క్రికెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వన్డే వరల్డ్ కప్‌ను భారత్ రెండుసార్లు ముద్దాడింది. తొలిసారి లెజెండ్ కపిల్ దేవ్ నేతృత్వంలో 1983లో ప్రపంచ కప్‌ను సాధించిన టీమిండియా.. 2011లో రెండోమారు కప్‌ను ఒడిసిపట్టింది. మొదటి ప్రపంచ కప్ తర్వాత తిరిగి వరల్డ్ కప్ నెగ్గేందుకు భారత్‌కు 28 సంవత్సరాలు పట్టింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని టీమిండియా స్వదేశంలో కప్పును సగర్వంగా అందుకున్న క్షణాలను ఎవ్వరూ అంత సులువుగా మర్చిపోలేరు. ప్రపంచ కప్ నెగ్గాలనే కోరికతో చివరిసారి మెగా టోర్నీలో పాల్గొన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ డ్రీమ్ ఆ ఏడాదితో తీరిపోయింది.
2011 వరల్డ్ కప్ నెగ్గడంలో టీమిండియాలో చాలా మంది ప్లేయర్లు కీలకపాత్ర పోషించారు. ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ దగ్గర నుంచి ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్, గంభీర్, సురేష్ రైనా, ఎంఎస్ ధోని వరకు అద్భుతంగా రాణించారు. అలాగే బౌలర్లు జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్ కూడా ప్రత్యర్థులను వణికించారు. ఇలా అందరూ సమష్టిగా రాణించడం వల్లే ఆ ఏడాది భారత్ కప్పు కొట్టింది. కానీ ఈ కప్ క్రెడిట్ మాత్రం ఎక్కువగా ఎంఎస్ ధోనీకే వచ్చిందని గంభీర్, హర్భజన్ సహా పలువురు వెటరన్ క్రికెటర్లు అంటుంటారు. తాజాగా సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ కూడా ఈ వ్యాఖ్యలతో ఏకీభవించాడు.
2011లో టీమిండియాకు ఒక్క ధోని వల్లే ప్రపంచ కప్ రాలేదని డివిలియర్స్ అన్నాడు. అసలు వరల్డ్ కప్ అనేది ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రదర్శన వల్లో రాదని.. దానికి అందరి సమష్టి కృష్టి అవసరమని చెప్పాడు. ‘క్రికెట్ అనేది టీమ్ గేమ్. అందరూ ఓ జట్టుగా కలసికట్టుగా ఆడాలి. ఇందులో ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్లూ కలిసే ఉంటాయి. 2011లో భారత్ వరల్డ్ కప్ గెలిచింది. కానీ ఎంఎస్ ధోని ఒక్కడే కప్‌ను అందించలేదు. 2019లో బెన్ స్టోక్స్ ఒక్కడే ఇంగ్లండ్‌ను విజేతగా నిలపలేదు. టీమ్‌గా ఆడి ఛాంపియన్స్‌గా నిలిచారు. అందరూ ఇలాగే ఆలోచించాలి. రాబోయే వరల్డ్ కప్‌లో టీమిండియా కచ్చితంగా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: వ్యక్తిగత రికార్డులు ఏం చేసుకోవాలి.. రోహిత్‌నే చూడండి: షకీబ్