iDreamPost

నాయ‌క‌త్వం లేమితో కొట్టిమిట్టాడుతున్న టీడీపీ

నాయ‌క‌త్వం లేమితో కొట్టిమిట్టాడుతున్న టీడీపీ

తెలుగుదేశం పార్టీకి ఒక‌ప్పుడు బ‌ల‌మైన పునాదులున్న ఉత్త‌రాంధ్ర‌లో ఇప్పుడు త‌ల‌నొప్పిగా మారుతోంది. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఆపార్టీ పునాదులు కూలిపోతున్నాయ‌నే అభిప్రాయం కనిపిస్తోంది. మొన్న‌టి సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత పార్టీ పూర్తిగా నిస్తేజంలోకి మ‌ళ్లింది. న‌డిపించే నేత లేక‌పోవ‌డంతో తీవ్రంగా త‌ల్ల‌డిల్లిపోతున్న పార్టీకి తాజా ప‌రిణామాలు మ‌రింత శిరోభారం అవుతున్నాయి. ఓ వైపు సీనియ‌ర్ నేత‌లు క్రియాశీల‌కంగా లేక‌పోవ‌డం, మ‌రోవైపు రాజ‌ధాని ఉద్య‌మం కార‌ణంగా పూర్తిగా కార్న‌ర్ కావ‌డంతో తెలుగుదేశం పార్టీకి ఎటూ పాలుపోని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ప‌రిస్థితుల్లో స్థానిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌ టీడీపీ నేత‌ల్లో కొంద‌రు చేజారిపోయే ప్ర‌మాదం దాపురించిన‌ట్టు క‌నిపిస్తోంది.

విజ‌య‌న‌గ‌రం జిల్లా ఒక‌నాడు టీడీపీకి కంచుకోట‌గా ఉండేది. క‌ష్ట‌కాలంలో కూడా తొలుత ఎన్టీఆర్ నుంచి చంద్ర‌బాబు హ‌యం వ‌ర‌కూ సైకిల్ కి మంచి ఆద‌ర‌ణ క‌నిపించేది. కానీ గ‌త ఎన్నిక‌ల్లో సంపూర్ణ ప‌రాజ‌యం పాల‌య్యింది. మొత్తం 9 అసెంబ్లీ స్థానాల‌తో పాటు ఎంపీ సీటుని కూడా టీడీపీ కోల్పోయింది. దాంతో తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర నిరాశ అల‌ముకుంది. ఐదేళ్ల పాటు అధికారం అనుభ‌వించిన అనేక‌మంది నేత‌లు క్ర‌మంగా టీడీపీని వీడుతున్నారు. ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో ప‌లువురు నేత‌లు పాల‌క‌ప‌క్షం వైపు చేరిపోతున్నారు. అదే స‌మ‌యంలో అమ‌రావ‌తి ఉద్య‌మం టీడీపీని తీవ్ర ఇర‌కాటంలోకి నెట్టింది. రాజ‌ధానిని ఉత్త‌రాంధ్ర‌కు త‌ర‌లిస్తుంటే చంద్ర‌బాబు అడ్డంకులు సృష్టిస్తున్నార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ఉత్త‌రాంధ్ర అభివృద్ధిని ఆయ‌న అడ్డుకుంటున్నార‌నే ప్ర‌చారం అధికార పార్టీ చేస్తోంది. విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాల మ‌ధ్య‌లో రాజ‌ధాని వ‌చ్చే అవ‌కాశం ఉన్న త‌రుణంలో అమ‌రావ‌తి కోసం చంద్రబాబు ప‌ట్టుబ‌ట్ట‌డాన్ని టీడీపీ నేత‌లు కూడా జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇప్ప‌టికే అమ‌రావ‌తి ఉద్య‌మానికి సంఘీభావంగా శ్రీకాకుళంలో కూడా అచ్చెన్నాయుడు వంటి వారు ఒక‌టి రెండు కార్య‌క్ర‌మాల పేరుతో రోడ్డెక్కినా విజ‌య‌న‌గ‌రంలో మాత్రం తెలుగుత‌మ్ముళ్లు క‌ద‌ల‌లేని ప‌రిస్థితి ఉంది.

సుదీర్ఘ‌కాలం పాటు జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గ‌జ‌ప‌తిరాజు అనారోగ్యం పాల‌య్యారు. రాజ‌కీయంగా క్రియాశీల‌కంగా క‌నిపించ‌డం లేదు. వ‌య‌సు రీత్యా వ‌స్తున్న స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న స‌త‌మ‌తం అవుతున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఆయ‌న పూర్తిగా తెర‌మ‌రుగ‌య్యారు. ఇక మాజీ మంత్రి సుజ‌య కృష్ణ‌రంగారావు కూడా బొబ్బిలికి ప‌రిమితం అవుతున్నారు. పెద్ద‌గా పార్టీ వ్య‌వ‌హారాల మీద దృష్టి పెట్ట‌లేక‌పోతున్నారు. ఇక ఎమ్మెల్సీ ద్వార‌పురెడ్డి జ‌గ‌దీష్ వంటి వారు కూడా పార్టీ వ్య‌వ‌హారాల మీద పెద్ద‌గా శ్ర‌ద్ధ‌పెట్ట‌లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి ఇంకా ప‌లువురు నేత‌లు కోలుకున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. దాంతో కార్య‌క‌ర్త‌లు త‌మ దారి తాము చూసుకునే దిశ‌గా సాగుతున్నారు. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికే కీల‌క నేత‌లు కొంద‌రు వైసీపీలో చేరిపోయారు. ఇంకా ప‌లువురు నేత‌లు అదే దిశ‌లో ఆలోచ‌న చేస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

సాధార‌ణ ఎన్నిక‌ల ముంగిట టీడీపీకి ఈ చిక్కులు పెద్ద స‌మ‌స్య‌గా మారుతున్నాయి. ఒక్క అసెంబ్లీ సీటు కూడా చేతిలో లేని ప‌రిస్థితుల్లో క‌నీసం గ్రామ‌, ప‌ట్ట‌ణ స్థాయిలో ప్ర‌భావం చూపాల‌ని ఆశిస్తుంటే సీన్ సానుకూలంగా క‌నిపించ‌డం లేద‌ని ఆపార్టీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకోవాల్సి వ‌స్తోంది. దాంతో జిల్లాలో తెలుగుదేశం పూర్వ వైభ‌వం మాట అలా ఉంచి, క‌నీసం ప్ర‌తిప‌క్ష స్థానంలో ప‌ట్టు నిలుపుకుంటుందా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంది. ఓవైపు బొత్సా, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణీ వంటి వారి సార‌ధ్యంలో జిల్లాలో పాల‌క‌పార్టీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంటే విప‌క్షం మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి