iDreamPost

ఎన్నికలలో ఓడిపోయిన వారు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించకూడదు – కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

ఎన్నికలలో ఓడిపోయిన వారు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించకూడదు – కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

ఆజ్ తక్ ఇ-అజెండా కార్యక్రమంలో శనివారం నాడు పాల్గొన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సంచలన వాఖ్యలు చేశారు. ఇటీవల వలస కార్మికులకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనలను సమర్దిస్తూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ఎన్నికలలో పదేపదే ఓడిపోయిన వారు కోర్టుల ద్వారా దేశ రాజకీయాలను నియంత్రించడానికి ప్రయత్నిచడం తగదని పరోక్షంగా ప్రతిపక్షాన్ని ఉద్దేశించి సంచలన ప్రకటన చేశారు.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న సమయంలో , వందలాది మంది వలస కూలీలు చెప్పులు లేకుండా, ఖాళీ కడుపుతో నడుచుకుంటూ వారి సొంత వూళ్లకు వెల్తూ 150 మందికి పైగా రోడ్డు / రైలు ప్రమాదాల్లో మరణించడం జరిగింది. ఈ దృశ్యాలని మీడియా నివేదికల ఆధారంగా చూసిన సుప్రీంకోర్టు వలస కార్మికుల సంక్షోభం గురించి కేంద్రం ఏమేరకు చర్యలు తీస్కుంటున్నారో వివరించాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ కోర్టుకు తన వాదనను వినిపిస్తూ , ఈ కేసును ధర్మాసనం ముందుకు తెచ్చే ముందు , ఆ తెచ్చిన వారు వలస కార్మికుల సంరక్షణ కోసం గతంలో ఏమి చేశారో కూడా కోర్టుకు వివరించల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకుడు లాయర్ అయిన కపిల్ సిబాల్ ను ఉద్దేశించి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పిన మాటను నేను పూర్తిగా సమర్ధిస్తున్నాని రవిశంఖర్ చెప్పుకొచ్చారు. గతంలో భారత ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం చేయడానికి ప్రయత్నించిన వారే ఇప్పుడు ఈ కేసును వెనక నుండి నడిపే ప్రయత్నం చేస్తున్నారని పరోక్షంగా ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పించారు.

“రాజ్యసభ ఛైర్మన్ అభిశంసన తీర్మానానికి అనుమతి నిరాకరించినప్పుడు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు? తరువాత వారు తమ కేసును ఉపసంహరించుకున్నారు. మేము భారత న్యాయవ్యవస్థను గౌరవిస్తాము. దీనికి జోక్యం చేసుకునే హక్కు ఉంది, కానీ న్యాయవ్యవస్థలపై ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా పనిచేయడానికి అందరు సహకరించాలని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

ఈ రోజు ఎవరైతే మమ్మలని ప్రశ్నిస్తున్నారో గతంలో ఆ పార్టీనే ప్రజల పై ఎమర్జన్సీ చట్టం విధించిందని “మేము ఆనాడు ఆ అత్యవసర పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడి జైలు శిక్ష అనుభవించామని” మేము న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యానికి కట్టుబడి ఉన్నాము కాని ఎన్నికలలో పదేపదే ఓడిపోయిన వారు న్యాయస్థానాల కారిడార్ల నుండి దేశ రాజకీయాలను నియంత్రించడానికి ప్రయత్నించకూడదంటూ తీవ్రంగా స్పందించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి