iDreamPost

భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన చారిత్రక ఘట్టానికి తొమ్మిదేళ్లు

భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన చారిత్రక ఘట్టానికి తొమ్మిదేళ్లు

2011 ఏప్రిల్ 2 మధ్యాహ్న వేళ క్రికెట్ ప్రేమికులతో కిటకిటలాడుతున్న ముంబైలోని వాంఖేడే స్టేడియం.భారత క్రికెట్ అభిమానులలో నరాలు తెగేటంత ఉత్కంఠత.ఎక్కడో మనసులో ఏదో మూలలో గెలుపుపై సంశయం.1996 ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్‌లో భారత్‌పై శ్రీలంక ఆధిపత్యం వహించిన ఆనాటి దృశ్యం కళ్ళ ముందు మెదిలాడగా గెలుపుపై బెంగ ఒకవైపు.కానీ భారత్-శ్రీలంక జట్లు ఐసీసీ టోర్నమెంట్ చరిత్రలో ఫైనల్‌లో తలపడటం మొదటిసారి కావడంతో గెలుపు భారత్‌దే అన్న ధీమా మరోవైపు.

అయితే సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కోట్లాది అభిమానుల ఆకాంక్షలను నెరవేరుస్తూ సొంతగడ్డపై భారత్ రెండోసారి ప్రపంచ విజేతగా అవతరించింది.ధోనీసేన అభిమానులను ఆనంద డోలికలలో తేలుస్తూ ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌లో విజేతగా నిలిచిన ఆతిథ్య దేశంగా టీమిండియా రికార్డు సృష్టించింది.ఇంకా సొంత అభిమానుల ముందు 1996లో ఈడెన్ గార్డెన్స్‌లో ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో సింహాళీయుల చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.

వాంఖేడే స్టేడియంలో ఫైనల్స్‌ ఆడటానికి ముందు భారత్, శ్రీలంక జట్లు ప్రపంచ కప్ ఫైనల్‌కు చెరో రెండు సార్లు చేరాయి.1983లో వెస్టిండీస్‌పై గెలిచి విశ్వవిజేతగా నిలిచిన భారత్,2003లో ఆస్ట్రేలియాపై అంతిమ పోరులో ఓడిపోయారు.తన రెండు వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో శ్రీలంక, కంగారులతోనే తలపడి 1996లో విజేత నిలిచి,2007లో అపజయం పొందింది.ఈ మ్యాచ్‌కు ముందు ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భారత్, శ్రీలంక జట్లు ముఖాముఖి ఏడుసార్లు తలపడగా టీమిండియా రెండు మ్యాచ్‌లలో గెలుపొంది నాలుగింటిలో పరాజయం పొందగా,ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

ఇరు జట్లు లీగ్,క్వార్టర్, సెమీ ఫైనల్స్ లాంటి మూడు దశలను దాటి ఫైనల్‌కు చేరుకున్నాయి.లీగ్ దశలో దక్షిణాఫ్రికాతో,ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్‌లను టీమిండియా గెలిచి ఫైనల్‌లో అడుగు పెట్టింది.పాకిస్థాన్‌తో జరిగిన ఒక లీగ్ మ్యాచ్ మినహా మిగతా అన్ని మ్యాచ్‌లు గెలిచిన శ్రీలంక ఫైనల్‌ బరిలో దిగింది.

టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేపట్టిన లంక:

టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకోగా తొలి పవర్ ప్లేలో తరంగ వికెట్‌ను కోల్పోయి 30 పరుగులు సాధించింది.రెండో పవర్ ప్లే(11-15) ముగిసిన తర్వాత 17 ఓవర్‌లో 49 బంతులలో 33 పరుగులు సాధించిన తిలక్ రత్న దిల్షాన్‌ను హర్భజన్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.ఈ దశలో కెప్టెన్ కుమార్ సంగక్కరతో కలిసి మహేలా జయవర్ధనే మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించారు.సంగక్కర 67 బంతులలో 48 పరుగులు సాధించి అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు.

అజేయ శతకంతో లంకను ఆదుకున్న జయవర్ధనే:

శ్రీలంక ఇన్నింగ్స్ చివరలో జయవర్ధనే, కులశేఖర(32 రన్స్)తో కలిసి ఆరో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.ఆల్‌రౌండర్‌ తిసారా పెరెరా కేవలం తొమ్మిది బంతులలో 3 బౌండరీలతో నాటౌట్‌గా 22 పరుగులు చేశాడు.ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో నిలబడిన మహేలా జయవర్ధనే 88 బంతులలో 13 ఫోర్లు బాది 103 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు సాధించింది.

లక్ష్యఛేదనలో తొలి పవర్ ప్లేలోనే ఓపెనర్‌లను కోల్పోయిన భారత్:

ప్రపంచ కప్ సాధనే లక్ష్యంగా బ్యాటింగ్‌కు దిగిన ఇన్నింగ్స్ రెండో బంతికే భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్‌ వికెట్ కోల్పోయింది.18 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ కూడా మొదటి పవర్ ప్లేలోనే మలింగా బౌలింగ్‌లో వెనుతిరగడంతో భారత్ ఇబ్బందులలో పడింది.మూడో స్థానంలో నిలకడగా బ్యాటింగ్ చేసిన గౌతమ్ గంభీర్,విరాట్ కోహ్లీతో కలిసి 15 ఓవర్‌లలో 83 పరుగులు జోడించాడు.49 బంతులలో 4 ఫోర్లతో 35 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని దిల్షాన్ 22 వ ఓవర్‌లో అవుట్ చేశాడు.

టాప్ ఆర్డర్‌లో గౌతీ…..మిడిల్ ఆర్డర్‌లో మిస్టర్ కూల్:

ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన నాటి భారత కెప్టెన్ ఎంఎస్ ధోని తన అనుభవాన్ని రంగరించి మరో వికెట్ పడకుండా గంభీర్‌తో కలిసి జట్టును విజయం వైపు నడిపాడు.వారిద్దరూ ఐసీసీ ఫైనల్‌లో నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయి 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.42వ ఓవర్‌లో 127 బంతులలో 9 ఫోర్ల సహాయంతో 97 పరుగులు సాధించి సెంచరీని త్రుటిలో చేజార్చుకుంటూ పెరెరా బౌలింగ్‌లో గంభీర్ బౌల్డ్ అయ్యాడు.విజయానికి 51 పరుగులు అవసరమైన స్థితిలో ధోనీతో జతకలిసిన యువరాజ్ సింగ్ 24 బంతులలో రెండు ఫోర్లతో నాటౌట్‌గా 21 పరుగులు సాధించాడు.ఎంఎస్ ధోని 79 బంతులలో 8 ఫోర్లు,2 సిక్సర్లతో అజేయంగా 91 పరుగులు సాధించడంతో భారత్ పది బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది.

నాటి ఫైనల్‌ మ్యాచ్‌ను నేడు మరోసారి వీక్షించే అవకాశం:

వాంఖడే స్టేడియంలో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకగా 28 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ విశ్వవిజేతగా నిలిచిన భారత రెండో జట్టుగా ధోనీసేన ఘనత సాధించింది.91 పరుగులు చేసినందుకు ధోనిని “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు పొందగా,టోర్నీ మొత్తం బ్యాటింగ్,బౌలింగ్‌లలో అద్భుత ఆల్‌రౌండర్‌ ప్రతిభ కనపరిచిన యువరాజ్ సింగ్‌కు “మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్” లభించింది.ఆ చరిత్రాత్మక విజయాన్ని మరోసారి వీక్షించడానికి భారత క్రికెట్ అభిమానుల కోసం 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ గురువారం పునఃప్రసారం చేయబోతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి