iDreamPost

మూగజీవాలకు తిండిపెడుతున్న నవీన్‌ పట్నాయక్‌.. వలసజీవులకు, నిస్సహాయులకు ఏం చేస్తున్నారు..?

మూగజీవాలకు తిండిపెడుతున్న నవీన్‌ పట్నాయక్‌.. వలసజీవులకు, నిస్సహాయులకు ఏం చేస్తున్నారు..?

హంగు, ఆర్భాటాల్లేవ్‌. ఉన్నదల్లా ప్రజలకు మంచి చేయడమే. ఇదీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తీరు. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని కార్యకలాపాలు బంద్‌ అయ్యాయి. ప్రజలకు ఇళ్లలకే పరిమితమయ్యారు. ఏ రోజుకారోజు పని చేసుకుని బతికే నిస్సహాయులు ఆకలితో అలమటించకుండా, పొట్టచేతపట్టుకుని వలస వచ్చిన ఇతర రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకుండా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఉండేందుకు, తినేందుకు వారు ఇబ్బంది పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

వీధిజీవాలు (కుక్కలు, పిల్లులు) ఆకలి తెలిసిన నవీన్‌ పట్నాయక్‌కు ప్రజల ఆకలి తెలియకుండా ఉంటుందా..? ముగజీవాలకు ఆహారం పెట్టేందుకు 54 లక్షల రూపాయలు కేటాయించిన నవీన్‌ పట్నాయక్‌.. ప్రజల పట్ల మరెంత బాధ్యతగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ రాష్ట్రం వచ్చి వివిధ పనులు చేసుకుంటూ బతుకుతున్న ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీష్‌ఘడ్‌ రాష్ట్రాల ప్రజలు దాదాపు 23 వేల మందికి ఆశ్రయం కల్పించారు. వారికి భోజనం పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 336 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు వారందరూ ఆయా కేంద్రాల్లోనే సేదతీరనున్నారు. ఏదైనా సహాయం కోసం శ్రామిక్‌ సహాయత పేరుతో టోల్‌ ఫ్రి నంబర్‌(18003466703)ను అందుబాటులోకి తెచ్చారు.

వలస కార్మికులతోపాటు తమ రాష్ట్రంలో రెక్కాడితేగానీ డొక్కాడని నిస్సహాయులకు సీఎం నవీన్‌ పట్నాయక్‌ కుటుంబ పెద్దగా మారారు. గ్రామ పంచాయతీల ద్వారా ప్రతి రోజూ గ్రామాల్లో 2,43,337 మందికి ఆహారం అందిస్తున్నారు. స్వయం సహాయక గ్రూపులు ద్వారా భోజనం వండించి.. పంచాయతీల ద్వారా ఆపన్నులకు అందిస్తున్నారు. పట్టణాల్లోనూ ప్రతి రోజూ వేలాది మందికి ఆహారం పెడుతున్నారు. భోజనం తయారు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 69 ఆహార్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో వేలాది మంది ప్రతి రోజూ భోజనం తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఇతర రాష్ట్రాలలో మాదిరిగా వలస కార్మికులు బతికేందుకు వీలు లేక తమ సొంత ప్రాంతాలకు కాలినడకన వెళ్లే పరిస్థితి ఒడిశాలో లేకపోవడం విశేషం. మనసుంటే మార్గముంటుందని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ పాలన చూస్తే అర్థమవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి