iDreamPost

రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ ఆల్​రౌండర్.. బాబర్​తో ఫైటే కారణమా?

  • Author singhj Published - 08:19 AM, Sat - 25 November 23

పాకిస్థాన్ ఆల్​రౌండర్ ఇంటర్నేషనల్ క్రికెట్​కు రిటైర్మెంట్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ కెప్టెన్​ బాబర్​ ఆజంతో ఫైట్ కారణంగానే అతడు క్రికెట్​కు గుడ్​బై చెప్పాడని టాక్.

పాకిస్థాన్ ఆల్​రౌండర్ ఇంటర్నేషనల్ క్రికెట్​కు రిటైర్మెంట్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ కెప్టెన్​ బాబర్​ ఆజంతో ఫైట్ కారణంగానే అతడు క్రికెట్​కు గుడ్​బై చెప్పాడని టాక్.

  • Author singhj Published - 08:19 AM, Sat - 25 November 23
రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ ఆల్​రౌండర్.. బాబర్​తో ఫైటే కారణమా?

వన్డే వరల్డ్ కప్-2023 ముగిసిన దగ్గర నుంచి పాకిస్థాన్​ క్రికెట్​లో ముసలం మొదలైంది. మెగా టోర్నీ పూర్తయినప్పటి నుంచి దాయాది దేశ క్రికెట్​లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ప్రతిష్టాత్మక టోర్నమెంట్​ సెమీస్​కు చేరుకోకుండా పాక్ ఇంటికి వచ్చేసింది. భారత్​తో సహా పలు బడా దేశాలపై అలాగే ఆఫ్ఘానిస్థాన్ లాంటి చిన్న టీమ్​ చేతిలోనూ పాక్ చిత్తుగా ఓడిపోయింది. దీంతో అక్కడి అభిమానులు, సీనియర్ క్రికెటర్లు పాక్ ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. వరల్డ్ కప్​లో చెత్తాటకు బాధ్యత వహిస్తూ పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. మోర్కెల్​తో పాటు ఇంజమాముల్ హక్ తన చీఫ్ సెలక్టర్ పదవికి రిజైన్ చేయగా.. బాబర్ ఆజం కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు.

ప్రపంచ కప్​లో దారుణమైన ఆటతీరును ప్రదర్శించినందుకు గానూ పాకిస్థాన్ క్రికెట్​ను ప్రక్షాళన చేసింది పీసీబీ. ఫారెన్ కోచింగ్ స్టాఫ్​తో పాటు టీమ్ డైరెక్టర్​ను తొలగించింది. కొత్త డైరెక్టర్​గా సీనియర్ ప్లేయర్ మహ్మద్ హఫీజ్​ను నియమించింది. చీఫ్ సెలక్టర్ పదవికి వహాబ్ రియాజ్​ను సెలక్ట్ చేసింది. టీ20 టీమ్​కు కెప్టెన్​గా షహీన్ షా అఫ్రిదీని.. టెస్టు జట్టు సారథిగా షాన్ మసూద్​ను నియమించింది పీసీబీ. దీంతో ఇకనైనా తమ టీమ్ పెర్ఫార్మెన్స్​లో మార్పు వస్తుందేమోనని పాక్ బోర్డు అనుకుంటోంది. ఇక అంతా సర్దుకుందని అనుకునే టైమ్​లో ఇప్పుడు పాక్ క్రికెట్ నుంచి మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. ఆ టీమ్ స్టార్ ఆల్​రౌండర్ ఇమాద్ వసీం రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్​కు తాను గుడ్ బై చెబుతున్నట్లు 34 ఏళ్ల ఇమాద్ వసీం శుక్రవారం ప్రకటించాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని వివరిస్తూ ఒక ప్రకటనను కూడా విడుదల చేశాడు. వన్డే వరల్డ్ కప్-2023 టీమ్​లో ప్లేస్ దక్కించుకోలేకపోయాడు ఇమాద్. తన దేశానికి ఇన్నాళ్లు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. ఇన్ని రోజులు తనకు అండగా ఉన్న అభిమానులందరికీ అతను కృతజ్ఞతలు తెలిపాడు. కొన్నాళ్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ గురించి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నానని.. వీడ్కోలు పలికేందుకు ఇదే కరెక్ట్ టైమ్ అని తాను భావించానన్నాడు ఇమాద్. కొత్త కోచ్, నూతన కెప్టెన్ నేతృత్వంలో పాక్ అద్భుతాలు సృష్టిస్తుందని తాను అనుకుంటున్నానని.. తమ జట్టు అసాధారణ విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నాడు.

ఇక మీద వరల్డ్ వైడ్​గా జరిగే ఫ్రాంచైజీ లీగ్స్​పై తాను ఫోకస్ చేయాలని అనుకుంటున్నానని ట్విట్టర్​లో పెట్టిన పోస్ట్​లో ఇమాద్ వసీం రాసుకొచ్చాడు. పాక్ తరఫున 55 వన్డేలు ఆడిన అతను 986 రన్స్ చేశాడు. 44 వికెట్లు తీశాడు. 66 టీ20 ఆడి 486 రన్స్ చేసి.. 65 వికెట్లు తీశాడు. మొత్తంగా తన కెరీర్​లో 6 హాఫ్ సెంచరీలు చేశాడతను. అయితే ఇమాద్ హఠాత్తుగా రిటైర్మెంట్ తీసుకోవడానికి మాజీ కెప్టెన్ బాబర్ ఆజంతో ఉన్న గొడవలే కారణమని వినికిడి. ఒకప్పుడు పాకిస్థాన్ సూపర్​ లీగ్​లో కరాచీ కింగ్స్​లో వీళ్లిద్దరూ కలసి ఆడారు. ఆ టైమ్​లో ఇమాద్ కెప్టెన్సీలో ఆ జట్టు టైటిల్ కూడా గెలుచుకుంది. కానీ అప్పటి నుంచే వీళ్లిద్దరి మధ్య పొసగదని.. సంబంధాలు క్షీణించాయని సమాచారం. బాబర్​తో ఫైట్ కారణంగానే ఇమాద్​కు వరల్డ్ కప్-2023 టీమ్​లో చోటు దక్కలేదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

ఇదీ చదవండి: పాకిస్థాన్ పరువు తీసిన రికీ పాంటింగ్! ఏమన్నాడంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి