iDreamPost

ఏపీలోనే ఉంటాం.. ఇక్కడే ఓట్లేస్తాం..

ఏపీలోనే ఉంటాం..  ఇక్కడే ఓట్లేస్తాం..

మేం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాం.. ఇక్కడే ఓట్లేస్తాం.. అడ్డుకోవడానికి మీరెవరు.. అంటూ కొటియా గ్రామాల గిరిజనులు ఒడిశా అధికారులపై తిరగబడ్డారు. వారిని ఎదిరించి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరిషత్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఈ ఘటన మరోసారి కొటియా వివాదాన్ని తెరపైకి తెచ్చింది.

దశాబ్దాల వివాదం

ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉన్న కొటియా గ్రామాలపై ఆధిపత్యం విషయంలో దశాబ్దాలుగా వివాదం నలుగుతోంది. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటై.. ఆంధ్ర, ఒడిశా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు ఆనుకొని కొండలపై కొటియా తెగ గిరిజనులు నివసించే 22 గ్రామాల విషయంలో వివాదం తలెత్తింది. 1958 నుంచి కొనసాగుతున్న ఈ వివాదంలో రెండు రాష్ట్రాలు ఆ గ్రామాలు తమకే చెందుతాయని వాదిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇరురాష్ట్రాలు పరస్పరం చర్చించుకుని వివాదాన్ని పరిష్కరించాకోవాలని సూచించింది. సామరస్యపూర్వక పరిష్కారం కుదిరే వరకు యథాతథ పరిస్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఆ ప్రకారం ఒక్క గ్రామం తప్ప మిగిలిన 21 గ్రామాల్లో ఆంధ్ర పాలనే కొనసాగాల్సి ఉంది.

Also Read : నేడే పరిషత్‌ పోరు

కబ్జాకు ఒడిశా పన్నాగం

ఏజెన్సీ గ్రామాలైన కొటియా పల్లెల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న అపారమైన ఖనిజ వనరులపై కన్నేసిన ఒడిశా సర్కారు తరచూ తన పరిధి దాటి.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఈ గ్రామాలను తనలో కలిపేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. చిన్న చిన్న అభివృద్ధి పనులు చేపట్టి గిరిజనులను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే రిజర్వ్ ఫారెస్టులో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు నిర్మించింది. అయినా గిరిజనులు ఒడిశాలో కలిసేందుకు అంగీకరించడంలేదు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు బాగా అమలవుతుండటం.. పలు పథకాల ద్వారా ఆర్థిక లబ్ది చేకూరుతుండటంతో ఒడిశా పన్నాగాలకు వారు లొంగడంలేదు. దాంతో ఒడిశా అధికారులు ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడం వంటి చర్యలతో గిరిజనులను వేధిస్తున్నారు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లోనూ ఇలాగే వ్యవహరించారు.

గిరిజనుల తిరుగుబాటు

తాజాగా జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు నెరేళ్ళవలస పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న పట్టుచెన్నూరు, పగులు చెన్నూరు, గంజాయిభద్ర తదితర గ్రామాల ఓటర్లను గంజాయిభద్ర వద్ద ఒడిశా పోలీసులు అడ్డుకున్నారు. ముందురోజు రాత్రే రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి దాదాపు వందమంది పోలీసులను పెట్టి అటకాయించారు. కరోనా నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని.. వాటిని ఉల్లంఘించి ఎలా వెళతారని గద్దించారు. గిరిజనులు కూడా అంతే తీవ్రంగా తిరగబడ్డారు. మేం ఆంధ్రావాసులం.. ఎన్నికల్లో ఓట్లు వేయకుండా అడ్డుకోవడానికి మీకేం అధికారం ఉందని నిలదీశారు. ఉదయం పది గంటల వరకు వివాదం కొనసాగింది. పార్వతీపురం సబ్ కలెక్టర్ విదేకరే, ఐటీడీఏ పీవో కూర్మనాథ్ లు గంజాయిభద్రకు వెళ్లి కోరాపుట్ జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. సుప్రీంకోర్టు స్టేటస్ కో అమల్లో ఉండగా ఎలా అడ్డుకుంటారని అడగడంతో ఎట్టకేలకు ఒడిశా అధికారులు అడ్డంకులు తొలగించారు. గిరిజనులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Also Read : జోరుగా పరిషత్‌ పోలింగ్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి