iDreamPost

కొనసాగుతున్న అన్వేషణ

కొనసాగుతున్న అన్వేషణ

ఏలూరులో అంతుచిక్కని విధంగా ప్రజలు అస్వస్థతకు గురికావడానికి కారణమేంటన్న దానిపై అన్వేషణ కొనసాగుతోంది. స్థానికంగా జరిపిన అన్ని పరీక్షల్లోనూ ఎటువంటి తేడాలు కన్పించకపోవడంతో సీసీయంబీ, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, న్యూ ఢిల్లీకి చెందిన ఎయిమ్స్‌ తదితర ఉన్నత స్థాయి పరిశోధన సంస్థల సాయాన్ని కూడా కోరారు. ఏలూరులోని పలు ప్రాంతాలు, వ్యాధి భారిన పడ్డవారి నుంచి శాంపిల్స్‌ను సేకరించి ఆయా సంస్థలకు పంపించినట్లు వైద్య ఆరోగ్య శాఖాధికారులు స్పష్టం చేసారు. సోమవారం అర్ధరాత్రి వరకు 460 మందికిపైగా బాధితులు లెక్కతేలారు. వీరిలో పలువురు చికిత్స అనంతరం ఇళ్ళకు చేరుకున్నారు. 158 మంది వరకు చికిత్స పొందుతున్నారని వైద్యులు స్పష్టం చేసారు. అనారోగ్య లక్షణాలు ఎక్కువగా ఉన్న 17 మందిని విజయవాడ, గుంటూరుల్లోని ఆసుపత్రులకు తరలించారు.

ఉన్నట్టుండి క్రిందపడిపోయామని మాత్రమే బాధితులు చెబుతున్నారు. దీంతో ఆసుపత్రులకు వచ్చిన బాధితులకు ఉన్న లక్షణాలను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. 12 ఏళ్ళలోపు చిన్నారులు 45 మంది వ్యాధి భారిన పడినట్లు గుర్తించారు. కానీ బాధితుల్లో ఎక్కువ మంది 30 ఏళ్ళలోపు వారేనని చెబుతున్నారు.

ఎమర్జెన్సీ మెడికల్, వైరాలజీ, ప్రజారోగ్య శాఖల్లోని ఉన్నతాధికారులతో కేంద్రం ఒక బృందాన్ని ఏలూరు పంపించింది. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సాయంత్రానికి వీరు నివేదిక అందజేయనున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పటికీ ఎదుర్కొనే విధంగా దాదాపు వంద పడకలతో ఆసుపత్రులను సిద్ధం చేసింది. పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు, భారీగా వైద్య సిబ్బందిని ఏలూరు పట్టణ వ్యాప్తంగా సేవలందిస్తున్నారు. మరో వైపు లక్షణాలను గుర్తించేందుకు విస్తృత సర్వే కొనసాగుతోంది.

ఇంత సామూహిక స్థాయిలో అస్వస్థతకు గురికావడం, అందులోనే ఏదో ఒక ప్రాంతం కాకుండా పట్టణం నలుమూలల నుంచి బాధితులు రావడం తదితర కారణాల నేపథ్యంలో ఈ అంతుచిక్కని వ్యాధిని గుర్తించేందుకు ప్రయత్నాలు తీవ్రం చేసారు. మగత కమ్ముకోవడం, కళ్ళు తిరిగినట్లు అన్పించి క్రిందపడిపోవడం, ఫిట్స్, నోట్లో నుంచి నురగలు రావడం తదితర లక్షణాలు ఉంటున్నట్లు ఇప్పటికే వైద్యులు గుర్తించారు. అందుకు తగిన చికిత్సను అందిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి