆయ‌నే కార‌ణం. ఆయ‌న రాజ‌కీయ జీవితాన్ని ప‌రిశీలిస్తే ఇది మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

Read Also: తెలుగుదేశానికి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్.

ఒక మ‌నిషి ఎద‌గ‌డానికి “Things Manage” చేస్తే చాలు అని గ‌ట్టిగా న‌మ్మేవాళ్ల‌లో బాబు ఒక‌డు. యూనివ‌ర్సిటీలో కూడా అధికార పీఠానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టానికి ప్ర‌య‌త్నించాడు త‌ప్ప‌, విద్యార్థి స‌మ‌స్య‌ల‌పై ఏనాడు ఉద్య‌మించిన వాడు కాదు. బాబు ప్ర‌త్యేక‌త ఏమంటే , ఆయ‌న‌ది నిచ్చెన‌మెట్ల సిద్ధాంతం. పైమెట్టుతో చేతులు క‌లుపుతాడు. కింది మెట్టును కాలితో న‌లిపేస్తాడు. ఆ త‌ర్వాత పై మెట్టుకి కూడా అదే గ‌తి ప‌డుతుంది. నిచ్చెన ఎక్కుతున్న‌ప్పుడు కింది మెట్టు గురించి ఆలోచించ‌కూడ‌ద‌ని బాబు త‌న స‌న్నిహితుల‌తో చెప్పేవాడు. జీవితంలో నిచ్చెన‌లే కాదు, పాములు కూడా ఉంటాయి. ఆయ‌న త‌ప్పుల‌న్నీ ఇప్పుడు పాములుగా మారాయి.

బాబు రాజ‌కీయ గురువు రాజ‌గోపాల‌నాయుడు. ఆయ‌న అండ‌తో చంద్ర‌గిరి టికెట్ తెచ్చుకున్నాడు. ఇక్క‌డ బాబుకి రెండు ర‌కాలుగా అదృష్టం క‌లిసొచ్చింది. చంద్ర‌గిరి కొత్తగా అసెంబ్లీ స్థానంగా ఏర్ప‌డ‌టం, కాంగ్రెస్ రెండుగా చీలిపోవ‌డంతో ఇందిరా కాంగ్రెస్ టికెట్ సుల‌భంగా రావ‌డం.

Read Also: పవన్‌ను బాగా మోటివేట్‌ చేసినట్టున్నారు

ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా నేండ్ర‌గుంట నుంచి పాకాల‌కి సుమారుగా ప‌ది కిలోమీట‌ర్ల బ్యాన‌ర్లు క‌ట్టి ప‌ర్య‌ట‌నకు వ‌చ్చిన ఇందిర‌మ్మ‌ని ఇంప్రెస్ చేయాల‌నుకున్నాడే త‌ప్ప‌, చంద్ర‌గిరి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ చేయ‌లేదు. గెలిచిన త‌ర్వాత కూడా మంత్రి ప‌ద‌విపై దృష్టి త‌ప్ప‌, జ‌నం గురించి మాట్లాడ‌లేదు. దాని ఫ‌లిత‌మే 1983లో ఓట‌మి.

అంజ‌య్య వ‌ల్ల మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది. అప్పుడు కూడా చిత్తూరు జిల్లాకు ఏమైనా చేద్దామ‌నే ఆలోచ‌న లేదు. గ్రూప్ రాజ‌కీయాల్లో మునిగిపోయారు. ఓడిన త‌ర్వాత ఎన్టీఆర్ పంచ‌న చేరాడు. గ్రూప్ రాజ‌కీయ అనుభ‌వం అక్క‌డ ప‌నికొచ్చింది. పెద్ద‌ల్లుడు వెంక‌టేశ్వ‌ర‌రావు, ఉపేంద్ర‌ల‌ను త‌గ్గించే కుట్ర‌ల్లో మునిగిపోయాడు. 1984 సంక్షోభం ప‌నికొచ్చింది. ఒక కొత్త విష‌యాన్ని నేర్పింది కూడా . MLAల‌ను మేనేజ్ చేయ‌డం అర్థ‌మైంది.

1989లో ఎన్టీఆర్ ఓడిపోయాడు. ఆ ఐదేళ్లు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు పోరాడిందేమీ లేదు. కాంగ్రెస్ త‌న గొయ్యి తాను త‌వ్వుకుని ఓడిపోయింది. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాడు. ఆయ‌న మీద తిరుగుబాటు చేయ‌డానికి ల‌క్ష్మిపార్వ‌తి ఆయుధంగా దొరికారు. గ‌తంలోని క్యాంప్‌ల అనుభ‌వం ఉప‌యోగ‌ప‌డింది. ఫ‌లితం ఎన్టీఆర్‌కి వెన్నుపోటు.

ముఖ్య‌మంత్రిగా ఆయ‌న మాట‌లు కోట‌లు దాటుతుంటే ఏదో చేస్తాడేమో అనుకున్నారు. విజ‌న్ 2020 అని జీరో విజ‌న్‌తో వ్య‌వ‌హ‌రించాడు. వ్య‌వ‌సాయం దండ‌గ అన్నాడు. చిత్తూరు డెయిరీ, చ‌క్కెర ఫ్యాక్టరీ మూత ప‌డేశాడు. క‌రెంట్ చార్జీలు పెంచాడు. సంక్షేమ ప‌థ‌కాల ప‌ట్ల ఆయ‌న‌కి ఎప్పుడూ ఆస‌క్తి లేదు. హైద‌రాబాద్‌ని రియ‌ల్ ఎస్టేట్‌గా చేసి కొంద‌రికి దోచి పెట్టాడు, దోచుకున్నాడు.

Read Also: చేతులెత్తి వేడుకుంటున్నా.. చంద్రబాబు

2004 నుంచి ప‌దేళ్లు అధికారం పోయింది. ఈ ప‌దేళ్లు కూడా ప్ర‌జ‌ల కోసం ఆయ‌న పోరాడింది ఏమీ లేదు. అధికారం కోసం ఎవ‌రినైనా దూరం పెడ‌తాడు, ద‌గ్గ‌రికి తీస్తాడు. Use And Throwలో ద‌గ్గుబాటి, హ‌రికృష్ణ‌, జూ.ఎన్టీఆర్‌లు కూడా ఉన్నారు.

కార‌ణాలు ఏమైతేనేం , జ‌గ‌న్ అతి విశ్వాసం, బాబు అబ‌ద్ధ‌పు వాగ్దానాలు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బీజేపీ అన్నీ క‌లిసి బాబుని మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగా చేశాయి. ప‌దేళ్ల త‌ర్వాతైనా మ‌నిషి మారాడా అంటే లేదు. మారితే ఆయ‌న చంద్ర‌బాబు ఎందుకు అవుతాడు?

ప‌దేళ్లు హైద‌రాబాద్‌పై ఉన్న హ‌క్కుని కేసుల భ‌యంతో వ‌దిలేశాడు. అమ‌రావ‌తి అనే రాజ‌ధాని వ్యాపారం మొద‌లు పెట్టాడు. దేశాలు తిరిగాడు. పెట్టుబ‌డులు అన్నాడు. అద్భుతాన్ని సృష్టిస్తాన‌ని అర‌చేయి చూపించాడు. అంతా అబ‌ద్ధం. వేల కోట్ల దుర్వినియోగం. ఐదేళ్లు టైంపాస్ చేశాడు. కొడుకుని మంత్రి చేసి జ‌నం మీదికి తోశాడు. చంద్ర‌బాబు పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కి ఎంతో కొంత వినోదం ద‌క్కిందంటే అది లోకేశ్ వ‌ల్లే.

Read Also: మూడు రాజధానుల మీద నేరుగా మాట్లాడండి…

బాబు చేసిన ప‌నుల‌న్నింటికి ఎన్నిక‌ల్లో మూల్యం చెల్లించాడు. జ‌గ‌న్ వ‌చ్చి, ఇచ్చిన హామీల‌న్నీ నిలుపుకుంటున్నాడు. జ‌గ‌న్ వ‌ల్ల ఘోరాలు జ‌రిగిపోతున్నాయ‌ని బాబు మీడియా గ‌గ్గోలు మొద‌లైంది.

ఒక చిన్న వూళ్లో చెప్పులు కూడా లేకుండా స్కూల్‌కి వెళుతున్న పిల్ల‌ల్ని చూసి కంట‌త‌డి పెట్టే పేద‌రాలికి తెలుస్తుంది అమ్మ ఒడి విలువేంటో !మ‌గ్గం గుంట‌లోనే జీవితం క‌డ‌తేరిపోయిన చేనేత కార్మికుడికి తెలుస్తుంది జ‌గ‌న్ అందించిన హ‌స్తం విలువ. రైతుల‌కి , కార్మికుల‌కి రూపాయి డ‌బ్బులిస్తే చాలు ఎక్క‌డ‌లేని ఏడుపులు వ‌చ్చేస్తాయి.

తాగుబోతుల గొడ‌వ‌లు లేకుండా ప్ర‌శాంతంగా ఉన్న వీధుల్ని అడిగితే చెబుతాయ్ మ‌ద్యంపై జ‌గ‌న్ విధించిన నియంత్ర‌ణ ఏమిటో? ఇప్పుడు 3 రాజ‌ధానుల గురించి అర్థం అవ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది.

ఇదంతా భ‌రించ‌లేని చంద్ర‌బాబు, అమ‌రావ‌తి ఉద్య‌మం అన్నాడు. భూముల్ని పేద‌రైతులు న‌ష్ట‌పోతే ఎవ‌రికైనా బాధ క‌లుగుతుంది. కానీ అక్క‌డ ఉన్న‌ది ఎక్కువ మంది బ‌డా బాబులు. అందుకే రాష్ట్రంలో సామాన్యులెవ‌రూ బాబు ఉద్య‌మానికి సానుభూతి ప‌ల‌క‌డం లేదు.

Read Also: మార‌నున్న సీమ ముఖద్వారా చిత్రం

చంద్ర‌బాబు ఎప్పుడైనా ప్ర‌జ‌ల గురించి నిజంగా పోరాటాలు, ఉద్య‌మాలు నిజాయితీగా చేసి ఉంటే ఎంతోకొంత న‌మ్మేవాళ్లు. విశ్వ‌స‌నీయ‌త లేక‌పోవ‌డం వ‌ల్లే అమ‌రావ‌తి ప్ర‌జ‌ల ఉద్య‌మం కాలేక‌పోయింది.

ఇదంతా కాద‌ని “దూరం” అనే రాగం ఎత్తుకున్నారు. అస‌లు వ్య‌వ‌స్థ‌ల‌న్నీ స‌క్ర‌మంగా ప‌నిచేస్తే ఒక సామాన్యుడికి క‌లెక్ట‌ర్ ఆఫీస్‌కి వెళ్లే అవ‌స‌రం కూడా లేదు. అయినా రాజ‌ధానికి త‌ర‌చుగా వెళ్లేది పైర‌వీకారులు, ద‌ళారులే. చంద్ర‌బాబు ఆ వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తినిధి కాబ‌ట్టే ఈ గోల‌.

చేతులెత్తి న‌మ‌స్క‌రించాల్సింది చంద్ర‌బాబు కాదు, ప్ర‌జ‌లే ఆయ‌న‌కి న‌మ‌స్కారం పెడుతున్నారు. అభివృద్ధికి అడ్డు ప‌డ‌కుండా కొంచెం ప‌క్క‌కు త‌ప్పుకోమ‌ని.

మ‌నం ఏమి ఇస్తే అదే తిరిగి వ‌స్తుంది.
న‌మ్మిన వాళ్ల‌ని అవ‌మానించిన బాబుకి ఇప్పుడు అదే తిరిగి ల‌భిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి