iDreamPost

కరోనా పై పోరు : వారి చొరవ అసామాన్యం

కరోనా పై పోరు : వారి చొరవ అసామాన్యం

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లో ఉన్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అడుగు బయట పెట్టేందుకే వణికిపోతున్నారు. తుమ్మినా దగ్గినా భయంతో వణికిపోతున్నారు. పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్లకు ఆ బజార్ లో వాళ్లకు కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయి అంటేనే చాలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అలాంటిది ఈ ప్రపంచంలో కొంత మంది కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్నారు. వారే డాక్టర్లు. వారికి అండగా ఉండేందుకు మరి కొంతమంది సిద్ధమయ్యారు. వారే కాబోయే డాక్టర్లు నర్సులు.

కరోనా భయంతో ప్రజలందరూ వణికిపోతుంటే వైద్య విద్యార్థులు, నర్సులు మాత్రం దానిపై పోరాటం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు వారు స్పందించారు. ఆపత్కా లంలో మనకెందుకులే అనుకోకుండా వారు చూపిన చొరవ అసామాన్యమైనది. కరోనాపై పోరాడేందుకు వాలంటీర్లు కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన ఇవ్వగానే రెండు రోజుల్లో ఎనిమిది వేల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ప్రతిక్షణం ప్రమాదపు అంచున పనిచేయాల్సిన పరిస్థితుల్లోనూ వారు వెనుకడుగు వేయలేదు.

విద్యాభ్యాసం లో ఉన్న వైద్యులకు, నర్సులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా శిక్షణ ఇస్తోంది. వారి సేవలని క్వారంటైన్ కేంద్రాలలో ఉన్న వారికి ప్రాధమిక వైద్యం అందించేందుకు ఉపయోగించుకోనుంది. ఇప్పటికే దశలవారీగా వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రచించింది. నిపుణులు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి