iDreamPost

ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ సినిమాతోనే తెలుగు మూవీస్​కు పోటీ!

  • By singhj Updated - 09:09 PM, Thu - 21 September 23
ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ సినిమాతోనే తెలుగు మూవీస్​కు పోటీ!

ఈ ఏడాది భారతీయ సినీ చరిత్రలో మర్చిపోలేని సంవత్సరంగా చెప్పొచ్చు. సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ వేదిక మీద తెలుగు చలనచిత్ర పరిశ్రమ చిరస్మరణీయ ముద్ర వేసింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న విషయం విదితమే. ఎన్నాళ్లుగానో అందనిద్రాక్షగా ఉన్న ఆస్కార్ పురస్కారం దక్కడంతో భారతీయులు సంబురాల్లో మునిగిపోయారు. మరిన్ని స్వదేశీ చిత్రాలకు ఈ పురస్కారం దక్కాలని ఆకాంక్షించారు. ఈ ఒక్క ఏడాదికే పరిమితం కాకూడదు.. ఇక మీదట ఆస్కార్ అవార్డు కొట్టడం ఒక అలవాటుగా మారాలని విశ్లేషకులు కూడా అన్నారు.

ఒకవైపు ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్​లో అవార్డుల పంట పండిస్తే.. మరోవైపు భారత్ నుంచి ఉత్తమ విదేశీ కేటగిరీలో పంపిన గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ మాత్రం ఖాళీ చేతులతో వెనుదిరిగింది. ఈ మూవీకి పురస్కారం దక్కలేదు. ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘ఎలిఫెంట్ విష్పర్స్’ అనే ఇండియన్ డాక్యుమెంటరీ సిరీస్​కు కూడా అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆస్కార్స్ 2024 అధికారిక ఎంట్రీ కోసం పలు భారతీయ చిత్రాలు పోటీ పడుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియ షురూ అయింది.

ప్రముఖ ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను వీక్షిస్తోంది. ఆస్కార్స్ 2024 కోసం దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో ‘ది స్టోరీ టెల్లర్’ (హిందీ), మ్యూజిక్ స్కూల్ (హిందీ), ‘మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), ట్వల్త్ ఫెయిల్ (హిందీ), ఘూమర్ (హిందీ), ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’, ‘జ్విగాటో’, ‘ది కేరళ స్టోరీ’తో పాటు తమిళం నుంచి ‘విడుదలై పార్ట్​-1’, తెలుగు నుంచి ‘దసరా’, ‘బలగం’ ఉన్నాయట.

ఈసారి ఆస్కార్స్​ ఎంట్రీ రేసులో ‘వాల్వి’ (మరాఠీ), ‘గదర్ 2’ (హిందీ), ‘అబ్ తో సబ్ భగవాన్ భరోస్’ (హిందీ), ‘బాప్ లాయక్’ (మరాఠీ) తదితర చిత్రాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ‘బలగం’ మూవీ ఆస్కార్ ఎంట్రీ సాధించే ఛాన్సులు అధికంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఈ మూవీకి ‘జ్విగాటో’, ‘విడుదలై పార్ట్-1’ నుంచి తీవ్ర పోటీ ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా హృదయాలను మెలిపెట్టేలా భావోద్వేగాలను పంచిన ‘జ్విగాటో’ మూవీ ‘బలగం’కు సవాల్ విసురుతోందట. మరి.. ఈసారి ఆస్కార్స్​కు భారత్ నుంచి ఏ చిత్రాన్ని పంపుతారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కూతురి మరణం.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ లెటర్!