పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమాలలో రాయలసీమపై చేస్తున్న పరిణతి లేని వరుస వ్యాఖ్యలను చూస్తుంటే రాయలసీమ భౌగోళిక,సామాజిక,రాజకీయార్థిక పరిస్థితుల పట్ల ఆయనకు ఏ మేరకు అవగాహన ఉన్నదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి రాయలసీమ పట్ల, రాయలసీమ దళితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న పవన్ కళ్యాణ్ ఎవరి ప్రోద్బలంతో, ఏమి ఆశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? 19వ శతాబ్దం తోలి రోజుల నుంచే ,ముఖ్యంగా దత్తమండలాలకు థామస్ మన్రో కలెక్టర్ గా పనిచేసిన రోజుల నుంచే అన్ని వర్గాల వారికి భూమిపై హక్కుతో పాటు అందరు చదువుకోవడానికి అవకాశం కలిగింది. తదనంతర కాలంలో స్వదేశ, గాంధేయవాద విధానాలలో భాగంగా అనేకమంది దళితులు రాయలసీమ నుండి స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. సహజంగా రాయలసీమ ప్రాంతం వర్షాభావ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంత ప్రజలు తమ దృష్టిని ఎక్కువగా చదువుపైనే కేంద్రీకృతం చేశారు. భూదానోద్యమం ప్రారంభించిన వినోభాభావే లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని జోసెఫ్ ప్రభాకర్ లాంటి వారు ఆయనతో దేశవ్యాప్తంగా తిరిగారు.
కాలక్రమేణా ఇక్కడి స్థానిక నాయకులు సారా వ్యాపారంలో ఆధిపత్యం కోసం, ప్రభుత్వ కాంట్రాక్టులను దక్కించుకోవటానికి,సహజ వనరులపై పెత్తనం సడలకుండా ఉండటానికి, గ్రామాలలో తన పట్టు నిలుపుకునే క్రమంలో భాగంగా ఆధిపత్యం కోసం చేసుకున్న హత్యలను ఫ్యాక్షనిజం అని పేరు పెట్టి దానిని బూచిగా చూపించి అనేక విద్యా,వైద్య, పారిశ్రామిక సంస్థలను ఈ ప్రాంతానికి రాకుండా ఎవరు కుట్ర పన్నారో అందరికీ ఎరుకే. గత రెండు దశాబ్దాలుగా రాయలసీమకు చెందిన దళిత, బడుగు బలహీన వర్గాల ప్రజలు వాస్తవాలను ఆకళింపు చేసుకుని, కుటుంబాలకు ప్రాధాన్యమిచ్చి ఫ్యాక్షన్ గొడవలను మరచిపోయి ప్రశాంతంగా బతుకుతున్నారు.నాటి ముఠాకక్షలు నేడు మచ్చుకైనా లేవు. నిద్ర లేకుండా, ఏ వైపు నుండి శత్రువు దాడి చేసి చంపుతాడో అని భయంతో బిక్కుబిక్కుమని బతుకులు బతుకులే కావనుకుని ప్రాయశ్చిత్తంతో పిల్లలను చదివించుకుంటూ తాము పడ్డ ఆవేదన పగవాడికి కూడా రాకూడదంటూ దూరంగా బతుకులీడుస్తున్నారు. అయినవారిని కోల్పోయి అంగలారుస్తూ,ప్రకృతి కరుణించక ,పెట్టిన పంట ఎండిపోయి వరుణుడి మీద భారమేసి వచ్చిన అరకొర దిగుబడులతో బతుకుబండిని సాగిస్తున్నారు. రాయలసీమ ప్రజల పార్థివ దేహాల మీద నెత్తుటికూడు తినే సినీపరిశ్రమ గోరంతలను కొండంతలు చేసి కోట్లరూపాయలు ఆర్జించింది గానీ, ఇక్కడ పట్టింపుల కోసం పసిపిల్లలను సైతం ప్రాణాలు తీసేంత కర్కశ హృదయులు ఎంతమాత్రం కాదు. మానిన గాయాలను మళ్ళీమళ్ళీ రేపుతూ, ఎద్దు పుండు మీద కాకి పొడిచినట్లుగా పవన్ కళ్యాణ్ మాటలున్నాయే తప్ప ఈ ప్రాంతప్రజల తరపున మాట్లాడినట్లు లేదు. రాజధాని ప్రాంతంలో రైతుల భూముల విషయంలో, క్రాప్ హాలిడే ప్రకటించినపుడు తక్షణం ఆ ప్రాంతం పర్యటించి ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చినట్లు నటించిన పవన్ కళ్యాణ్, నా హ్రదయంలో కర్నూలే రాజధాని అని ఎన్నికల ప్రచారంలో అన్న పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రాంత రాజధాని విషయంలో కానీ, హైకోర్టు, ఎయిమ్స్,రైల్వేజోన్ వంటి తదితర అంశాల విషయంలో తక్షణ స్పందన ఎందుకు కరువైందోనన్న విషయం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంత ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. మీ రాజకీయ వైరుధ్యాలను ప్రాంతానికి ముడిపెడుతూ అసందర్భంగా, అప్రస్తుతంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి.
చిరంజీవిని తన సొంతప్రాంతంలో చిత్తుచిత్తుగా ఓడిస్తే అక్కున చేర్చుకుని గెలిపించింది రాయలసీమ వాసులేనని,అందునా ఇక్కడి మెజారిటీ జనం దళితులేనన్న విషయం పవన్ కళ్యాణ్ గుర్తుకు తెచ్చుకోవాలి. గతంలో ఎన్టీఆర్, హరికృష్ణలను శాసనసభకు పంపింది,ప్రస్తుతం బాలకృష్ణను శాసనసభకు పంపింది ఈ రాయలసీమ ప్రాంతమేనని గుర్తెరిగి మాట్లాడాలి. రాయలసీమ రౌడీలు,పులివెందుల సంస్కృతి,కడప రాజకీయం అన్న మాటలు తరచూ మాట్లాడిన రాజకీయ పక్షాలకు ప్రజలు ఎలా బుద్ధిచెప్పారో గత ఎన్నికలలో తేటతెల్లమైనది. రాయలసీమలో దళితులపై సామూహిక దాడులు ఎన్నడూ జరగలేదు. చెదురుమదురు సంఘటనలు జరిగినా వాటిని తిప్పికొట్టడానికి దళితయువత, ప్రజాసంఘాలు చైతన్యమై ఉంది. కర్నూలు జిల్లా లో మద్దికెరలో మార్తమ్మ అనే దళిత మహిళపై అత్యాచారం జరిగి చంపివేసిన ఘటనలో ఢిల్లీస్థాయి వరకు ఉద్యమం చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేసిన ఘనత దళిత సంఘాలదే. గుంటూరు, కారంచేడులాంటి ఘటనలు ఈ ప్రాంతంలో జరిగిఉంటే ఇక్కడి దళితులు ప్రాణాలను లెక్క చేయకుండా తిరగబడే తత్వం ఈ ప్రాంత ప్రజలది. పశ్చిమ గోదావరి జిల్లాలో గరుగుపర్రులో గ్రామబహిష్కరణ జరిగినపుడు నేనేం చేశానని పవన్ కళ్యాణ్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. అలాంటి ఘటనలు జరిగినప్పుడు పవన్ ఈ ప్రాంతంలో దళిత యువత,ప్రజలు నాటి వ్యవస్థలపై తిరుగుబాటు చేసి విద్యా, రాజకీయ రంగాలలో అసమాన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.
ఈ ప్రాంతంలో దళిత వర్గానికి చెందిన ఆధ్యాత్మికంగా పేరెన్నిక గన్న ఆదోని మహాలక్ష్మమ్మ అవ్వ, మరూరు చిన్నకదిరయ్య లాంటి వారు కుల,మత బేధాల్లేకుండా అందరి నీరాజనాలు పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక దళిత నాయకుడు దామోదరం సంజీవయ్యది కర్నూల్. ఇదే ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీ అత్యన్నతమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సభ్యురాలిగా లక్ష్మీదేవమ్మ గారు ప్రాతినిధ్యం వహించారు.రాయలసీమ నుండి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన సాకే శైలజానాథ్ వంటి వారు తమ మంత్రివర్గాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను అడ్రస్ చేయడంలో సఫలీకృతులయ్యారు. కర్నూలు జిల్లాలో మారెప్ప లాంటి వారు మంత్రులుగా పనిచేశారు.ప్రస్తుత శాసనసభకు రాయలసీమ రిజర్వ్డ్ నియోజక వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారందరూ పట్టభద్రులే. పవన్ కళ్యాణ్ తరచూ ఈ ప్రాంతంపై అవగాహన లేని వ్యాఖ్యలు చేయడం మాని రాయలసీమ రచయితలైన బండి నారాయణస్వామి రాసిన శప్తభూమి లాంటి పుస్తకాలు చదవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పవన్ తాను చేసిన పోరాటయాత్రల సమయంలో ఈ ప్రాంతం పట్ల అవగాహన ఉన్న వారిని, చారిత్రకారులను,నిజమైన ఉద్యమకారులను సంప్రదించి వారిద్వారా సమాచారం సేకరించుకుని ఉండాల్సింది. నిజాలు తెలుసుకోకుండా రాజకీయాలు చేస్తే అభాసుపాలు కాక తప్పదు. మాట్లాడిన ప్రతీ సందర్భంలో ఒక ప్రాంతంపై విద్వేషాన్ని వెదజల్లుతూ అవాస్తవాలను ప్రచారంలోకి తేవాలని ప్రయత్నిస్తే ఈ ప్రాంత వాసులు బుద్ధిచెప్పక మానరు. వ్యక్తులకే కాదు ప్రాంతాలకు కూడా అస్థిత్వం ఉంటుంది.
Written By Sake Srihari
పుట్టిన వాడు మరణించక తప్పదు. అయితే పుట్టుక ఎలా ఉన్న మరణం ఎప్పుడు సంభవిస్తుందో చెప్పలేం. చాలా మంది తమ మరణం ఇలా ఉండాలని కోరుకుంటారు. మంచాన పడకుండా, నిద్రలోనే ప్రాణం విడవాలని ఆశిస్తుంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా తన చివరి మజిలీ సాగిపోవాలని భావిస్తుంటారు. దహన సంస్కారాలు వీరి చేతుల మీదుగా సాగాలని అనుకుంటారు. అయితే ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగే అంతిమ సంస్కారాలు గౌరవ ప్రదంగా ఉంటాయి. చాలా తక్కువ మంది ప్రముఖులకు మాత్రమే […]