iDreamPost

రాములమ్మా నీకు వందనాలమ్మా – Nostalgia

రాములమ్మా నీకు వందనాలమ్మా – Nostalgia

సమాజంలో జరిగే అన్యాయాలు దుర్మార్గాలు చూసి ప్రతి సామాన్యుడికి రక్తం మరగడం సహజం. అలా అని వ్యవస్థ మీద తిరగబడి రాజకీయాన్ని అధికారాన్ని ఎదిరించి మార్పు తెచ్చే అవకాశం తనకు ఉండదు. అందుకే అలా సాధ్యం కానిది తెరమీద చూపించినప్పుడు ఆనందంతో ఉద్వేగంతో ఉప్పొంగిపోతాడు. విప్లవం రావాలని కోరుకుంటాడు. నక్సలైట్ల మీద ఒకరకమైన సానుభూతిని ఏర్పరుచుకుంటాడు. ఈ ఎమోషన్ ని సరిగ్గా తెరమీద చూపించగలిగితే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం ఖాయమని మాదాల రంగారావు, ఆర్ నారాయమూర్తి లాంటి అభ్యుదయ దర్శకులు 80, 90 దశకంలో చాలా గొప్పగా నిరూపించారు. ఇంకో మంచి ఉదాహరణ చూద్దాం.

1996 సంవత్సరం. దర్శకరత్న దాసరి నారాయణరావుగారి ట్రాక్ రికార్డు కొంత డౌన్ లో ఉంది. ఒరేయ్ రిక్షా ఘనవిజయం సాధించాక రాయుడుగారు నాయుడు గారు, కల్యాణ ప్రాప్తిరస్తు దారుణంగా దెబ్బ తిన్నాయి. అంతకు ముందు మాయాబజార్, కొండపల్లి రత్తయ్యలవి కూడా అవే ఫలితాలు. ఇలా సతమతమవుతున్న తరుణంలో ఎక్కడో ఉత్తర్ ప్రదేశ్ లో ఓ దళిత మహిళకు జరిగిన అవమానం, అమానవీయ సంఘటన దాసరి గారిని తీవ్రంగా కలచివేసింది. దీన్ని ప్రేక్షకులకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. అంతే సంభాషణల రచయిత సంజీవి సహకారంతో స్క్రిప్ట్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. టైటిల్ పాత్రకు రాములమ్మా అని పేరు పెట్టారు. విజయశాంతి తప్ప దాసరి గారి మనసులో ఆ పాత్రకు సరితూగే యాక్టర్లు ఎవరూ కనిపించలేదు. ఆవిడ గ్రాఫ్ అప్పటికే తగ్గడం మొదలయ్యింది.

సాహసమేమో అనుకున్నారందరూ. అయినా దాసరి వెనక్కు తగ్గలేదు. ప్రత్యేక పాత్రలో సిబిఐ ఆఫీసర్ గా సూపర్ స్టార్ కృష్ణను ఒప్పించారు. విలన్ గా రామిరెడ్డితో పాటు సీనియర్ క్యాస్టింగ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నారు. వందేమాతరం శ్రీనివాస్ స్వరకల్పనలో 10 అద్భుతమైన పాటలు కంపోజ్ చేయించుకున్నారు. ఒకప్పుడు తెలంగాణలో రాజ్యమేలిన దొరల దాష్టికాలను హై లైట్ చేస్తూ వాళ్ళ దుర్మార్గానికి బాధితురాలిగా మిగిలిన ఓ అమ్మాయి గన్ను పట్టుకుని తిరగబడటం అనే కాన్సెప్ట్ ని తెరమీద చూపించిన తీరుకి క్లాసు మాసు తేడా లేకుండా జనం బ్రహ్మరధం పట్టారు. సుప్రీమ్ కంపెనీ విడుదల చేసిన ఆడియో క్యాసెట్లు అమ్మకాల్లో కొత్త చరిత్ర సృష్టించాయి. 1997 మార్చి 7 విడుదలైన హీరో పాత్రే లేని ఒసేయ్ రాములమ్మా శతదినోత్సవం జరుపుకుని అప్పుడున్న టికెట్ రేట్లకు 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఇప్పటికీ ఘనతే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి