iDreamPost

OTT రూటు మార్చిన ఓటిటిలు – చిన్న సినిమాలకు ఇక్కట్లు

OTT రూటు మార్చిన ఓటిటిలు – చిన్న సినిమాలకు ఇక్కట్లు

కరోనా కాలంలో థియేటర్లు మూతబడినప్పుడు నిర్మాతల పాలిట ఓటిటిలు ఎంత పెద్ద కల్పతరువుగా వ్యవహరించాయో చూశాం. ఒకవేళ ఇవే లేకపోతే వి, నిశ్శబ్దం, జగమే తంత్రం లాంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలు చవిచూసి నష్టాలు మిగిల్చేవి. ఒరేయ్ బుజ్జిగా లాంటి చిన్న చిత్రాలను సైతం ఇవి ఆదుకున్న సందర్భాలు ఎన్నో. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చేదు అనుభవాలు ఎదురుకున్న దృష్యా మీడియం రేంజ్ మూవీస్ కి సవాలక్ష కండీషన్లు పెడుతున్నాయి. గతంలోలా గుడ్డిగా ఫలానా రేట్ కి కొనేస్తామని చెప్పడం లేదు. ఒకవేళ ఖచ్చితంగా డిజిటల్ రిలీజ్ కావాలంటే మరీ అన్యాయమైన రేట్లు అడిగి భయపెడుతున్నాయి.

ముందు థియేటర్లలో రిలీజ్ చేసి ఆపై పబ్లిక్ రెస్పాన్స్, రివ్యూలు, కమర్షియల్ లెక్కలు చెక్ చేసుకున్నాక ధరను నిర్ణయిస్తామని తెగేసి చెబుతున్నాయి. ఈ కారణంగానే ఓ టాప్ ప్రొడ్యూసర్ భాగస్వామ్యం వహించిన రెండు మీడియం సినిమాలు ఇష్టంలేకపోయినా థియేటర్ కు వెళ్లాయి. అందులో ఒకటి ఆల్రెడీ డిజాస్టర్ కాగా రెండోది సెప్టెంబర్ లో ముస్తాబవుతోంది. ఒకవేళ ఆయన ఆశించినట్టు కనక డీల్ కుదిరి ఉంటే ఇవి నేరుగా స్మార్ట్ స్క్రీన్ ప్రీమియర్లు జరుపుకునేవి. ముందు వెనుకా చూడకుండా ఇష్టం వచ్చిన రేట్లకు కొంటూ పోవడం వల్ల తమకు గిట్టుబాటు కావడం లేదని ఓటిటి సంస్థల వాదన. దానికి తోడు పైరసీ భూతం వీటిని సైతం విపరీతంగా వేధిస్తోంది.

ఒకవేళ ఓన్లీ డిజిటల్ అనుకున్నా కూడా కొన్ని ఓటిటిలు షేరింగ్ ప్రతిపాదన పెడుతున్నాయి. ఎంత మంది చూశారు ఎంత ఆదాయం వచ్చిందనే దాన్ని బట్టి పెర్సెంటేజ్ ప్రకారం పంచుకుందామని అడుగుతున్నాయి. అయితే ఇందులో చాలా రిస్క్ ఉంది. లెక్కల్లో ఖచ్చితత్వానికి గ్యారెంటీ ఉండదు. అసలు ఈ వ్యూస్ పంచాయితీనే గందరగోళ వ్యవహారం. అందుకే నిర్మాతలు వేరే ఆప్షన్ లేక థియేటర్ వైపు మళ్లుతున్నారు. వీటిలో చాలా మటుకు మహా అయితే వారం మించి ఆడితే గొప్పనేలా ఉంటున్నాయి. మరికొన్ని రిలీజయ్యాక డిజాస్టర్ కావడం అసలుకే మోసం తెస్తోంది. మొత్తానికి ఓటిటిల మెలికలు పరిస్థితిని అమాంతం మార్చేసిన మాట వాస్తవం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి