iDreamPost

పారువేట.. opet festival..

పారువేట.. opet festival..

రాయలసీమ లోని పల్లెల్లో సంక్రాంతి కనుమరోజు పారువేట జరుపుతారు. సోమవారం నుంచి అహోబిలంలో మొదలు కాబోతున్న పారువేట విశేషాలు మళ్లీ మరొకసారి…

సంక్రాంతి తరువాత తిరుమలలో జరిగే పారువేట ను టీవీల్లో చూసే ఉంటారు.హడావుడి అంతా మన డాలర్ శేషాద్రి స్వామి గారిదే. మలయప్ప స్వామి ప్రతినిధిగా వేటాడుతున్నట్లు వారొక ఈటె/బల్లే న్ని విసురుతూ వెళుతుంటారు.అదంతా ఒక పూట కార్యక్రమమే అక్కడ.

అదే అహోబిలం లో ఆ పారువేట 40 రోజుల పైచిలుకు సాగుతుంది. అసలే ఆయన చెంచుల ఇంటి అల్లుడాయే. మరి చెంచులక్ష్మేమో సూటిగా బాణమెయ్యగలవా? చెట్టులెక్కగలవా,పుట్టలెక్కగలవా? అని అడిగి మరీ పెళ్లాడింది కదా!

అహోబిలంలో సంక్రాంతి కనుమ నాడు మొదలయ్యే పారువేట లో ఎగువ,దిగువ అహోబిలాల్లోని ఉగ్ర,లక్ష్మీ నరసిమ్హ ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఆసీనులను చేసి బోయీలు మోస్తూ సమీప గ్రామాల్లో ఊరేగింపుగా తీసుకు వెళతారు.ఆయా గ్రామాల్లో అందమైన రంగవల్లులతో పల్లకి కి ప్రజలు స్వాగతం పలుకుతారు.చివరి మజిలీగా “రుద్రవరం” అనే గ్రామానికి తీసుకువెళతారు.

కాకతీయ ప్రతాప రుద్రుడు ప్రతిరోజూ ఒక స్వర్ణ శివలింగానికి అభిషేకం చేసేవాడంట.ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్వర్ణ లింగం పోత పోస్తే నిలవలేదంట.చివరికి ఇది నారసింహ క్షేత్రమని తెలిసి అహోబిలం దర్శించి కానుకలు సమర్పించి కొన్ని నిర్మాణాలూ కావించాడంట.అప్పుడు ప్రతాప రుద్రుడు బస చేసిన ప్రాంతానికి రుద్రవరం అని పేరొచ్చిందని కథనం. శివరాత్రినాటికి ఉత్సవ విగ్రహాలు అహోబిలం చేరిన తర్వాత అక్కడ బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి.అంతే కాదు అన్ని ప్రాంతాల్లోని నారసింహ క్షేత్రాల్లోనూ ఉత్సవాలు ఆ సమయంలోనే జరుగుతాయి.

కదిరి నరసింహాలయంలోనూ ఇలాంటి ఉత్సవాలే జరుగుతాయి. హిరణ్య కశిపుని వధ తర్వాత స్వామి ఇక్కడ శాంత రూపం పొందాడని ఒక కథనం. ఇక్కడ స్వామి అష్టభుజుడు. రెండు చేతులతో హిరణ్య కశిపుడి తల, పాదాలను పట్టుకుని మరో రెండు చేతులతో అతని ఉదరాన్ని చీలుస్తుంటాడు. శంకు చక్రాలు మరో రెండు చేతుల్లో ఉండగా. మరో రెండు చేతుల్లో ఆయుధాలు ఉంటాయి.స్వామి వారికి అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు నుంచుని ఉంటాడు. విజయనగర సామ్రాజ్యంలోని పాలేగాళ్లు ఇక్కడి ఆలయాన్ని నిర్మించారు. ఆలయాన్ని మొత్తం ఐదు దశల్లో నిర్మించారని అంటారు. ఇక్కడి ఎన్నో కోనేర్లను తీర్ధాలుగా వ్యవహరిస్తారు.అర్జున తీర్థం, శ్రీ తీర్థం, శ్వేత పుష్కరిణి, భృగు తీర్థం, గరుడ తీర్థం……

ఉట్టి

ఖాద్రీ నరసింహుడు తిరువీధుల్లో సంచరించేటప్పుడు సేద తీరేందుకు కదిరి చుట్టు పక్కల 12 ఉట్లు ఉన్నాయి.ఇక్కడ ఉట్టి అంటే రాతి స్థంభాల మండపాలు. ఈ ఉట్లకు ఎన్నో పేర్లు… గొల్లవాండ్ల ఉట్టి, కుమ్మరి వాండ్ల బక్కన్న ఉట్టి, కోమటివాండ్ల పేర్ల వంకప్ప ఉట్టి, కంసల వాండ్ల తిమ్మప్ప ఉట్టి, బెస్తవాండ్ల సింగన్న ఉట్టి.. ఫాల్గుణ మాసం లో 16 రోజుల పాటు ఘనం గా తిరునాళ్లు జరుగుతాయి.చివరి రోజు వసంతోత్సవం నిర్వహిస్తారు. దీర్ఘ కాలం స్వామివారు ప్రజల మధ్య ఉండేది మాత్రం పూరీ జగన్నాధ రధయత్రలోనూ చూస్తాము.

ఈ ఉత్సవాలను పోలిన ఉత్సవం ప్రాచీన ఈజిప్ట్ చరిత్రలో చూస్తాము. అదే opat festival. ఈజిప్ట్ ను పాలించిన కొన్ని వంశాల రాజులు ఆ దేశానికి దక్షిణాన ఉన్న లుక్సర్ కు రాజధాని మార్చారు.అక్కడ luxor temple, karnak temple అని ఉంటాయి.

ఈ ఆలయాల ముందు ఒక ఆలయం నుంచి మరో ఆలయాన్ని కలుపుతూ sphinx (మనిషి తల..సింహం శరీరం)వరుసలు ఉండేవి. నగరం పెరిగి ఇప్పుడు ఆ continuity ఉండదు.ఈ కార్నాక్ ఆలయం నుంచి దేవతల విగ్రహాలను పడవను పోలిన పల్లకీ లో మోస్తూ లుక్సర్ ఆలయానికి తెచ్చే వారు.వాటి మధ్య దూరం 3 మైళ్లైనా కొన్ని రోజులపాటూ ఆ యాత్ర సాగేది.లుక్సర్ ఆలయంలో అభిషేకాలూ పూజలూ నిర్వహించి పక్కనే ఉన్న నైల్ నది లో తెప్పోత్సవం చేస్తూ తిరిగి కార్నాక్ ఆలయం తీసుకు వెళ్లేవారు. ప్రాచీన ఈజిప్ట్ రాజుల తర్వాత అక్కడ క్రిస్టియానిటీ, ఆ తర్వాత ఇస్లాం వచ్చాయి.

అసలు ఆళ్లగడ్డకు ఆ పేరు ఆళ్వారుల గడ్డ నుంచి వచ్చిందంటారు. ఈ అళ్వార్ల కాలాన్ని చరిత్రకారులు 5-10(c.e) శతాబ్దాల మధ్య గా కొందరు నిర్ధారిస్తే….సనాతనులు వారు 4000-2700(b.c.e) ప్రస్తుత ఆంగ్ల శకానికి ముందు కాలం నాటి వారని అంటారు. ఒకవేళ చరిత్రకారుల మాటే నిజమైతే.. ఆళ్వార్లు, ఆ తర్వాత రామానుజుల వారేమో 1000 క్రితం వాడంటారు కదా,మరి ఇన్నేళ్లు ఆ opet festival సాంప్రదాయం ఎక్కడ దాగుంది?

అసలు మన చరిత్ర ను నిజంగా ఉన్నదున్నట్టే రాసారా?ఎంత సేపూ ఎవరో తెలియని, decipher చేయలేని సింధు నాగరికత, గంగా మైదానాల నాగరికతలనే రాసారా? ఆ చరిత్రకారులు దక్షిణాది చరిత్రను సరిగా రాసారా?

సముద్రయానం ద్వారా మనకు,ఈజిప్ట్ వారికీ సంబంధబాంధవ్యాలుండేవా? అసలు మన దక్షిణాది ఆలయాల్లా అక్కడి ఆలయాల్లో బలిపీఠాలు,ద్వజ స్థంభాలను పోలిన obelisks లు,చిన్న గర్భగుడులు,పుష్కరిణులూ ఎలా ఉన్నాయి?కార్నాక్ ఆలయ గర్భగుడి గోడ మీది చిత్రం లో పడవ లాంటి పల్లకి మోస్తున్న వారూ శిరోముండనంతో ఉండటమే కాదు ఆ పంచలు కూడా నాభి పైవరకూ ధరించింది చూడండి.

తెలిస్తే చెప్పగలరా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి