iDreamPost

సినిమా రంగం, విజ‌య‌చిత్ర అల‌నాటి ప‌త్రిక‌లు – Nostalgia

సినిమా రంగం, విజ‌య‌చిత్ర అల‌నాటి ప‌త్రిక‌లు – Nostalgia

సెవెన్త్ క్లాస్ ప‌బ్లిక్ ఎగ్జామ్‌లో మంచి మార్కులు వ‌చ్చేస‌రికి కొమ్ములు మొలిచాయి. సినిమా థియేట‌ర్ల‌ను కుమ్మ‌డం మొద‌లు పెట్టాను. అయితే అక్ష‌ర జ్ఞానం వ‌చ్చేనాటికే సినిమా ప‌త్రిక‌లు చ‌ద‌వ‌డం అల‌వాటైంది.

విజ‌య‌చిత్ర‌, సినిమా రంగం మాస‌ప‌త్రిక‌లు మా ఊర్లో దొరికేవి. విజ‌య‌చిత్ర లైబ్ర‌రీకి వ‌చ్చేది. దాని చుట్టూ ఈగ‌ల్లా పాఠ‌కులు. చ‌దువుతున్న వాడి ప‌క్క‌న కూర్చొని చ‌దివేవాడిని. వాళ్లు నిదానంగా పెద‌వులు క‌దిలిస్తూ చ‌దివే వాళ్లు. నేనేమో హైస్పీడ్ రీడ‌ర్ (ఈ విష‌యం ప‌దేళ్ల క్రితం నేనే క‌నిపెట్టాను. ఎందుకంటే వేగంగా చ‌దివే పోటీలు ఎక్క‌డా ఉండ‌వు క‌దా. సాక్షి ఇన్‌చార్జ్‌గా ఏక కాలంలో పాతిక పేజీలు చెక్ చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు అర్థ‌మైంది. స‌గ‌టు పాఠ‌కుడికి ఒక విష‌యం చ‌ద‌వ‌డానికి 5 నిమిషాలు ప‌డుతుంద‌నుకుంటే నేను దాన్ని 2 నిమిషాల కంటే త‌క్కువ కాలంలోనే చ‌దివేస్తాను. అయితే నీ తెలివి తేట‌లు, నైపుణ్యాలు డ‌బ్బు సంపాద‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌క‌పోతే అవ‌న్నీ వృథా. ఒక రిక్షా కార్మికుడు శీర్షాస‌నం వేసి చేతుల‌తో రిక్షా న‌డిపినా వేస్ట్‌. వాన్ని పిచ్చోడిగా లేదా భిక్ష‌గాడిగానే చూస్తారు).


స‌రే ఎలాగో చ‌చ్చీచెడీ విజ‌య‌చిత్ర చ‌దివేసే వాడిని. క‌ల‌ర్ ఫొటోలు చాలా అందంగా ఉండేవి. రావికొండ‌ల‌రావు ఎడిట‌ర్ అని త‌ర్వాత తెలిసింది. వి.చి. క‌బుర్లు అని శీర్షిక చాలా బాగుండేది. సినిమారంగం లైబ్ర‌రీకి వ‌చ్చేది కాదు. దాన్ని కొనాలంటే 75 పైస‌లు. చాలా ఖ‌రీదు. ఎలాగో త‌లా పావ‌లా వేసి కొనేవాళ్లం. విజ‌య‌చిత్ర వీక్లీ సైజ్‌లో ఉంటే, సినిమా రంగం ఇప్పుడొస్తున్న స్వాతీ మంత్లీ సైజులో ఉండేది.

విజ‌య‌చిత్ర‌తో పోల్చుకుంటే సినిమా రంగం కొంచెం నాశిర‌కంగా ఉండేది. జీవీజీ అనే ఆయ‌న ఎడిట‌ర్ అనుకుంటా. ఇంట‌ర్వ్యూలు బాగుండేవి. భానుమ‌తి ఆత్మ‌క‌థ ఈ ప‌త్రిక‌లోనే చ‌దివిన‌ట్టు గుర్తు. అమితాబ్ జ‌య‌బాధురి పెళ్లి చేసుకున్న‌ప్పుడు వాళ్ళిద్ద‌రి క‌ల‌ర్ ఫొటోలు వేశారు.

ఒక‌సారి కాగ‌డా అనే ప‌త్రిక క‌నిపించింది. దాన్ని కూడా చ‌దివి ప‌డేశాను. స‌రిగా అర్థం కాలేదు కానీ, అది బూతు ప‌త్రిక‌ని త‌ర్వాత తెలిసింది. బూతే కానీ మంచి తెలుగు వాక్యాలు చ‌దివిన‌ట్టు గుర్తు.

ఇది కాకుండా ఆంధ్రప్ర‌భ డైలీ , వీక్లీల‌లో సినిమా కాల‌మ్స్ ఉండేవి. అప్ప‌టికి దిన‌ప‌త్రిక‌లు సినిమా కోసం చాలా త‌క్కువ స్పేస్ ఇచ్చేవి.


1975లో మొద‌టిసారిగా సితారా క‌నిపించింది. అప్ప‌టికి విజ‌య‌చిత్ర మార్కెట్ పోయింది. సినిమారంగం క‌నిపించ‌డం మానేసింది. సితారా చాలా కొత్త‌గా ఉండేది. ప్ర‌తి గురువారం క‌రెక్ట్‌గా వ‌చ్చేది. ధ‌ర 60 పైస‌లు. బ్లాక్ అండ్ వైట్‌లో సినిమా అభిమానుల‌కు కావాల్సినంత స‌మాచారం ఉండేది.

త‌ర్వాత సినీహెరాల్డ్ , జ్యోతిచిత్ర వ‌చ్చాయి. ఇవి రెండు ఒక్క వెలుగు వెలిగాయి. త‌ర్వాత ఎన్నో ప‌త్రిక‌లు వ‌చ్చాయి. అప్ప‌టికి నాకు ఇవ‌న్నీ చ‌దివే ఆస‌క్తి పోయింది.

ఇంగ్లీష్‌లో ఫిల్మ్‌ఫేర్‌, స్క్రీన్ వ‌చ్చేవి. ఫిల్మ్‌ఫేర్‌లో క‌ల‌ర్ ఫొటోలు అద్భుతంగా ఉండేవి. స్క్రీన్ దిన‌ప‌త్రిక సైజ్‌లో అనేక పేజీల‌తో వ‌చ్చేది.

సినిమా రివ్యూలు ఆస‌క్తి క‌రంగా రాయ‌డం సితారాతో మొద‌లైంది. ఆ త‌ర్వాత ఆంధ్ర‌భూమి వెన్నెల సినిమా అనుబంధానికి ఆ క్రెడిట్ ద‌క్కింది.

ఇప్పుడంతా డిజిట‌ల్ యుగం. ప‌త్రిక‌లు చ‌దివే వాళ్లు లేరు. సితారా ఈ మ‌ధ్య ఆగిపోయింది. జ్యోతిచిత్ర 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కు వ‌చ్చింది. సినీహెరాల్డ్ ఆ రోజుల్లోనే మూత‌ప‌డింది. వెండితెర అనే ప‌త్రిక కూడా కొంత కాలం న‌డిచిన‌ట్టు గుర్తు.

సినిమా జ‌ర్న‌లిజం ఈజీ అని చాలా మంది అనుకుంటారు కానీ, అది చాలా క‌ష్టం. చాలా సుల‌భంగా అర్థ‌మ‌య్యే ప‌దాల‌తో విష‌యాన్ని చెప్పాలి. మంచి తెలుగు వ‌స్తే త‌ప్ప ఇది సాధ్యం కాదు.

సినిమా విశేషాల కోసం ఒక‌ప్పుడు నెల రోజులు ఎదురు చూసేవాళ్లం. ఇప్పుడు నిమిషాల్లో యూట్యూబ్‌లో వ‌చ్చేస్తాయి. అందుబాటులో ఉన్న‌ప్పుడు థ్రిల్ పోతుంది.

జీవితం వ‌డ్డించిన విస్త‌రి అయితే , దాంట్లో మ‌జా లేదు. క‌ర‌క‌ర‌మండే ఆక‌లి ఉంటేనే వ‌డ్డించిన విస్త‌రికి విలువ‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి