iDreamPost

సీఎం వైఎస్‌ జగన్‌పై నీతి అయోగ్‌ ప్రశంసల జల్లు

సీఎం వైఎస్‌ జగన్‌పై నీతి అయోగ్‌ ప్రశంసల జల్లు

ప్రజా సంక్షేమం, అభివృద్ధి, మెరుగైన పరిపాలనతో ప్రజలకు సౌకర్యవంతమైన జీవనాన్ని అందిస్తే.. గుర్తింపు దానంతటకదే వస్తుందని చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక, వేగవంతమైన పరిపాలనపై కేంద్రం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నాయి. తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోళ్లలో జగన్‌ సర్కార్‌ అవలంభిస్తున్న విధానాన్ని ఇటీవల నీతి అయోగ్‌ ప్రశంసించగా.. తాజాగా భారత్‌ నెట్‌ ప్రాజెక్టు అమలుపై సీఎం వైఎస్‌ జగన్‌ చేపడుతున్న చర్యలను కొనియాడింది.

డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారత్‌ నెట్‌ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. ప్రతి గ్రామానికి ఇంటర్‌నెట్‌ సేవలు అందించడం, పరిపాలనను డిజిటలైజేషన్‌ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ రోజు నీతి అయోగ్‌ సమావేశంలో భారత్‌ నెట్‌ ప్రాజెక్టును ఏపీలో ఎలా అమలు చేస్తోంది సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. అంతేకాకుండా భారత్‌నెట్‌ ద్వారా తాము ఏపీలో ఏం చేయదల్చుకున్నామో సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేయబోతున్నామని, ప్రతి గ్రామానికి నాణ్యమైన, అవాంతరాలు లేని ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించబోతున్నామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందించబోతున్నామని, ఇంటినుంచే పని విధానాన్ని ప్రోత్సహించబోతున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ను నీతి అయోగ్‌ రీ ట్విట్‌ చేసింది. భారత్‌నెట్‌ ప్రాజెక్టు అమలుకు సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. ప్రతి గ్రామానికి ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందించాలన్న సీఎం జగన్‌ ఆలోచనను కొనియాడింది. గతంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనను ప్రజల వద్దకు తెచ్చేలా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను కొనియాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనను అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా ఉందని కితాబిచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి