iDreamPost

ఆర్ధిక ప్యాకేజీ వివరాలు వెల్లడించిన నిర్మల సీతారామన్

ఆర్ధిక ప్యాకేజీ వివరాలు వెల్లడించిన నిర్మల సీతారామన్

దేశ ఆర్థిక వృద్ధి పెంచి, స్వయంసమృద్ధి భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. నవభారత్ నిర్మాణమే ఆత్మ నిర్భర భారత్ లక్ష్యమని చెప్పారు. భారత స్వయం పూర్వకంగా ఎదగాలనేదే తమ లక్ష్యమన్నారు. వివిధ స్థాయిల్లో సంప్రదించాక ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని తెలిపారు. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్ అనే ఐదు మూల సూత్రాల ఆధారంగా ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ ప్రకటించారని తెలిపారు. నిన్న మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కొద్దిసేపటి క్రితం వెల్లడించారు.

నగదు లభ్యత పెంచడమే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆర్ధిక ప్యాకేజీలో భాగంగా 15 రకాల ఉద్దీపన చర్యలను ప్రకటిస్తున్నామని తెలిపారు.

సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమలకు మూడు లక్షల కోట్ల రూపాయల రుణాలు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ రుణాలకు కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందని చెప్పారు. అక్టోబర్ వరకు ఈ రుణాలను అందిస్తామని తెలిపారు. ఈ రుణాలకు నాలుగేళ్ల కాలపరిమితి ఏడాది మారటోరియం ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగా 6 రకాల చర్యలు చేపడతామని తెలిపారు.

ఆగస్టు 2020 వరకు చిన్న మధ్య తరగతి సంస్థలు తమ ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ కట్టాల్సిన అవసరం లేదని నిర్మల సీతారామన్ తెలిపారు. ఈ మూడు నెలల పిఎఫ్ ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఈ మొత్తం 2,500 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డిస్కమ్ లకు 90 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ప్రత్యక్ష పన్నుదారులకు ఊరట కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చెల్లిస్తున్న టీడీఎస్ లో 25 శాతం కోత విధిస్తున్నట్లు చెప్పారు. తద్వారా 50 వేల కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లో ఉంటాయని వివరించారు.

ఇవాల్టి నుంచి ఒక్కొక్కటిగా ఆర్థిక ప్యాకేజీ వివరాలను వెల్లడిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి