iDreamPost

PAN INDIA భవిష్యత్తు టాలీవుడ్ చేతిలో

PAN INDIA భవిష్యత్తు టాలీవుడ్ చేతిలో

ఒకప్పుడు ప్యాన్ ఇండియా పదమే మనకు పరిచయం లేనిది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ని మించిపోయేలా జపాన్ లాంటి దేశాల్లో కూడా మన గురించి గొప్పగా చెప్పుకునేలా రాజమౌళి లాంటి దర్శకులు తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తున్నారు. పక్కరాష్ట్రంలో ప్రశాంత్ నీల్ ఇచ్చిన కెజిఎఫ్, రిషబ్ శెట్టి తీసిన కాంతారలు న్యూ జనరేషన్ మేకర్స్ ని స్ఫూర్తినిస్తున్నాయి. అందుకే హిందీలో కంటే ఎక్కువగా ఇప్పుడు టాలీవుడ్ లోనే భారీ చిత్రాల నిర్మాణం ఊపందుకుంది. అన్నీ మన తెలుగు హీరోలతో రూపొందుతున్నవే. ఆది పురుష్ నిర్మాణ సంస్థ టి సిరీసే కానీ డార్లింగ్ ప్రభాస్ ఎక్కడివాడో నార్త్ ఆడియన్స్ కి తెలియంది మర్చిపోయేది కాదు.

రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆర్సి 15 మీద ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పుష్ప 2 కోసం మనకన్నా ఎక్కువగా ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు ఎదురు చూడటం అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుని నిర్మాత ఏఎం రత్నం ఏ మాత్రం రాజీ లేకుండా రూపొందిస్తున్నారు. పవర్ స్టార్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ ఇది. అఖిల్ ఏజెంట్ కి సమయం కోట్లు రెండూ విపరీతంగా ఖర్చవుతున్నా దర్శకుడు సురేందర్ రెడ్డి రాజీ మంత్రం పాటించడం లేదు. కేవలం టీజర్ తోనే తేజ సజ్జ హనుమాన్ కు డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో డిమాండ్ వచ్చేసింది. డబ్బింగ్ హక్కులతో పెట్టుబడి మొత్తం వెనక్కు రావొచ్చని ఒక అంచనా.

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న చిత్రం కూడా మల్టీ లాంగ్వేజే. ఆర్ఆర్ఆర్ తెచ్చిన ఫేమ్ ని కాపాడుకునే క్రమంలో తారక్ ఎంత లేట్ అవుతున్నా సరే బెస్ట్ స్క్రిప్ట్ కోసం శివ మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. తగినంత సమయం ఇవ్వడం కోసమే నెల రోజుల ఫారిన్ ట్రిప్ కి వెళ్ళిపోయాడు. నాని దసరా మీద మాస్ లో మంచి హైప్ ఉంది. మార్చిలో రిలీజ్ నాటికి బజ్ అమాంతం పెరగడం ఖాయం. తమిళం మళయాలంలో మనతో పోలిస్తే ఈ స్థాయిలో ఇద్దరు హీరోలు ఇంతేసి బడ్జెట్ లతో సినిమాలు చేస్తున్న దాఖలాలు లేవు. చూస్తుంటే ప్యాన్ ఇండియా మార్కెట్ భవిష్యత్తు టాలీవుడ్ చేతిలో ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు కావాలా