iDreamPost

ద్రోహం, మోసం – చంద్ర‌బాబుపై ఎన్‌టిఆర్ వెల్లబుచ్చిన ఆవేద‌న..!

ద్రోహం, మోసం – చంద్ర‌బాబుపై ఎన్‌టిఆర్ వెల్లబుచ్చిన ఆవేద‌న..!

సొంత మామ‌కు ద్రోహం చేసి…ఆయ‌న చేతుల్లోంచి పార్టీని లాక్కున్నారనే విమర్శలు ఎదుర్కుంటున్న చంద్రబాబు, నేడు తానే టిడిపి స్థాపించినంత ప్ర‌చారం చేసుకొంటున్నారు. తాను న‌మ్మిన‌వాళ్లే మోసం చేశారనే ఆవేద‌న‌తోనే ఎన్‌టిఆర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అలాంటి మ‌హానీయుడి మృతికి కార‌ణ‌మైన వ్యక్తిగా నిందను మోస్తున్న చంద్ర‌బాబు ప్రతి ఏటా ఎన్‌టిఆర్ జ‌యింతి పేరుతో ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనేది ఎన్.టి.ఆర్ అభిమానుల మాట, రామారావు ఆద్వర్యంలో ఏర్పడిన టిడిపి ప్ర‌భుత్వాన్ని హోటల్ వైస్రాయి ఉదంతం నడిపి 1995 ఆగ‌స్టులో కూల‌దోసి…ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హ‌స్యం చేసి…ప్ర‌జ‌ల తీర్పుకు భిన్నంగా మోసం, ద్రోహం చేశారంటూ చంద్ర‌బాబుపై నంద‌మూరి తార‌క రామారావు (ఎన్‌టిఆర్‌) వెలిబుచ్చిన ఆవేదన..ఆయ‌న మాటల్లోనే…

”నాకు ఏ విధంగా ద్రోహం చేశారో..నా వాళ్లు అనేవాళ్లు ఏ విధంగా మోసం చేశారో ప్ర‌జ‌ల‌కు తెలుసు..అయినా నేను చెప్ప‌టం నాధ‌ర్మం. నాక‌ర్త‌వ్యం” . ”ప్ర‌జ‌లు న‌న్ను న‌మ్మారు. నాకు ఓట్లు వేశారు. చంద్ర‌బాబు మాట మాత్ర‌మే తెలుసు. కానీ ఆయన ఎప్పుడు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు. ప్ర‌జ‌ల‌ను ఓట్లు అడ‌గ‌లేదు. టిడిపి గెలుపులో కూడా ఆయ‌న పాత్ర లేదు. ఆయ‌న‌కు తెలిసింద‌ల్లా ఒక్క‌టే..ఎవ‌రిని ఎలా లోబ‌రుచుకోవాలో మాత్ర‌మే తెలుసు. ఏ ప్ర‌లోభంతో ఎవ‌రిని త‌నవైపు తిప్పుకోగ‌ల‌నో అని నిరంత‌రం ఆలోచిస్తాడు. ఆ విధంగానే ప్ర‌య‌త్నించాడు. మోసం చేసి వాళ్ల‌ను త‌న‌వైపు తిప్పుకున్నాడు. నా వ‌ద్ద ఉన్న వారిని కూడా లాక్కొన్నాడంటే..ఏ విధ‌మైన ప్ర‌లోభాల‌తో లోబ‌ర్చుకున్నాడో అర్థం అవుతుంది. ఇందులో ప్ర‌లోభం పెట్టిన చంద్ర‌బాబుదే త‌ప్ప‌ని, ఆయ‌నను న‌మ్మినందుకు మోసం చేశాడు” అని ఆవేద‌న‌ వెలిబుచ్చారు.

”నా ప్ర‌భుత్వాన్ని చంద్ర‌బాబు అప‌హ‌స్యం చేశాడు. చంద్ర‌బాబు చేసిన దుర్మార్గాన్ని దుర్నీతిని దుర్వినియోగాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు ఐఎఎస్‌ల‌ను కూడా ఉప‌యోగించుకున్నాడు. అందుకు ఎన్నో ఎత్తులు వేసాడు , ఎందరికో తొత్తులుని కూడా చేశాడు”. ”తెలుగు జాతికి అవ‌మానం జ‌రిగింది. ద్రోహం జ‌రిగింది. ఇంత ఘాతుకానికి చంద్ర‌బాబు పాల్ప‌డ్డాడు. రామారావుగారి మీద ప‌గ సాధించాల‌నే కార్యక్ర‌మ‌మే గాని, ప్ర‌జ‌ల గురించి చంద్ర‌బాబు ఏనాడూ ఆలోచించ‌లేదు” అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

”ఆయ‌న కాంగ్రెస్ నుంచి వ‌చ్చాడు. 1983లో చంద్ర‌బాబు కాంగ్రెస్‌లో ఉన్నాడు. నేను తెలుగుదేశాన్ని స్థాపించాను. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయాడు. సామాన్య‌మైన అభ్య‌ర్థి చేతుల్లో ఓట‌మి చెందాడు. చివ‌రికి త‌న స్థానం , త‌ను ఉన్న‌టువంటి నియోజ‌కవ‌ర్గాన్ని వ‌దిలిపెట్టి..వేరే ప్రాంతానికి వెళ్లి అక్క‌డ పోటీ చేశాడు. అక్క‌డ నుంచి వ‌చ్చాడు. ప్ర‌జాస్వామ్యంలో తాను ప్ర‌జా ప్ర‌తినిధిగా వ‌చ్చాన‌ని చెప్ప‌డానికి ఆయ‌న‌కు అర్హ‌త లేదు. ఒక యువ‌కుడుగా ఉన్న చంద్ర‌బాబును ప్రోత్స‌హించాల‌ని ఉద్దేశ్యంతో, ఆయ‌న మంచి ప‌నులు, సంక్షేమ కార్యక్ర‌మాలు చేయించాల‌ని అంద‌రూ వద్దన్నా నేను ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకున్నాను. ఆ ర‌కంగా గౌర‌వించాం” అని వివ‌రించారు.

”చంద్ర‌బాబు న‌న్ను తిట్టిన‌ట్లు అనేక మంది చెప్పినా నేను ప‌ట్టించుకోలేదు. మీరు మాకు దేవుడు లాంటి వారు…అలాంటి మిమ్మల్ని తిట్ట‌డాన్ని మేము స‌హించ‌మ‌ని ఆనాడు టిడిపిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియ‌ర్ నేత‌లు నావద్ద ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ నేను వాళ్ల‌తో యువ‌కుడు చూద్దాం…ప్రోత్స‌హిద్దాం అని అన్నాను. ఆ విధంగా చంద్ర‌బాబును ప్రోత్స‌హించాను , ఆయ‌న బాధ్య‌త ఏంటీ తెలుసుకోవాలి క‌దా. మ‌హా వృక్షం(ఎన్‌టిఆర్‌)పై ఆధార‌ప‌డి ఉన్న ఒక ప‌క్షి (చంద్ర‌బాబు) ఎలా ఉండాలి? ఆ మ‌హావృక్షాన్నే న‌రికితే నీ బ‌తుకు ఏమ‌వ్వుతుందో గ్ర‌హించాలి. ముఖ్య‌మంత్రి అని అనుకుంటున్న ఆయ‌న ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో జ్ఞానంతో క‌ళ్లు తెరిచి చూడాలి. మాకు ఇలాంటి బిడ్డ క‌ల‌గ‌కూడ‌దు. మా కుటుంబంలో ఇలాంటి వాడు ఉండ‌కూడదని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు. ఇంత నీచ‌త్వానికి ఎందుకు ఒడిగ‌ట్టాల్సి వ‌చ్చింది? కేవ‌లం డ‌బ్బు కోస‌మా? అధికారం కోస‌మా? నాలాంటి వాడిని మోసం చేసి మాయ చేయ‌డం కోసమా?” అని ఆయ‌కు జ‌రిగిన ద్రోహాన్ని వివ‌రించారు.

”ఇది నాకు తెలియ‌క కాదు..ఈ ఘాతుకం జ‌రుగుతుంద‌ని నాకు తెలుసు కూడా. ఆనాడు తలుపులు మూసుకొని ఏ విధంగా గోడ చాటున మంత‌నాలు జ‌రిగాయో అంద‌రికి తెలుసు. నేను విశాఖ‌ప‌ట్నంలో ఉన్న‌ప్పుడు నాకు తెలియ‌కుండా ఏ విధంగా చ‌ర్చలు జ‌రిపాడో..ఎక్క‌డ బ‌స చేశాడో..ఏ హోట‌ల్‌లో ఉన్నాడో అంద‌రికీ తెలుసు. ఎవ‌రి మ‌ద్ధ‌తుతో ఏ విధంగా ఆలోచ‌న‌లు చేశారో తెలుసు. అందులో ఒక పత్రిక య‌జ‌మాని కూడా చేయిక‌లిపే దుర‌దృష్టం వ‌చ్చిందంటే…ఏ విధ‌మైన కుతంత్రం నాపై జ‌రిగిందో ప్ర‌జ‌ల‌కు తెలుసు” అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

”ఒక రోజు ఎర్నంనాయుడు నాతో పాటు వ‌స్తే ఆయ‌న‌ను లాగేసేందుకు చంద్ర‌బాబు కుట్ర ప‌న్నాడు. అప్ప‌డు ఎర్నంనాయుడు నాకు అన్న లాంటి ఎన్‌టిఆర్‌ను వ‌దిలి రాను అని చెప్పాడు. ఎర్నంనాయుడు అలాంటి విశ్వాసం చూపించాడు. నా కులం కాని, నా ఇంట్లో మ‌నిషి కాని ఎర్నంనాయుడు ఇలా ఉంటే..నా క‌న్న కూతురిని ఇచ్చి పెళ్లి చేసిన చంద్ర‌బాబు ఎలా వ్య‌వ‌హ‌రించాడు? త‌ండ్రిలాంటి వాడిని ఎలా మోసం చేశాడో చంద్ర‌బాబు మ‌న‌సులో ఆలోచించాల‌ని అడుగుతున్నా” అని అన్నారు.

”50 కార్లు పెట్టి త‌న ముఠాతో స‌భ పెట్టి చంద్ర‌బాబు జై చంద్ర‌బాబు జై ఎలా అనిపించుకున్నాడో స‌మాధానం చెప్పాలి. నాకు కాదు. ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని అడుగుతున్నాం. ఎందుకంటే ప్ర‌జ‌లు న‌న్ను న‌మ్మారు. తెలుగుదేశమంటే ఎన్‌టిఆర్ అనుకున్నారు. అందుకే ఓట్లు వేసి గెలిపించారు. క‌నుక స‌మాధానం నాకు కాదు..జ్ఞాన‌ముంటే ప్ర‌జ‌ల‌కే స‌మాధానం చెప్పాలి. ఈ విధ‌మైన ద్రోహం జ‌రిగింది” అని తెలిపారు.

”నా వాళ్లంతా (పార్టీ నేత‌లు) నావ‌ద్ద‌కు వ‌చ్చి… చంద్ర‌బాబు క్యాంప్ పెట్టాడు క‌దా…మ‌నం కూడా పెట్టి మ‌న‌వాళ్ల‌ను మ‌నం తెచ్చుకుందామ‌ని అన్నారు. కానీ నాకు ఇష్టం లేదు. ఎమ్మెల్యేల‌ను ప‌శువుల్లా బంధించ‌డం నాకు ఇష్టం లేద‌ని చెప్పాను. వారికి కావాలంటే నావ‌ద్ద ఉంటారు. లేక‌పోతే వెళ్తారు. అంతేత‌ప్ప ఎమ్మెల్యేల‌ను నిర్బంధించే దుర్విధానానికి నేను పాల్ప‌డ‌ను. డ‌బ్బు ఇచ్చి కొనుక్కొనేందుకు నేను రాను అని చెప్పాను. డ‌బ్బు ఇచ్చి కొనుక్కొవ‌డమా? ఆనాడు డ‌బ్బులిస్తేనే నేను వారిని ఎమ్మెల్యే అభ్య‌ర్థులుగా నియ‌మించానా? డ‌బ్బు ఇస్తేనే వారిని త‌మ్ముళ్లు అనుకున్నానా? డ‌బ్బుకు మించినది నా మ‌న‌సులో ఉంది. అది నేను కోరుకుంటున్నాను. అంతేత‌ప్ప డ‌బ్బు ఇచ్చి వారంద‌రిని మాయ చేసి ఒక ద‌గ్గ‌ర బంధించ‌డం నాకు ఇష్టం లేదు. ఆ ప‌ని నేను చేయ‌ను. అది ప్ర‌జాస్వామ్యానికి మంచిది కాదు” అని వివ‌రించారు.

”నా వెనుక కుట్ర జ‌రుగుతుంద‌ని నాకు తెలిసినా..నేను ఆ త‌ప్పుడు ప‌నులు చేయ‌లేన‌ని చూస్తూ ఉన్నాను. అయితే వాళ్ల‌లో మాన‌వ‌త్వ‌మైనా ఉంటుందేమోన‌ని వేచి చూశాను. మేము మాన‌వులం కాదు..ప‌శువులం. న‌మ్మిన వాళ్ల‌కు ద్రోహం చేస్తాం…న‌మ్మిన వాళ్ల గొంతు కోస్తామ‌ని నిరూపించుకున్న ఘాతుకులు వారు. చ‌రిత్ర మ‌రిచిపోదు. చంద్ర‌బాబు తండ్రిలాంటి ఎన్‌టిఆర్‌కు ఏవిధంగా ద్రోహం చేశాడో…కేవ‌లం ప‌ద‌వి కోసం ఏ విధంగా ఆత్మ‌ను అమ్ముకున్నాడో…ఏవిధంగా మాన‌వ‌త్వాన్ని చంపుకున్నాడో…అనేది శాశ్వ‌తంగా ఉంటుంది. మ‌నిషి పోతాడేమో కానీ, ప్ర‌జ‌ల మ‌నసు పోదు…వారి ఆలోచ‌న పోదు…అది శాశ్వ‌తంగా ఉంటుంది. నాకు జ‌రిగిన ఈ అవ‌మానం స‌హించ లేక‌పోయాను” అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

”ఎన్ని మంచి ప‌నులు చేద్దామ‌నుకున్నా ఎన్నో అవ‌రోధాలు వ‌స్తునే ఉంటాయి. ఎంతో మంది స్వార్థ ప‌రుల‌ను ఎదుర్కొవ‌ల్సి వ‌స్తుంది. స్వార్థ‌ప‌రుల స్వార్థ ఆలోచ‌న‌ల‌తో..వారి ద‌గాకోరు విధానాల‌తో…వారి దుష్ట ప్ర‌య‌త్నంతో…వారి మోసంతో ప్ర‌భుత్వం కూల్చారు. మొఘ‌ల్ రాజ్యంలో తండ్రిని జైల్లో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు. రాజ్యాధికారం కోసం అన్న‌ను చంపిన ఔరంగ‌జేబు లాంటివారు ఉన్నారు. అలాంటి దుర‌దృష్ట‌క‌ర‌మైన విధానం వంద‌ల సంవ‌త్స‌రాల త‌రువాత, తెలుగు జాతి చ‌రిత్ర‌లో క‌నీవిని ఎరగ‌ని ఘ‌ట‌న ఇప్పుడు మ‌న రాష్ట్రంలో జ‌రిగింది. ఇది మ‌న దుర‌దృష్టం. ఆ చిన్న‌బోయిన త‌నాన్ని మ‌న రాష్ట్రం అనుభ‌వించ‌డ‌మ‌నేది నేను చేసుకున్న పాపం” అని పేర్కొన్నారు.

”ఎవ‌రైతే తెలుగు జాతిని కించ‌ప‌రిచారో…ఎవ‌రైతే జాతికి చిన్న‌తనం తెచ్చారో…అవ‌మాన‌క‌రంగా వ్య‌వ‌హ‌రించారో…వారే రామారావుగారు లేక‌పోతే మా పార్టీ లేద‌ని శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌చారంలో అన్నారు. ఆయ‌న వ‌ల్ల‌నే పార్టీ న‌డుస్తుంది. మేము ఆయ‌న వెన‌కాల ఉన్నాం. క‌నుక ఆయ‌నే మా నాయ‌కుడు అని చెప్పిన వారే కొద్ది రోజుల్లోనే ఎందుకు మారారంటారు? అల్లుడుకి అర్హ‌త‌ని బ‌ట్టే ప‌ద‌వి ఇచ్చాను. అయితే దురుద్దేశ్యంతో…చెడుబుద్ధితో సొంత మామ‌కే ద్రోహం చేసే కిరాత‌కుడు అవుతాడని..ద్రోహుల‌వుతార‌ని నేను అనుకోలేదు” అని చంద్ర‌బాబు మోసాన్ని తెలిపారు.

”ప‌థ‌కం ప్ర‌కారమే ప్ర‌భుత్వాన్ని కూల్చారు. ఈ జాడ్యం ఎప్పుడో పుట్టింది. రంగులు మార్చ‌డ‌మనేది…ప‌దవీ కాంక్ష అనేది వారి ఎత్తుల్లోనే ఉంది. చంద్ర‌బాబు మొద‌ట కాంగ్రెస్‌లో ఉన్నాడు..అక్క‌డ ప‌రాజ‌యం పొందిన త‌రువాత తెలుగుదేశంలోకి వ‌చ్చాడు. నేను మీ విధానాల‌కు పూర్తిగా అంకితం అవుతాన‌ని మాట ఇచ్చాడు. కానీ ఆయ‌న మ‌న‌సులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. త‌న గ్రూపును పెంచుకుంటూ వ‌చ్చాడు. అంద‌రికి ఆయ‌న డబ్బు ఇచ్చాడు. ఎన్నిక‌లకు ముందే ప్ర‌ణాళిక వేశాడు. అయితే ఆ ఎన్నిక‌ల్లో టిడిపికి 223 స్థానాలు రావ‌డంతో ఏమీ చేయ‌లేకపోయాడు. అదే 130..135..140 స్థానాలు వ‌చ్చి ఉంటే…అప్ప‌డే న‌న్ను ముఖ్య‌మంత్రి అవ్వ‌నిచ్చేవాడు కాదు. అయితే ముఖ్య‌మంత్రి కావాల‌నే ఆశ మాత్రం ఆయ‌న మ‌న‌సులో చావ‌లేదు. తెలుగు జాతి ప్ర‌గ‌తి కోసం టిడిపి ఉంటుంద‌ని అనుకున్నాను. టిడిపిలో గ్రూపులు వ‌స్తాయ‌ని అనుకోలేదు. కానీ చంద్ర‌బాబు టిడిపిలో గ్రూపులు త‌యారు చేశాడు” అని వివ‌రించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి