iDreamPost

భార్యాభర్తల అన్యోన్యతకు నిదర్శనం – Nostalgia

భార్యాభర్తల అన్యోన్యతకు నిదర్శనం – Nostalgia

భార్యాభర్తల సంసారం పది కాలాల పాటు పచ్చగా ఉండాలంటే ఇద్దరి మధ్య పరస్పర అవగాహన అవసరం. నేనే గొప్ప అనే అహాన్ని వదిలి ఒకరికొకరు ఏం కావాలో ఇచ్చి పుచ్చుకుని కష్టసుఖాలు పంచుకున్నపుడే ఎలాంటి కలతలు రావు. కుటుంబంలో ఉన్న సమస్యలూ పరిష్కారం అవుతాయి. ఏ చిన్న అపార్థం తలెత్తినా దాన్ని సరైన సమయంలో చక్కదిద్దుకోకుంటే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని గతంలో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఒక అందమైన పెయింటింగ్ లాగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఓ ఆహ్లాదకమైన సంగీత భరిత దృశ్యకావ్యంగా రూపొందిన చిత్రాలు తక్కువ. అందులో ఒకటి పెళ్లి పుస్తకం.

1985 తర్వాత దర్శకులు బాపు గారికి సరైన సక్సెస్ లేదు. సున్నితమైన భావోద్వేగాలను అంతే అందంగా తెరమీద చూపిస్తారని పేరున్న ఈయనకు శోభన్ బాబు ‘కళ్యాణ తాంబూలం’ తర్వాత టాలీవుడ్ లో సుమారు నాలుగేళ్ల గ్యాప్ వచ్చింది. ఈ టైంలో రెండు హిందీ మూవీస్ చేశారు. ఆ సమయంలోనే మిత్రుడు తనలో సగ భాగం ముళ్ళపూడి వెంకటరమణ గారు ఎప్పుడో 1957లో వచ్చిన మిస్సమ్మలో మెయిన్ పాయింట్ ని తీసుకుని ఇప్పటి తరం అభిరుచులకు తగట్టు ఓ సినిమా తీస్తే బాగుంటుందనే ఆలోచనతో కథ రాసిన రావికొండల రావు తో కలిసి బాపు గారి ముందు పెళ్లి పుస్తకం ప్రతిపాదన తెచ్చారు. బాపు ఇంకేమి ఆలోచించకుండా స్టోరీ బోర్డు పని మీద కూర్చున్నారు. బాక్సాఫీస్ ని మాస్ మసాలా సినిమాలు డామినేట్ చేస్తున్న ట్రెండ్ లో ఇలాంటి సెన్సిబుల్ ఎమోషన్స్ జనానికి ఎక్కుతాయా అనే అనుమానం ఎవరికీ లేదు. సబ్జెక్టు మీద కాన్ఫిడెన్స్ తో షూటింగ్ మొదలుపెట్టేశారు.

రాజేంద్రప్రసాద్ హీరోగా ఫిక్స్. అప్పటిదాకా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న దివ్యవాణికి దీని రూపంలో అదృష్టం తలుపు తట్టింది. మామ కెవి మహదేవన్ పదికాలాలు నిలిచిపోయే ట్యూన్లు ఇచ్చారు. కుటుంబ అవసరాల కోసం అబద్దం చెప్పి ఓ కంపెనీలో చేరే భార్యాభర్తలు ఎలాంటి అవస్థలు పడ్డారనేదే ఇందులో మెయిన్ పాయింట్. గుమ్మడి, సింధూజ, శుభలేఖ సుధాకర్, అశోక్ కుమార్, ధర్మవరపు ఇలా అందరూ ప్రాణం పెట్టేశారు. శ్రీరస్తు శుభమస్తు పాట  ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ప్రతి పెళ్లి వీడియో ఆల్బమ్ లో వినిపిస్తోందంటే అంతకంటే ఘనత ఏముంటుంది. 1991 మార్చి 15న రిలీజైన పెళ్లి పుస్తకం అద్భుత విజయం సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, సంభాషణలు, కథతో కలిపి మొత్తం 3 నంది అవార్డులతో పాటు పలు జాతీయ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడింది. కేవలం వారం గ్యాప్ లో వచ్చిన ‘అసెంబ్లీ రౌడీ’ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ పెళ్లి పుస్తకం సూపర్ హిట్ కొట్టేసి ఫ్యామిలీ ఆడియన్స్ బెస్ట్ ఛాయస్ గా చిరకాలం నిలిచిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి